
బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల సంపదను అప్పుల రూపంలో కాజేసి విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్న అస్మదీయుల జాబితా అంతకంతకూ పెరిగిపోయింది. దేశంలో అత్యంత ధనవంతులైన 30 శాతం మంది దగ్గర దేశ సంపదలో 90 శాతం, అందులో 10 శాతం కుబేరుల వద్ద 80 శాతం, అందులో 5 శాతం అపర కుబేరుల వద్ద 62 శాతం, ఇందులో ఒక్క శాతంగా వున్న మహాకుబేరుల వద్ద 40.6 శాతం సంపద పోగుబడింది. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న బడా కార్పోరేట్ కంపెనీలకు మోడీ పాలనలో రూ. 10 లక్షల 72 వేల కోట్ల రూణాలు రద్దు చేశారు. 13 కంపెనీలు బ్యాంకుల్లో తీసుకున్న రూ.4 లక్షల 50 వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61 వేల కోట్లకు తగ్గించి 'సెటిల్‌మెంట్' చేశారు.
2014 ఎన్నికల నాటికి ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి అంశాలను బిజెపి ఎన్నికల అస్త్రాలుగా మలుచుకుంది. దేశంలోని అవినీతిపరులు దేశ సంపదను లూటీ చేసి స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్నారని, వాటికి దేశ ప్రజలకు పంచితే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయని, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో వేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ప్రతి సంవత్సరం 10 నుండి 18 వేల మంది వ్యవసాయదార్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని నివారించడానికి పంట పెట్టుబడికి రెండు రెట్లు ఆదాయం వచ్చేట్లు చేస్తామన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత శక్తి వృధా అవుతున్నది. అందువల్ల ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ హామీలను సాధించగలిగే శక్తి, యుక్తి, దేశాన్ని ముందుకు తీసుకుపోయే సామర్థ్యం నరేంద్ర మోడీకి మాత్రమే వున్నాయని ముందుగా రంగరించుకున్న స్క్రిప్ట్ ప్రకారం మీడియా హోరెత్తించింది. బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ తన శక్తి కొద్దీ ప్రజల్లో మత విభజన తీసుకొచ్చి ఎన్నికలను ప్రభావితం చేసింది.
కార్పోరేట్ల కొమ్ముకాస్తున్న బిజెపి విధానాలు
తొమ్మిది సంవత్సరాల అనుభవం నాడు బిజెపి ఇచ్చిన హామీలన్నింటిని గేలి చేస్తున్నది. గతంలో వున్న వ్యక్తిగత అవినీతి ఈ కాలంలో వ్యవస్థీకృతమైంది. అవినీతి, అక్రమాలు చేయకుండానే చట్టప్రకారమే దేశ సంపదను ఎలా కొల్లగొట్టవచ్చో బిజెపి పాలన రుజువు చేసింది. బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల సంపదను అప్పుల రూపంలో కాజేసి విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్న అస్మదీయుల జాబితా అంతకంతకూ పెరిగిపోయింది. దేశంలో అత్యంత ధనవంతులైన 30 శాతం మంది దగ్గర దేశ సంపదలో 90 శాతం, అందులో 10 శాతం కుబేరుల వద్ద 80 శాతం, అందులో 5 శాతం అపర కుబేరుల వద్ద 62 శాతం, ఇందులో ఒక్క శాతంగా వున్న మహాకుబేరుల వద్ద 40.6 శాతం సంపద పోగుబడింది. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న బడా కార్పోరేట్ కంపెనీలకు మోడీ పాలనలో రూ. 10 లక్షల 72 వేల కోట్ల రూణాలు రద్దు చేశారు. 13 కంపెనీలు బ్యాంకుల్లో తీసుకున్న రూ.4 లక్షల 50 వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61 వేల కోట్లకు తగ్గించి 'సెటిల్‌మెంట్' చేశారు. కార్పోరేట్ అవినీతి, అక్రమాలకు ప్రధాని ప్రియ మిత్రుడు గౌతమ్ అదానీ ఉదంతం పెద్ద ఉదాహరణ. తొమ్మిది సంవత్సరాల క్రితం దేశీయ సాధారణ పెట్టుబడిదారుడుగా వున్న గౌతమ్ అదానీ ఈ కాలంలో ప్రపంచ నెంబర్ 2 కుబేరుడుగా మారి, ప్రస్తుతం 25వ స్థానానికి దిగజారాడు. ఈ ఎగుడు, దిగుడు వెనుక వున్న కారణాలను కనిపెట్టేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటి (ఇందులో సహజంగానే బిజెపి ఎంపీలు ఎక్కువ వుంటారు) వేయడానికి కూడా బిజెపి సిద్ధం కాలేదు. అదానీ అక్రమాల్లో ప్రతిష్టాత్మకమైన ఎల్‌ఐసి రూ.38,745 కోట్లు నష్టపోయింది. 2016-20 మధ్య కాలంలో ముఖేష్ అంబానీ నికర సంపద 350 శాతం పెరగగా, అదానీ సంపద 750 శాతం పెరిగింది. దేశం మొత్తం సంపదలో 77.4 శాతం కేవలం 10 శాతం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బిజెపి అధికారంలోకి వచ్చే 2014-15 నాటికి రూ.62,78,553 కోట్ల అప్పులు వుంటే 2022-23 నాటికి రూ. 155.8 లక్షల కోట్లకు పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 2022-23 బడ్జెట్ అంచనా ప్రకారం 57.3 శాతంగా వుంది.
తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం
దేశంలో అత్యధిక మందికి ఆధారంగా వున్న వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తూనే వున్నది. మూడు నల్ల చట్టాలను తెచ్చి వాటి అమలు కోసం మొండిగా వ్యవహరించి వందలాది రైతుల ప్రాణాలను బలితీసుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరిగిపోయాయి. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక పంటల సాగే తగ్గించుకుంటున్న స్థితి వలస పాలన కాలం నాటి చేతివృత్తిదారులను గుర్తుచేసున్నది. వ్యవసాయాన్ని గిట్టుబాటు కాని పరిస్థితికి నెట్టి కార్పోరేట్ కంపెనీలు ఆక్రమించుకునేలా చేయడం బిజెపి విధానం. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. కేంద్ర నేర పరిశోధనా సంస్థ రిపోర్టు ప్రకారం 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా...2017లో 10,655 మంది, 2018లో 10,349 మంది, 2019లో 10,281 మంది, 2020లో 10,677 మంది, 2021లో 10,881 మంది, 2022లో పది వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా వున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వం వీలైనంత బలహీనం చేస్తున్నది. 2020-21 కేంద్ర బడ్జెట్ సవరించిన అంచనాల్లో కోట్లాది వ్యవసాయ కూలీల కోసం ఉద్దేశించిన ఈ పథకానికి రూ.1,10,000 కోట్లు కేటాయిస్తే, 2021-22 బడ్జెట్‌లో రూ.73,000 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన పనికి కూలీ డబ్బులు రాక పేదలు పస్తులతో, అర్థాకలితో జీవిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం నానాటికి తీవ్రమై కోట్లాది మంది ఆ రంగాన్ని వదిలేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు లేవు. అరకొర ఉపాధి లభించినా భద్రత లేదు.
నిరుద్యోగ భారతం
2019లో 18.7 కోట్ల మంది నిరుద్యోగులు వుంటే 2022 నాటికి వారి సంఖ్య 20.5 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త ఉద్యోగాల భర్తీ నిలిపివేత వల్ల 2014లో 16.5 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2020 నాటికి 9.80 లక్షలకు తగ్గింది. బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల 7 లక్షల 84 వేల 841 రిజిష్టర్ కంపెనీలు మూతపడ్డాయి. అంటే సగటున రోజుకు 270 కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఇందులో పనిచేసే లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కోసమే బిజెపి పాలన సాగిస్తున్నట్లు వుంది. గత ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వ సంస్థల్లో వాటాలు అమ్మి రూ.4,32,708 కోట్లు కేంద్రం సొమ్ము చేసుకుంది. కాగా ఈ సంవత్సరం మరిన్ని గనులు, రేవులు, స్టేడియమ్‌లు, విమానాశ్రయాలను అమ్మివేయాలని నిర్ణయించింది. 26,700 కి.మీ జాతీయ రహదార్లను అమ్మివేసి 1.6 లక్షల కోట్లు, 400 రైల్వేస్టేషన్లు, 150 రైళ్లు, ట్రాకులు అమ్మడం ద్వారా రూ.1.5 లక్షల కోట్లు...ఇలా మొత్తంగా ఈ సంవత్సరం రూ.6 లక్షల కోట్లు సేకరించాలని నిర్ణయించింది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున మోడీ ఇస్తానన్న కొత్త ఉద్యోగాలు ఈ ప్రైవేటీకరణ వేగంలో పడి కొట్టుకుపోయాయి.
ఎన్నికల నాడు ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నించకుండా వుండాలంటే సున్నితమైన భావాల చుట్టూ ప్రజల ఆలోచనలు మార్చి...తమకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచి పెట్టడం, తద్వారా సంపద పోగేసుకొని ఎన్నికల్లో గెలవడం, తమ సంస్థలను బలోపేతం చేసుకోవడం ఫాసిజం లక్షణం. అదే విధానం నేడు దేశంలో అమలవుతున్నది. ప్రతి విషయాన్ని మత కోణం నుండి చూయిస్తూ మైనారిటీలను శత్రువులుగా చూపిస్తున్నది. వ్యక్తిగత అంశమైన మత విశ్వాసాలను సమాజంలోకి, రాజకీయాల్లోకి లాక్కొచ్చి ప్రజల మధ్య విభజనలు సృష్టించి లాభపడాలని చూస్తోంది. ఆనందంతో జరుపుకోవలసిన పండుగలు, ఉత్సవాల సందర్భంగా మత ఘర్షణలు రగిలించడానికి పూనుకుంటున్నది. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శోభాయాత్ర వివిధ రాష్ట్రాలలో శోకయాత్రగా ఎలా మారిందో చూశాము. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, ప్రజావ్యతిరేక, మతతత్వ విధానాలను ప్రజలలో ఎండగట్టి...బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందాం...అనే నినాదంతో ఈ నెల 14 నుండి 30 వరకు సిపిఐ-సిపిఐ(ఎం) పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార భేరి నిర్వహిస్తున్నాయి.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు)
వి. రాంభూపాల్