Nov 11,2022 06:56

రాష్ట్ర విభజన చట్ట ప్రకారం అమలు చేయాల్సిన హామీలను... అమలు చేయకుండా, రాజధాని లాంటి అంశాల్లో బిజెపి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య దోబూచులాడుతూ రాష్ట్ర ప్రజలను ముంచేస్తున్నది. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా...విద్యుత్‌ మీటర్లు బిగించడం, ఓడరేవులు, రోడ్లు, గనులు, ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ లాంటి విధానాలను వేగంగా అమలు జరుపుకుంటోంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గర్జించి ...నాటి పాలకులపై పోరాడి ఉక్కు పరిశ్రమను సాధించుకున్న గడ్డపై... ఆ నినాదానికి కేంద్ర స్థానమైన విశాఖ నగరంపై ప్రధానమంత్రి కాలు మోపడాన్ని ఆంధ్ర ప్రజలు హర్షించరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా తీరని ద్రోహం చేసిన కేంద్ర పాలకులకు రాష్ట్ర పాలకులు స్వాగత ఏర్పాట్లు చేయడం విడ్డూరం. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా ఎనిమిది సంవత్సరాలుగా మోసం చేస్తున్న కేంద్ర సర్కారును రాష్ట్ర ప్రజల తరపున నిలదీసి హక్కులు సాధించుకోవలసిన పాలకులు...మోడీ ముందు మరింతగా మోకరిల్లడానికి సకల ఏర్పాట్లు చేస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి తలవంపులు తెస్తున్నారు.
        ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో సెక్షన్‌ 46(2) ప్రకారం ''రాష్ట్రం లోని వెనుకబడిన ప్రాంతాలకు తగిన ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాలను అభివృద్ధి ప్యాకేజీ రూపంలో ఇవ్వాలి.'' సెక్షన్‌ 46(3)లో ''కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రత్యేకించి రాయలసీమ మరియు ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుంది'' అని పేర్కొన్నారు.
         అలాగే ''రాయలసీమ జిల్లాలు మరియు ఉత్తర కోస్తా ఆంధ్రా అభివృద్ధికి ప్యాకేజి కె.బి.కె (కోరాపుట్‌, బోలాంగిరి, కలహండి), బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజి ఇస్తున్నాము'' అని 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధానమంత్రి ప్రకటించారు. బుందేల్‌ఖండ్‌కు 9 వేల కోట్లు, కె.బి.కె ప్యాకేజి కింద 15 వేల కోట్ల ప్రత్యేక సహాయాన్ని ఈ ప్రాంతాలకు ఇచ్చారు. అలాంటి సహాయం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇస్తామన్నారు.
        ఈ చట్టాన్ని, నాటి ప్రధాని ప్రకటనను బిజెపి బలపరచడమే కాకుండా ఆంధ్రకు ప్రత్యేక హోదా కాల పరిమితి ఐదేళ్ళు కాదు...పదేళ్ళు కావాలని పోరాడి సాధించామని చెప్పుకున్నారు. 2016 సెప్టెంబర్‌ 7న నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. 2018 ఫిబ్రవరి 1న ఇదే ఆర్థికమంత్రి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా నిలువునా ముంచారు. నాటి నుండి బిజెపి నాయకులు అనేక మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలు చేస్తూ చివరకు హోదా లేదు పొమ్మన్నారు.
 

