
మార్చి రెండవ తేదీన వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో బాగా తక్కువ తేడాతో అయినా బిజెపి త్రిపురలో అధికారానికి వచ్చింది. ఆ ప్రకటన వెలువడింది మొదలు త్రిపురలో భయానక హింసాకాండ సాగుతోంది. పరిస్థితి ఇలా వుంటుందని ముందుగా ఊహించిందే. మార్చి 6 నాటికి, రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ముఠాలు పాల్పడిన దాడులు, హింసాత్మక సంఘటనలు దాదాపు వెయ్యి వరకు వున్నాయి. సిపిఎం, వామపక్ష సంఘటన, కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులపై భౌతిక దాడులు జరిగాయి. వారి ఇళ్ళను తగలబెట్టారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. అన్నింటికంటే అత్యంత హేయమైన, విషపూరితమైన దాడి ఏమిటంటే ప్రజల జీవనోపాధులను దెబ్బతీయడం. రబ్బరు తోటలు, పంటలను తగలబెట్టడం, వారి ఇ-రిక్షాలను, వాహనాలను తిరగడానికి వీల్లేకుండా ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బిజెపి మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఇదే తరహాలో హింస, భయోత్పాతం చోటు చేసుకుంది. వామపక్షాల కార్యకర్తల కుటుంబాలను బెదిరించడం, బలవంతంగా వసూళ్ళకు పాల్పడడం వంటి చర్యలతో ఐదేళ్ళూ పాలక పార్టీ ఇదే తరహా అణచివేతను కొనసాగించింది. ఈ కాలంలో సిపిఎం సభ్యులు, మద్దతుదారులు 25 మంది హత్యకు గురయ్యారు. ఈసారి, ప్రతిపక్షాలను అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వామపక్షాలు, కాంగ్రెస్‌కు కలిపి 35 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. మరోవైపు బిజెపి సీట్లు, ఓట్లు రెండూ కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తీవ్ర ఆగ్రహం, నిరాశా నిస్పృహలతో బిజెపి ఇంత విచ్చలవిడిగా ఈ దాడులకు పాల్పడినట్లు కనిపిస్తోంది.
ఎన్నికల్లో పాలక పార్టీ గెలిచినప్పటికీ ప్రతిపక్షంపై ఎందుకింత తీవ్రంగా, ఉధృతంగా దాడులకు తెగబడుతోందని త్రిపుర వెలుపల ప్రజలు ప్రశ్నించవచ్చు. ఇక్కడే వర్గ కోణం ముందుకు వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగానే, త్రిపురలో కూడా దశాబ్దాల తరబడి సాగించిన ప్రజా ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే కమ్యూనిస్టు ఉద్యమం నిర్మితమైంది. సిపిఎం నిర్మాణాన్ని ధ్వంసం చేయడం, ఆ పార్టీకి మద్దతుగా వున్న ప్రజలను భయకంపితులను చేయడమే లక్ష్యంగా త్రిపురలో అణచివేత, హింస కొనసాగించాలన్నది బిజెపి ప్రణాళికగా వుంది. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా... కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమంపై ఈ వర్గ దాడి కొనసాగుతోంది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నాశనం చేయాలన్నదే దాని లక్ష్యం.
ఈ నెల 8వ తేదీన రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మాణిక్ సాహా ఈ సంఘటనలపై స్పందించిన తీరును బట్టే ఈ మొత్తం హింసాకాండ వెనుక పాలక పార్టీగా బిజెపి హస్తం వుందనేది స్పష్టమవుతోంది. కొన్ని బాధిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, సాహా మాట్లాడుతూ...ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, స్వార్ధ ప్రయోజనాలు కలిగిన కొంతమంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. అంటే ఇక్కడ బిజెపిని అప్రతిష్ట పాల్జేయడానికి సిపిఎం, ఇతర ప్రతిపక్షాల కార్యకర్తలు తమ స్వంత ఇళ్ళకు, దుకాణాలకు, కార్యాలయాలకు తామే నిప్పంటించుకుంటున్నారన్నమాట !
