Sep 16,2022 06:43

చిన్న రాష్ట్రమైన గోవాలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు బిజెపి అధికార దాహానికి అద్దం పడుతున్నాయి. 40 శాసనసభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బిజెపికి సొంతంగా 20 మంది సభ్యులున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజిపి)కి చెందిన ఇద్దరు సభ్యులతో పాటు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు కూడా బిజెపికి మద్దతు ఇస్తున్నారు. శాసనసభలో బిజెపికి ఆధిక్యత ఉందని అర్ధం చేసుకోవడానికి ఈ సంఖ్యలు చాలు. అయినా, కాంగ్రెస్‌ పార్టీని కబళించిందంటే ప్రతిపక్షాన్ని బతకనిచ్చేది లేదన్న సంకేతాలు ఇవ్వడమే! కాంగ్రెస్‌కున్న 11 మంది శాసనసభ్యులలో ఏకంగా 8 మందిని స్వాహా చేసింది. ఇదే ఊపుతో మరికొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ లోనూ, పంజాబ్‌ లోనూ తమ పార్టీ ప్రభుత్వాలను కూల్చడానికి వేల కోట్ల రూపాయలను బిజెపి వెదజల్లుతోందని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. తెలంగాణ, తమిళనాడుల్లోనూ షిండేలను సృష్టిస్తామంటూ బిజెపి నేతలు ఇప్పటికే పేట్రేగిపోతున్నారు. కర్ణాటక, మేఘాలయ, మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి దిగజారుడు రాజకీయాలకు ఉదాహరణలెన్నో! తాజాగా ఫిరాయింపుల పర్వానికి తెరతీసిన గోవాలో గతంలో కూడా ఇటువంటి వికృత క్రీడనే ఆడిన చరిత్ర బిజెపిది. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతను సాధించినా ఆరు నెలలు గడవకమందే ఫిరాయింపుల పర్వానికి తెరతీయడం, ప్రతిపక్షాన్ని మిగల్చకుండా చేయడం బిజెపి బరితెగింపునకు నిదర్శనం.
        ఇలా మూకుమ్ముడిగా ఫిరాయించిన వారిలో గోవా మాజీ మఖ్యమంత్రితో పాటు పలువురు సీనియర్‌ నాయకులు ఉండటం కాంగ్రెస్‌ పార్టీ దుస్థితికి నిదర్శనం. ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆ పార్టీ బలహీనతను ఎత్తిచూపుతోంది. గోవాతో పాటు అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు బిజెపి లోకి ఫిరాయించడమో, లేదా పార్టీ నుండి తప్పుకోవడమో చేస్తున్నారు. దీంతో ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభానికి ఆ పార్టీ ప్రయాణం చేస్తోంది. పైకి లౌకికతత్వం గురించి మాట్లాడుతున్నప్పటికీ ఆచరణలో మృదు హిందుత్వ విధానాన్నే అనుసరిస్తున్న కాంగ్రెస్‌ ఆచరణలో హిందూ మతతత్వ శక్తులకు ప్రత్యామ్నాయంగా నిలవలేకపోతోంది. మతతత్వాన్ని సవాల్‌ చేయడానికి బదులుగా రాజీ పడుతుండటంతో సైద్ధాంతికంగానూ బలహీనపడుతోంది. దీంతో లౌకిక ప్రతిపక్ష పార్టీలను సమీకరించే స్థితిని ఆ పార్టీ కోల్పోతోంది. పార్టీని వీడేది లేదంటూ ఆరు నెలల క్రితం ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో దేవాలయాల్లో ప్రమాణం చేసిన గోవా కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఇప్పుడు తమ ఫిరాయింపులకు ఆ దేవుడే అనుమతిచ్చారని చెబుతుండటం దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ పరిణామం తరువాతైనా కాంగ్రెస్‌ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటుందేమో చూడాలి.
         ఏక పార్టీ వ్యవస్థ స్థాపన దిశలో బిజెపి చేస్తున్న ఈ అడ్డగోలు ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి, లౌకకవాదానికి ప్రమాదకరం. వీటిని ఎదిరించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉంది. నిజానికి రోజురోజుకి పెరుగుతున్న ధరలు, కుదించుకుపోతున్న ఆదాయాలు, తరుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సామాన్యుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ప్రజానీకం సతమతమౌతున్న ఈ సమయాన్నే వినియోగించుకంటూ బిజెపి తన మతతత్వ, కార్పొరేట్‌ ఎజెండాను దేశంపై రుద్దుతోంది. అందుకే, వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి లౌకిక, ప్రజాతంత్ర శక్తులు పెద్ద ఎత్తున కృషి చేయాలి. కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేయడంతో పాటు, వారి కష్టాలకు కారణమవుతున్న నయా ఉదారవాద విధానాల మీదా పోరాటానికి సిద్ధం చేయాలి. ఈ తరహా ఐక్యతే బిజెపి అనుసరించే కుత్సిత రాజకీయాల నుండి దేశాన్ని రక్షిస్తుంది.