                                                                 రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు

రాష్ట్ర విభజన నాటికి వున్న 13 జిల్లాల్లో రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు మొత్తం ఏడు జిల్లాలు అత్యంత వెనుకబడిన జిల్లాలు. 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో 13వ స్థానంలో, విజయనగరం 12వ స్థానంలో వుండగా, అనంతపురం 11వ స్థానంలో, కర్నూలు 10వ స్థానంలో, చిత్తూరు 9వ స్థానంలో, కడప జిల్లా 7వ స్థానంలో వున్నాయి (ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం కూడా ఈ తరహా వెనుకబడినదే). ఈ జిల్లాల్లో వస్తున్న ఆదాయంలో వ్యవసాయం, పరిశ్రమల వాటా చూస్తే వెనుకబాటు ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది. 2012-13 లెక్కల ప్రకారం వ్యవసాయం ద్వారా శ్రీకాకుళం 24.70 శాతం, విజయనగరం 26.53 శాతం, విశాఖ 9.63, చిత్తూరు 23.89, అనంతపురం 25.18, కర్నూలు 26.10 శాతం ఆదాయం రాగా, పారిశ్రామిక రంగంలో వరుసగా 20.14, 19.21, 34.96, 26.48, 28.28, 23.47, 23. 63 శాతంగా వుంది. అంటే ఈ జిల్లాల మొత్తం ఆదాయంలో వ్యవసాయం, పరిశ్రమల వాటా కలిపినా సగటున 50 శాతానికి మించి లేదు. ఈ జిల్లాల్లో సాగు అవుతున్న వ్యవసాయ భూమికి అతి తక్కువ సాగునీటి వనరులు వున్నాయి. ఉదాహరణకు కర్నూలులో 27.69 శాతం భూమికి సాగునీటి వనరులు వుండగా, అనంతపురం జిల్లాలో కేవలం 14.61 శాతంగా వుంది. ఇందులో కూడా రైతులు అప్పులు చేసి ఏర్పాటు చేసుకున్న బోర్ల వ్యవసాయానిదే అధికభాగం.
           ఈ పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధించడం ద్వారానే రాష్ట్ర పురోభివృద్ధి, ఐక్యత సాధ్యమవుతుంది. అందుకే రాష్ట్ర విభజన చర్చ సందర్భంగా 2010 డిసెంబర్‌ 31న కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిషన్‌ ''హైదరాబాద్‌ చుట్టూ అభివృద్ధి కేంద్రీకరిరచబడడం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర తీవ్రంగా వెనుకబడ్డాయని'' చెప్పింది. దీనికి రాష్ట్ర విభజన పరిష్కారం కాదు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి విధానాలు అనుసరించాలని సూచించింది. అయినా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజిపై పాలకులు హామీ ఇవ్వాల్సి వచ్చింది.
 

                                                      వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి భిక్ష కాదు, హక్కు

రాష్ట్రాభివృద్ధికి విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13లో 7 రకాల పరిశ్రములు, 11 జాతీయ విద్యాసంస్థలు స్థాపించాలని ప్రతిపాదించారు. ఒక్క పరిశ్రమ పూర్తి కాలేదు. 2015-16 నాటి లెక్కల ప్రకారం విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.11,672 కోట్లు కావలసి వుండగా, ఇప్పటి వరకు రూ.700 కోట్లకు మించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రాంతాల అభివృద్ధికి 24 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాల్సిన కేంద్రం మూడు సంవత్సరాలు ఏడాదికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చి తీరని ద్రోహం చేసింది. ఉత్తరాంధ్ర లోని సుజల స్రవంతి, వంశధార వంటి ప్రాజెక్టులు, రాయలసీమ లోని హంద్రీ నీవా, గాలేరు-నగరి లాంటి సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక పూర్తిస్థాయి ఉపయోగంలోకి రాలేదు. విజయనగరంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్శిటీ, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో నడుస్తున్నాయి. తిరుపతిలో ఐఐటి, విశాఖపట్నం ఐఐఎం, పెట్రోలియం యూనివర్శిటీ, చిత్తూరు జిల్లా ఐఐఎస్‌ఈఆర్‌, కర్నూలులో ఐఐఐటి విద్యాసంస్థలు విభజన చట్టం ప్రకారం ఈ ప్రాంతాలకు రావలసిన హక్కులు. కాని వీటిని అమలు చేయడంలో గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన చేస్తున్న బిజెపి మోసం చేస్తుంటే, వాటిని సాధించడంలో గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బిజెపికే సాగిలపడడానికి పోటీలు పడుతున్నాయి.
            కడప జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో భారీ ఉక్కు పరిశ్రమ, కర్నూలులో రైల్వే కోచ్‌ల నిర్మాణం, చిత్తూరు జిల్లాలో కండలేరు ప్రాజెక్టు నిర్మాణం లాంటి భారీ హామీలు గాలిలో కలిసిపోయాయి. 2015 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో అనంతపురం జిల్లాలో శంకుస్థాపన చేసిన బెల్‌, నాసెన్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ప్రహరీగోడలు దాటి ముందుకు సాగలేదు. ఖనిజ వనరుల నిలయంగా వున్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి కేంద్ర పాలకులు అనేక ఎత్తులు వేస్తున్నారు. అనంతపురంలో అదానీ ఎనర్జీ గ్రూపుకు 52 వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి భూ సర్వే జరుగుతుంది. కర్నూలు, కడప జిల్లాల్లోని అనేక భూగర్భ నిక్షేపాలను జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారు. విశాఖలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ తెలుగు ప్రజల త్యాగాన్ని అగౌరవపరుస్తూ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
 

