ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కేసులో చంద్రబాబునాయుడు ప్రమేయం నేరుగా వున్నందునే కేసులో ఎ37 నుండి ఎ1గా మార్చామని సిఐడి చీఫ్ ఎన్ సంజరు పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు నిధుల కేటాయింపుకు సంబందించి అధికారులు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ చంద్రబాబు అనుమతులు ఇచ్చారని, ఇందుకు గాను 13 చోట్ల ఆయన సంతకాలను గుర్తించినట్లు తెలిపారు. బుదవారం రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటి సెల్‌లో ఆయన సిఐడి ఎస్‌పి కె ఫకీరప్పతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధినాలను ఎక్కడా పాటించలేదని అన్నారు. ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టి వ్యవహారాన్ని నడిపారని అన్నారు. నేరుగా ఈ డిపార్ట్‌మెంట్ చంద్రబాబునాయుడే సంప్రదించేలా ప్లాన్ చేశారని అన్నారు. జీఓల్లో 13 చోట్ల చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో చేసిన సంతకాలున్నాయని అన్నారు. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా చంద్రబాబునాయుడు సంతకం వుందన్నారు. సిమెన్స్‌ను తెచ్చి స్కిల్ సెంటర్లు పెట్టాలన్నది ఎంఓయులో లేదన్నారు. అగ్రిమెంట్ దురుద్దేశపూర్వకంగా చేసుకున్నారని తెలిపారు. స్కిల్ కార్పోరేషన్‌కు రూ 371 కోట్లు విడుదల చేశారని అందులో సీమెన్స్ కంపెనీకి సాఫ్ట్‌వేర్ కోసం రూ 58కోట్లు ఇచ్చారన్నారు. మిగిలిన రూ 313 కోట్లలో రూ 241 కోట్లకు డిజిటెక్ కంపెనీ వద్ద అసలు లెక్కలే లేవన్నారు. ఆ డబ్బును షెల్ కంపెనీలకు దారి మళ్లించారని అన్నారు. ఈ కార్పోరేషన్‌కు తెలుగుదేశం పార్టీకి చెందిన జె వెంకటేశ్వర్లును ఆడిటర్‌గా పెట్టుకున్నారని అన్నారు. జీఓను తుంగలో తొక్కి అగ్రిమెంట్ చేసుకున్నారని అన్నారు. ఈ కేసులో డిజిటెక్ ప్రతినిథిని అరెస్ట్ చేయడంతో పాటు అతనికి చెందిన రూ 32 కోట్లను ఈడి అటాచ్ చేసిందన్నారు. సిఎం, సిఎస్ చెప్పడం వల్లనే నిధులు విడుదల చేశామని అప్పటి ఆర్థిక కార్యదర్శి పివి రమేష్ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు సంతకాలు కూడా ఐదు చోట్ల గుర్తించామని విచారణ చేస్తున్నామని తెలిపారు.










