Aug 30,2023 07:10

విచ్ఛిన్నం, ఆర్థిక బలవంతం చేయాలని చూస్తున్న శక్తుల చర్యలను అడ్డుకోవాలని, చైనా అధినేత సీ జిన్‌పింగ్‌ తాజా సమావేశంలో పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో డిజిటల్‌ ఎకానమీ, హరిత వృద్ధి, సరఫరా వ్యవస్థల వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారం అందించుకోవాలని కోరారు. అంతర్జాతీయ రంగంలో పెద్ద గొంతులేసుకొని, కండల ప్రదర్శనలతో తమ స్వంత నిబంధనలను రుద్దాలని చూస్తున్నవారి తీరు ఆమోదం కాదని, ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

            ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నగరమైన జోహానెస్‌బర్గ్‌లో ''బ్రిక్స్‌ (బిఆర్‌ఐసిఎస్‌)'' కూటమి (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పదిహేనవ శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా ముగిసింది. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను ఈ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు. వాటికి అంగీకారమైతే 2024 జనవరి ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయి సభ్యులుగా పరిగణిస్తారు. న్యూయార్క్‌ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 2006లో జరిగిన ఒక సమావేశంలో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనాలతో ఏర్పడిన ఆర్థిక కూటమిని బ్రిక్‌ అని పిలిచారు. తరువాత 2010లో దక్షిణాఫ్రికా చేరటంతో అది బ్రిక్స్‌గా మారింది. ఇప్పుడు విస్తరణ బాటలో ఉన్నందున బ్రిక్స్‌ ప్లస్‌ అంటారా లేక మరేదైనా పేరు పెడతారా అన్నది చూడాల్సి ఉంది. బ్రిక్‌ లేదా బ్రిక్స్‌ కూటమి అని పేరు పెట్టటానికి గోల్డ్‌మన్‌ శాచస్‌ కంపెనీ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ చేసిన వర్ణన ప్రేరణ అని చెబుతారు. ఇలాంటి కూటమి ఏర్పడితే అది 2050 నాటికి ప్రపంచ ఆర్థిక రంగంలో మిగతా వాటిని వెనక్కు నెడుతుందని 2001లో జోశ్యం చెప్పాడు. బ్రిక్స్‌ విస్తరణ, దాని తీరుతెన్నులను చూస్తే అంతకంటే ముందే దాని ప్రభావం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిదానమే ప్రధానం అన్నట్లుగా ముందుకు పోతున్న ఈ కూటమి నేడు పశ్చిమ దేశాల పెత్తనం, తంటాలమారితనాన్ని ఎదుర్కొనే దిశగా ఉంది. నూతన ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ కోసం చూస్తున్న ఈ కూటమి నడక నల్లేరు మీద బండిలా ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతుందని చెప్పలేము. ఈ సమావేశాల్లో లూలా డసిల్వా (బ్రెజిల్‌), సెర్గీలావరోవ్‌ (రష్యా విదేశాంగ మంత్రి), నరేంద్ర మోడీ (ఇండియా), సీ జిన్‌పింగ్‌ (చైనా), సిరిల్‌ రమాఫోసా (దక్షిణాఫ్రికా) పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద అంతర్జాతీయ కోర్టు వారెంటు జారీ చేసింది. ఆ కోర్టును రష్యా అంగీకరించలేదు. బ్రిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా కోర్టు ఒప్పందంలో సభ్యురాలిగా ఉన్నందున తలెత్తే పరిస్థితి కారణంగా పుతిన్‌ హాజరు కాలేదు.
           పారిశ్రామిక, సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకోవాలి. విచ్ఛిన్నం, ఆర్థిక బలవంతం చేయాలని చూస్తున్న శక్తుల చర్యలను అడ్డుకోవాలని, చైనా అధినేత సీ జిన్‌పింగ్‌ తాజా సమావేశంలో పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో డిజిటల్‌ ఎకానమీ, హరిత వృద్ధి, సరఫరా వ్యవస్థల వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారం అందించుకోవాలని కోరారు. అంతర్జాతీయ రంగంలో పెద్ద గొంతులేసుకొని, కండల ప్రదర్శనలతో తమ స్వంత నిబంధనలను రుద్దాలని చూస్తున్నవారి తీరు ఆమోదం కాదని, ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ఒక దేశం- ఒక కూటమి పెత్తనం లేకుండా ముందుకు వస్తున్న బహుళధ్రువ ప్రపంచం, సాంప్రదాయక విలువలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నూతన ఉదారవాద విధానాలు ముప్పు తెస్తున్నట్లు వీడియో ద్వారా పుతిన్‌ చేసిన ప్రసంగంలో పేర్కొన్నాడు. అమెరికా పేరు పెట్టకుండా దాని గురించే మాట్లాడినట్లు విశ్లేషకులు టీకా తాత్పర్యం చెప్పారు. పశ్చిమ దేశాలు బ్రిక్స్‌ కూటమి తమకు ముప్పుగానూ, జి-7కు పోటీగా దాన్ని మార్చేందుకు చైనా చూస్తున్నదనే అనుమానాలు పశ్చిమ దేశాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విస్తరణలో భాగంగా చేరుతున్న దేశాలు కూడా పశ్చిమ దేశాల బాధితులే కావటం గమనించాల్సిన అంశం. ప్రపంచంలో ఏ దేశమూ గతంలో మాదిరి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో నడవాలని కోరుకోవటం లేదు.