                                                                            నయవంచక బిజెపి

ప్రత్యేక హోదా అమలు కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన సాగుతున్న సమయాన, తెలుగుదేశంతో నాలుగు సంవత్సరాల పాలనా భాగస్వామ్యం తెగిన సందర్భంగా రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు రాయలసీమ డిక్లరేషన్‌ పేరిట హంగామా చేసింది. 2018 ఫిబ్రవరిలో కర్నూలులో బిజెపి నాయకులు సమావేశమై రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఇందుకోసం ఆందోళన చేపడతామన్నారు. ఇలాగే ఉత్తరాంధ్రలో హడావుడి చేశారు. వీటికి తోడు రథాలు, దేవాలయాలు, జిల్లాల పేర్ల లాంటి అనేక వివాదాస్పద అంశాల్లో చొరబడి అల్లర్లు సృష్టించి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, రాష్ట్రంలో ఏదో రకంగా బలపడడానికి బిజెపి ప్రయత్నిస్తూనే వుంది.
           రాష్ట్ర విభజన చట్ట ప్రకారం అమలు చేయాల్సిన హామీలను...అమలు చేయకుండా, రాజధాని లాంటి అంశాల్లో బిజెపి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య దోబూచులాడుతూ రాష్ట్ర ప్రజలను ముంచేస్తున్నది. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా, విద్యుత్‌ మీటర్లు బిగించడం, ఓడరేవులు, రోడ్లు, గనులు, ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ లాంటి విధానాలను వేగంగా అమలు జరుపుకుంటోంది.
          రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నది. చట్ట ప్రకారం రాష్ట్రానికి రావలసిన హక్కులను సాధించలేక బిజెపి కి సాగిలపడిపోతోంది. పొరుగున వున్న తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడుతూనే అక్కడి గవర్నర్లు పెడుతున్న ఆటంకాలను ప్రజల మద్దతుతో ఎదుర్కొంటున్నాయి. వాటి అనుభవాలను తీసుకోవడానికి సిద్ధంగా లేని వైసిపి ప్రభుత్వం...నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సకల ఏర్పాట్లు చేసి ప్రసన్నం చేసుకోవాలనుకుంటోంది. ఫిరాయింపుల ప్రమాదం తమ పైకి రానున్నదనేే సంకేతం ఈ మధ్యే తెలంగాణ వీడియో టేపులు చూసిన తర్వాత కూడా వైసిపి నేతలు గుర్తించకపోవడం గమనార్హం. ధృతరాష్ట్ర కౌగిలిలో చేరితే ఆ తర్వాత ఏమీ వుండదనే విషయాన్ని గుర్తించాలి.

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