2018కి ముందు తమ హయాంలో సిపిఎం, వామపక్ష సంఘటన కలిసి ప్రతిపక్షాన్ని అణచివేయడానికి ప్రయత్నించాయని దూషణలకు దిగడం మరో ఎత్తుగడ. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ తరహా అసత్యపు ప్రచారానికి పాల్పడ్డారు. త్రిపుర ఎన్నికల ప్రచార సభల్లో ఏవైతే మాట్లాడారో, అవే మాటలు మార్చి 2వ తేదీ సాయంత్రం న్యూఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాల్లో కూడా ప్రతిధ్వనించాయి. గతంలో ఒక పార్టీ జెండా మాత్రమే అగర్తలా, ఇతర చోట్ల ఎగరడానికి ఎలా అనుమతించబడిందనేది మోడీ పదే పదే చెప్పారు. మరే ఇతర పార్టీ పతాకమైనా ఎగరేయాలని అనుకునేవారు హింసాత్మక దాడులను ఎదుర్కొనాల్సి వుండేదన్నారు. అలా పాలక పార్టీగా సిపిఎం నియంతృత్వం గురించి బిజెపి పదే పదే మాట్లాడుతున్నదంతా ప్రస్తుత వాస్తవిక పరిస్థితుల ముందు పూర్తిగా తేలిపోయింది.
ఉదాహరణకు వామపక్ష సంఘటన ప్రభుత్వం అధికారంలో వున్నపుడు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం అనేకమంది పరిశీలకులను విస్మయపరిచింది. అంతకు ముందు కూడా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వున్నపుడు, అగర్తలా చుట్టుపక్కల కాంగ్రెస్ జెండాలు ప్రధానంగా ఎగిరేవి. బిజెపి పాలనలో 2021 నవంబరులో అగర్తలా మున్సిపల్ ఎన్నికలు జరిగినపుడు రిగ్గింగ్ దారుణంగా జరిగింది. 51 సీట్లకు 51 సీట్లూ బిజెపినే గెలుచుకుంది. కానీ 1995 డిసెంబరులో, లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో ఎన్నికలు జరిగినపుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిల్‌లో మెజారిటీ సంపాదించింది. ఆ తర్వాత కూడా, కార్పొరేషన్‌లో కాంగ్రెస్ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు గెలుచుకుంటూ వచ్చింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 40 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుంది.
గత ఐదేళ్ళలో బిజెపి పాలనలో ప్రతిపక్ష పార్టీల హక్కులు పూర్తిగా తిరస్కరించబడ్డాయి. ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులు దారుణ అణచివేతకు గురయ్యాయి. ఈ ఐదేళ్ళలో 16 మంది సిపిఎం ఎంఎల్‌ఎలు తాము ఎన్నికైన చోట సాధారణ కార్యకలాపాలు సైతం నిర్వహించలేకపోయారు. ప్రజాప్రతినిధులుగా తమ నియోజక వర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేకపోయారంటేనే నిరంకుశ-ఫాసిస్ట్ వ్యవస్థ త్రిపురలో ఎంతలా పాతుకుపోయిందో అంచనా వేయవచ్చు. 2021 సెప్టెంబరులో తన నియోజకవర్గంలో బ్లాక్ స్థాయిలో ప్రజా ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్ పట్టుబట్టినపుడు బిజెపి గూండాలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంపై దారుణమైన రీతిలో దాడి కూడా జరిగింది.
అణచివేత, బెదిరింపుల పాలన ద్వారా సిపిఎంను, వామపక్ష సంఘటనను ఐదేళ్ళ పాటు నిరంతరాయంగా నిర్వీర్యం చేసేందుకు, బలహీనపరిచేందుకు బిజెపి ప్రయత్నించింది. ఎన్నికలలో తాము పేలవమైన విజయం పొందడానికి ఇదొక ముఖ్యమైన కారణమని బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమికి బాగా తెలుసు. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చిన వామపక్షాలు ఎన్నికల ప్రచారంలో ధైర్యంగా పనిచేశాయి. వామపక్షాలు, ప్రతిపక్షంపై ఇప్పటికీ బిజెపి హింసాకాండ కొనసాగుతున్నదంటే అందుకు ఆ పార్టీలో నెలకొన్న భయాలు, అభద్రతా భావాలే కారణమని చెప్పవచ్చు.
తమపై సాగుతున్న హింసాకాండ నుండి తప్పించుకోవడం, ప్రజలతో సంబంధాలను కొనసాగించడ మనే బృహత్తర కర్తవ్యాన్ని సిపిఎం, వామపక్ష సంఘటన చేపట్టాయి. ఈ ప్రయత్నంలో, వాటికి ప్రజాతంత్ర, ప్రగతిశీల, లౌకిక శక్తులన్నిటి మద్దతు, తోడ్పాటు కావాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)