            బ్రిక్స్‌ దేశాల్లోని జనాభా 2022 లెక్కల ప్రకారం 324 కోట్ల మంది, అంటే ప్రపంచంలో నలభై శాతం మంది. భారత్‌, చైనాల్లోనే 382 కోట్ల మంది ఉండగా మిగిలిన మూడింటిలో 42 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ సాధారణ జిడిపిలో ఈ కూటమి వాటా 2000లో 11.74 శాతం కాగా పదేళ్లలో 17.95, 2022 నాటికి 26 శాతానికి పెరిగింది. అదే పిపిపి పద్ధతిలో చూస్తే 31.5 శాతానికి పెరిగి జి-7 దేశాల 30 శాతాన్ని దాటింది. 2028 నాటికే బ్రిక్స్‌ వాటా 50 శాతం దాట నుందని అంచనా. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2022కు చూస్తే జనాభా వాటా 43.92 నుంచి 41.42 శాతానికి తగ్గింది. ప్రపంచ ఎగుమతుల్లో వాటా 8.2 నుంచి 18, ప్రపంచ వాణిజ్యంలో 7.51 నుంచి 18 శాతానికి, విదేశీ మారకద్రవ్య నిల్వ 281.2 నుంచి 4,581 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఆంక్టాడ్‌ 2023 గణాంకాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 2001-2021 కాలంలో 84 నుంచి 355 బి.డాలర్లకు పెరిగాయి. ఈ మొత్తంలో చైనా వాటా సగానికి పైగా ఉంది. ఒక్క జనాభాలో భారత్‌ ప్రథమ స్థానంలో ఉండటం తప్ప మిగిలిన అన్ని అంశాలలో చైనా ఎంతో ఎత్తున ఉంది.
             జోహానెస్‌బర్గ్‌ శిఖరాగ్ర సభలో మొత్తంగా భిన్న నేపథ్యాల పూర్వరంగంలో దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, ప్రపంచ సమస్యలపై ఏకీభావం సాధించేందుకు సంప్రదింపులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పం వెల్లడైంది. సమీకృత అభివృద్ధి, ప్రపంచ సవాళ్లు, దేశాల మధ్య సంబంధాలను పటిష్టపరుచుకోవాలన్న వాంఛను నేతలు వెలిబుచ్చారు. సభ జరిగింది ఆఫ్రికా ఖండంలో గనుక సహజంగానే దాని ఇతివృత్తానికి కేంద్ర స్థానం లభించింది. ప్రపంచ పేద దేశాలు ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలతో సంబంధాలు, సహకారం గురించి నేతలందరూ మాట్లాడారు. ఈ సభకు పుతిన్‌ రాకపోవటం గురించి పశ్చిమ దేశాల్లో ఇంకేముంది బ్రిక్స్‌లో విబేధాలు, రష్యా పలుకుబడికి గండిపడింది అన్నట్లుగా విశ్లేషణలను వండివార్చారు. ముందే చెప్పుకున్నట్లు ఆతిథ్య దేశాన్ని ఇరకాటంలో పెట్టకూడదన్న పరిణితి పుతిన్‌, ఇతర దేశాధినేతల్లో వెల్లడైంది. స్వయంగా హాజరు బదులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొని నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారు. బ్రిక్స్‌ను విస్తరించాలన్న ఆలోచన కొత్తగా వచ్చింది కాదు. 2013లో దక్షిణాఫ్రికా అధ్యక్ష స్థానంలో ఉన్నపుడు ఆఫ్రికా యూనియన్‌కు స్థానం కల్పించాలని కోరింది. తరువాత 2017లో బ్రిక్స్‌ ప్లస్‌ (బ్రిక్స్‌తో పాటు ఇతర దేశాలు) అన్న భావనను చైనా ముందుకు తెచ్చింది. తమకు సభ్యత్వం ఇవ్వాలని ఇరాన్‌, అర్జెంటీనా దరఖాస్తు చేసుకోవటంతో 2022లో బ్రిక్స్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మొత్తం నలభై దేశాలు ఆసక్తి వెల్లడించటంతో పాటు 23 లాంఛనంగా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి పైన పేర్కొన్న ఆరు దేశాలకు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చేందుకు నిర్ణయించారు.
