- నేటి నుంచి మూడు రోజుల పాటు శిఖరాగ్ర సదస్సు
- జోహనెస్‌బర్గ్‌కు తరలివస్తున్న అధినేతలు
- పలు విషయాలు, సమస్యలపై చర్చలు జరిగే అవకాశం
జొహానెస్‌బర్గ్ : బ్రిక్స్ దేశాల 15వ శిఖరాగ్ర సమావేశం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ జరగనున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తరలివస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఆన్‌లైన్ ద్వారా ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఎనిమిదేళ్ల తరువాత బ్రిక్స్ కూటమి అధినేతలంతా తొలిసారి కలవనున్నారు. ప్రపంచాన్నే వణికించిన కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు బ్రేక్ వేసింది. మంగళవారం ఉదయం జొహానెస్‌బర్గ్‌కు బయల్దేరనున్న మోడీ బ్రిక్స్ సమావేశాల సందర్భంగా జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏకధ్రువ ప్రపంచం స్థానే బహుళ ధ్రువ ప్రపంచం బలపడుతున్న ఈ తరుణంలో బ్రిక్స్ కూటమి దేశాలు తమ మధ్య బంధాన్ని మరింత పటిష్టపరచుకునే దిశగా కదలాలి. ఈ శిఖరాగ్రసదస్సు నేడు ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షించడానికి ఇదొక ముఖ్య కారణం.
జి-7 దేశాలను అధిగమించిన బ్రిక్స్ జిడిపి
ప్రపంచ ఆర్థిక నిర్వహణలో బ్రిక్స్ పలుకుబడి పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అది గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నది. ప్రపంచ జిడిపిలో బ్రిక్స్ దేశాలు 31.5 శాతం వాటా కలిగి ఉండగా, జి-7 దేశాలు కేవలం 30.7 శాతం వాటాను కలిగివున్నాయి. కోవిడ్ మహమ్మారి అనంతర ప్రపంచంలో, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, పాశ్చాత్య ఆర్థిక ఆంక్షలు, అమెరికా, చైనా దేశాల మధ్య పెరిగిన విభేదాలు, రష్యాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, 'స్విఫ్ట్ పరిమితులు, ఆర్థిక మాంద్యం వంటి కీలక అంశాలపై బ్రిక్స్ దృష్టి సారించాల్సిన అవసరముంది.
కొత్త సభ్యులు, బహుళ ధ్రువ ప్రపంచం, కొత్త కరెన్సీ పై చర్చకు అవకాశం
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ.. కొన్నిసార్లు బ్రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు) బ్రిక్స్ సాధించిన ఒక విజయమనే చెప్పాలి. అభివద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణ సాయం అందించడం ద్వారా ఈ దేశాల అభివృద్ధిలో ఎన్‌డిబి విశిష్ట పాత్ర పోషిస్తున్నది. అది క్రమంగా విస్తరిస్తూ, ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను సవాలు చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధికోసం వనరులను సమకూర్చడం ఎన్‌డిబి ముఖ్య ఉద్దేశం. బ్రిక్స్ ఐదు సభ్య దేశాలు ఒకటికొకటి సహకరించుకోవడం, స్థానిక కరెన్సీలో వాణిజ్యం విస్తరించడానికి అంగీకరించాయి. గ్లోబల్ ట్రేడ్‌లో అమెరికన్ డాలర్ ప్రస్తుత మూల కరెన్సీ స్థానే స్థానిక కరెన్సీని ప్రోత్సహించడం ఒక మంచి పరిణామమని నిపుణులు అంటున్నారు. డి-డాలరైజేషన్ ప్రక్రియ అంతకంతకూ ఊపందుకుంటోంది.కొత్త కరెన్సీకి విస్తృతమైన చర్చలు, మార్పిడి రేట్లు, చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్ నియంత్రణ కోసం యంత్రాంగాల ఏర్పాటు అవసరం. రాబోయే బ్రిక్స్ సమ్మిట్‌లో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్‌కు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు.
బ్రిక్స్‌లో చేరటానికి ఇతర దేశాల ఆసక్తి
ఇటు బ్రిక్స్‌లో చేరటానికి అనేక దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. 23 దేశాలు సమూహంలో చేరాలనే కోరికను వ్యక్తం చేయడంతో బ్రిక్స్ విస్తరణ అనేది మీడియా దృష్టిని చాలా ఆకర్షించే అంశం. ప్రస్తుత మందగమనం ఉన్నప్పటికీ, చైనా నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ) ప్రాతిపదికన మొదటిది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత కారణంగా బహుశా దాని చేరిక జరిగే అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. దీంతో బ్రిక్స్‌లోకి ఇతర దేశాలను చేర్చుకోవటం పైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ నిపుణులు తెలుపుతున్నారు.
'పశ్చిమ దేశాల'తో సమస్యలపై చర్చ
బ్రిక్స్ దేశాల అంతర్జాతీయ సంబంధాలను, ముఖ్యంగా పశ్చిమ దేశాలతో వారి తరచుగా సమస్యలు ఎదురవుతున్నందున, దీనిపై చర్చించడానికి ఇది అనువైన సమయం. అయితే, దీనికి ముందు, బ్రిక్స్ దేశాల మధ్యనే ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు అన్నారు. సభ్య దేశాలు ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, శ్రేయస్సు లక్ష్యాలు వంటివి బ్రిక్స్ దేశాలు కొనసాగించాలని సూచించారు.