ప్రపంచ జనాభాలో ఈ కూటమి దేశాల్లో 46.5 శాతానికి, జిడిపి 30 శాతానికి పెరగనుంది. విస్తరణతో ఈ కూటమి దేశాల చమురు వాటా ప్రపంచంలో 20.4 నుంచి 43.1 శాతానికి పెరగనుంది. ప్రపంచ సహజ వాయువులో 30 శాతం కలిగి ఉన్నాయి, ప్రపంచ చమురు ఎగుమతుల్లో వాటా 18 నుంచి 25.1 శాతానికి పెరగనుంది. ప్రపంచ ఆర్థిక రంగం మీద పెత్తనం చేస్తున్న డాలరును వెనక్కు నెట్టి బ్రిక్స్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఆలోచన మీద కూడా జోహానెస్‌బర్గ్‌ సమావేశాల్లో చర్చ జరిగింది. కొన్ని దేశాల సందేహాల కారణంగా ముందుకు పోలేదు. ఉమ్మడి కరెన్సీని పంచుకోవటం గురించి బ్రెజిల్‌ ప్రతిపాదన ముందుకు తేగా మన దేశం భిన్న వైఖరిని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుత సమావేశ ఎజెండాల్లో లేదని దక్షిణాఫ్రికా పేర్కొన్నది. డాలర్లకు బదులు ఆయా దేశాల కరెన్సీలతో లావాదేవీలు జరపాలని చైనా, రష్యా పేర్కొన్నాయి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఈ దేశాలు సహజంగా డాలరును వ్యతిరేకిస్తున్నాయి. డాలర్లలో లావాదేవీల వాటా 2015లో వాటి వాటా 90 శాతం ఉండగా 2020 నాటికి 46 శాతానికి, తరువాత ఇంకా తగ్గింది. మన దేశం మాత్రం ఎగుమతులు-దిగుమతులకు 80 శాతం డాలర్లనే వాడుతున్నది.
ప్రస్తుత విస్తరణ, రానున్న రోజుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల పెరుగుదలను చూసినపుడు ప్రపంచ బలాబలాల్లో ఈ కూటమి కీలకంగా మారనున్నదనేది స్పష్టం. మన దేశం, చైనాతో సహా మిగిలిన దేశాలన్నీ బహుముఖ ప్రపంచ వ్యవస్థ ఉండాలని కోరుతున్నాయి. ఈ కూటమిలో ఉన్న దేశాల ఆర్థిక రంగాలను చూసినపుడు తేడా చాలా ఎక్కువగా ఉంది. అందువలన వాటి ప్రయోజనాలు, ప్రాధాన్యతలు కూడా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మన దేశం చైనాను అధిగమించాలని చూస్తున్నట్లు బహిరంగంగానే వాంఛ వెల్లడిస్తున్నది. వివాదాస్పద అంశాలపై కూడా ఈ కూటమిలో పూర్తి ఏకీభావం లేనందున అంగీకృత అంశాల మీదనే కేంద్రీకరణ జరుగుతున్నది. ఇండో-పసిఫిక్‌ పేరుతో చైనా వ్యతిరేక కూటమి నిర్మాణానికి పూనుకున్న అమెరికాకు దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగేందుకు అవకాశం ఉండాలంటూ మన దేశం మద్దతు ఇస్తున్నది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను సమర్ధించనప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలగకుండా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఎవరికీ నొప్పి తగలకూడదనే వైఖరితో మన దేశం గడసాము గారడీలు చేస్తున్నది.
లండన్‌లోని సోయాజ్‌ చైనా సంస్థ డైరెక్టర్‌ స్టీవ్‌ సాంగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ సభ్యదేశాలు ఉపరితలంతో ఒకేవిధంగా లేవని, అయినప్పటికీ ఎవరూ పశ్చిమ దేశాల ఆధిపత్య ప్రపంచంలో జీవించకూడదని అందరూ అనుకుంటున్నట్లుగా చూపేందుకు సీ జిన్‌పింగ్‌ చూశారని, చైనా వారు చూపుతున్న ప్రత్యామ్నాయంలో నిరంకుశులు తమ స్వంత దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చని, ప్రజాస్వామిక అమెరికా, ఐరోపా దేశాలు రుద్దిన షరతులను అంగీకరించకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి పథాన్ని కనుగొనవచ్చనే భావన ఉన్నదని అన్నాడు. తమకు గానీ మరొక దేశానికి గానీ ప్రత్యర్ధిగా రాజకీయ ప్రత్యర్ధి తయారవుతున్నట్లుగా తాము భావించటం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులవాన్‌ సమావేశ ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు, వక్రీకరించేందుకు చూశారు. కొత్తగా బ్రిక్స్‌లో చేరిన ఆరు దేశాల్లో ఏ ఒక్కటీ అమెరికా వ్యతిరేకమైనది లేదని వాషింగ్టన్‌ లోని క్విన్సీ సంస్థ డైరెక్టర్‌ సరంగ్‌ షిడోర్‌ అన్నాడు. ఈ సమావేశాల తరువాత పశ్చిమ దేశాలకు చెందిన విశ్లేషకులు, మీడియా వార్తల తీరు వక్రీకరణ, కూటమిలో అనుమానాలను రేకెత్తించేదిగా, తంపులు పెట్టేదిగా ఉందని చెప్పవచ్చు.

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు