
మీడియాను మోడియాగా మార్చేస్తున్నారనే ఆరోపణల మధ్య ఏక కాలంలో పరస్పర విరుద్ధమైన వైసిపి, టిడిపి, జనసేన మూడింటినీ లోబర్చుకోవడమే గాక బిఆర్‌ఎస్ పైనా ఒత్తిడి పెంచడం బిజెపి కుటిల నీతికి దర్పణం. తమలో తాము కలహించుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేసే ఈ పార్టీలు బిజెపిని మాత్రం ప్రశ్నించడం లేదు. పైపెచ్చు పరస్పర కలహాలతో జుట్టు దాని చేతుల్లోనే పెడుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా పేరబెట్టిన కృష్ణా జలాల పంపిణీ సమస్యపై ఆదరాబాదరాగా ట్రిబ్యునల్‌కు కొత్త విధివిధానాలను ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో అవకాశాలు పెంచుకోవాలన్న బిజెపి తాపత్రయం స్పష్టమైపోయింది.
అన్నిచోట్లా ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నట్లు అర్థమవుతున్నది. దీన్ని తరచూ అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారుకానీ దొడ్డిదోవన తెచ్చిన ఈ నిరంకుశత్వం అప్పటి కంటే దారుణంగా తయారైంది. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య తత్వాన్ని కాలరాచే బిజెపి రాజకీయ దాడులకూ కుయుక్తులకూ తెలుగు రాష్ట్రాల పరిణామాలే అద్దం పడుతున్నాయి. ఈ దశలో పాలక పార్టీలు మనుగడ కోసం మోడీకి తలవంచుతున్న తీరు, పిల్లి మొగ్గలు వేస్తున్న వైనం అత్యంత నష్టదాయకం.
'ఉదర పోషణార్థం బహుకృత వేషధారణం' అన్నట్టుగానే రాజకీయాధికారం, ఆధిపత్యం కోసం కేంద్రంలోని బిజెపి-ఎన్‌డిఎ ప్రభుత్వ అధినేత మోడీ, ఆయన మద్దతుదారులు వేస్తున్న వేషాలు తెలుగు రాష్ట్రాలలో రసవత్తర ఘట్టానికి తెరతీశాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగోలా ప్రత్యక్ష పరోక్ష మద్దతుదారులను పెంచుకోవాలన్న బిజెపి కూటమిలో ఇంతవరకూ ఒక్కరైనా చెప్పుకోదగిన భాగస్వాములు చేరిందిలేదు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో దాన్నే తిరగేసి చెబుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్‌డిఎలో చేరతానన్నా తాను నిరాకరించానని సెలవిచ్చారు. ఒక దశలో మోడీ విధానాలపై విరుచుకుపడిన కెసిఆర్ ఇటీవల మౌనం దాల్చడంతో 'బిజెపి, బిఆర్‌ఎస్‌లు మళ్లీ దగ్గరయ్యాయా..?' అనే సందేహాలు పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత గజిబిజికి కారణమైనాయి. మోడీ మాటలను మంత్రి కెటిఆర్ తీవ్రంగా ఖండించగా ఆ రెండు పార్టీలదీ ఫెవికాల్ బంధమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి టిబిజెపి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎం.పి కె.లక్ష్మణ్ 2018లో స్వయంగా తమతో పొత్తు కోసం వచ్చారని కెటిఆర్ వెల్లడించారు. ఏది ఎంత నిజమైనా ఈ రెండూ బయటివారికి తెలియని విషయాలే. పారదర్శకత లేని పాలక పార్టీల వ్యూహాలు, అవకాశవాదాలు ఎలా వుంటాయో ఈ ఉదంతాలు వెల్లడి చేశాయి. మోడీ ఒకనాటి రహస్యాన్ని బయటపెట్టి కెసిఆర్‌ను ఇరకాటంలో నెట్టారని ఒక కథనమైతే కేవలం అభూత కల్పనలతో గందరగోళం కోసం విఫలయత్నం చేశారని మరో అభిప్రాయం వినిపిస్తున్నది. బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య లేదా ఎన్‌డిఎ, ఇండియాల మధ్య సమ దూరం పాటిస్తామని కెసిఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత దేశవ్యాపితంగా ప్రత్యామ్నాయం తీసుకొస్తామని కూడా ఆయన అన్నారు. అయితే తాము ప్రస్తుతానికి మహారాష్ట్రలో మాత్రమే పోటీ చేస్తామని ఇటీవల కెటిఆర్ స్పష్టీకరించారు. బిఆర్‌ఎస్ నేస్తంగా వున్న మజ్లిస్ ఒవైసీ కూడా మూడో ఫ్రంట్ కెసిఆర్ నాయకత్వాన ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి తరుణంలో మోడీ మాటలు మరింత వేడిని పెంచాయి. ప్రస్తుతం ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌తో అస్వస్థులుగా వున్న కెసిఆర్ తర్వాతనైనా సమాధానం ఇస్తారేమో చూడవలసి వుంటుంది. ఈ లోగా వచ్చిన ఎన్నికల సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వుండగా బిజెపి నేతలు మాత్రం తమకు అనుకూలంగా వుంటాయనీ హంగ్ సభలో బిజెపినే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. బిజెపికి సంబంధించిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా కొందరు ప్రధాని సభనే బహిష్కరించారు. దాంతో అలిగిన వారికి పదవులు ఇచ్చి మరీ నిలుపుకోవలసిన అగత్యమేర్పడింది.
తెలంగాణలో పరిణామాలు, మోడీ మాటలు
ఇంచుమించు ఈ కాలంలోనే చంద్రబాబు అరెస్టు జరగడంతో దానిపై ఐ.టి సిటీలో నిరసనలు వద్దని కెటిఆర్ స్పష్టంగా ప్రకటించారు. మరోవైపున ఆ పార్టీ మంత్రులూ ప్రముఖులే దానిపై విమర్శలు చేశారు. టిడిపి అనుకూల ఓటర్లు ఆంధ్ర ప్రాంత ఓటర్ల కోసం ఇదంతా చేస్తున్నారనే భావన బలపడింది. బిజెపి కూడా రకరకాలుగా స్పందించింది. ఎన్టీఆర్‌తో సహా సినిమా పరిశ్రమ స్పందన లేదనే మాట వచ్చినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సినిమావారి సమస్యలు అర్థం చేసుకోవాలని వాదించారు. మరోవైపున గత రెండుసార్లు బరిలో దిగని జనసేన ఈసారి 32 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించింది. తెలంగాణలో బిజెపికి మద్దతునిస్తామనే ప్రతిపాదనతో ఎ.పి లో వారి అండదండలు పొందాలనే ఆలోచనతో టిడిపి తెచ్చిన ప్రతిపాదనను బిజెపి తోసిపుచ్చింది. ఎన్‌డిఎలో భాగస్వామినంటూనే పవన్ కళ్యాణ్ 32 స్థానాల్లో పోటీ ప్రకటించినా వీరు స్పందించలేదు. ఒక విధంగా ఇది వ్యూహాత్మకమేనని, తెలంగాణలో బిఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవడానికే ఇలా చేస్తున్నారని అనేకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో అనేక సమస్యలు, అనైక్యతలు వున్నా బిఆర్‌ఎస్‌కు అదే ప్రధాన ప్రత్యర్థి అని కెసిఆర్ కూడా అంగీకరించి వున్నారు. అందువల్లనే బహుశా దానికి అవకాశం లేకుండా చేయడం కోసం మోడీ రంగంలోకి దిగారనుకోవాల్సి వుంటుంది. దక్షిణాదిన అసలే టికానా లేని బిజెపి కాంగ్రెస్‌కు ఏ విధంగానూ అవకాశం ఇవ్వకూడదనే గట్టి వైఖరితో వుంది.
ఎ.పి లో ఎన్ని మెలికలు ?
చంద్రబాబు అరెస్టు కేంద్ర బిజెపి అండదండలు కనీసం ఆమోదం లేకుండా జరిగి వుండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం లోనూ చాలా మందిలో ఇదే భావం వుంది. అయినా సరే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, బాలకృష్ణ, అచ్చెంనాయుడు వంటి వారు బిజెపికి సంబంధం లేదని పదేపదే చెబుతున్నారు. ఆ బిజెపి నేతలతో కలసి మాట్లాడితే ఏదో ఉపశమనం దొరుకుతుందని ఢిల్లీలో మకాం వేసినా ఒకరైనా కలుసుకోవడానికి సిద్ధం కాలేదు. అయినాసరే వారికి సంబంధం లేదని లోకేష్ కితాబునిస్తూనే వున్నారు. పవన్ కళ్యాణ్ మరింత గట్టిగా చెబుతున్నారు. ఎ.పి బిజెపి నాయకులు పరిపరివిధాల మాట మారుస్తున్నారు. అరెస్టు తర్వాత టిడిపితో పొత్తు వుంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాను ఎన్‌డిఎ తోనే వున్నానని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం కాపాడాలని కూడా మరోసారి పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోడీ సర్కారును పోటీపడి పొగుడుతూనే వున్నారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్‌ను ఓడించడం కోసం టిడిపి, జనసేనలతో కలసి వెళ్తామని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. బిజెపితో ప్రత్యక్ష పరోక్ష అవగాహన అనుబంధం వున్న వారెవరితోనూ కలిసే అవకాశమే లేదని సిపిఎం నాయకులు ఆయా సందర్భాల్లో వెల్లడించారు. బిజెపి నుంచి టిడిపి, జనసేన దూరం కావాలని తాము కోరుతున్నామని రామకృష్ణ చెప్పారు గానీ ఆ పార్టీల కీలక నేతల మాటలు అందుకు పూర్తి విరుద్ధంగా వున్నాయి. ఈ సమయంలోనూ బిజెపి మాత్రం తము జనసేనతోనే పొత్తులో వున్నామనీ, టిడిపి సంగతి పవన్ కళ్యాణ్ చెప్పాలని అంటూ వచ్చారు, మొన్న కోర్ కమిటీ చర్చలంటూ జరిపి అధిష్టానానికి నివేదిస్తామన్నారు. ఇక్కడ గమనించాల్సిందే మంటే ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో నెంబర్ టూ అమిత్ షా ను కలిసి మాట్లాడి వచ్చారు. ఆయన అక్కడ కలుస్తున్న రోజునే ఇక్కడ హైదరాబాద్‌లో బిజెపి అధ్యక్షుడు జె.పి నడ్డా, మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌లు అనుకూల పత్రికాధిపతులను ప్రత్యేకంగా కలుసుకోవడం చూశాం. జగన్ కుటుంబం 'సాక్షి' పత్రిక యజమాని కూడానని గుర్తుంచుకోవాలి. ఢిల్లీలో 'న్యూస్ క్లిక్'పై దారుణమైన దాడి చేస్తూ పత్రికా స్వాతంత్య్రం కాలరాస్తున్న బిజెపి పెద్దలు ఇక్కడ మాత్రం ముఖ్యమైన మీడియాతో మంతనాలు జరుపుతున్నారు. ఆ ఘటనపై సంపాదకీయాలు రాస్తూ తెలుగు రాష్ట్రాలలో మీడియాపై దాడిని కూడా ప్రస్తావించిన ఆ రెండు పత్రికలు అదే ఆందోళన వారి ముందుగానీ తర్వాత గానీ వెలిబుచ్చిన దాఖలాలు లేవు. మీడియాను మోడియాగా మార్చేస్తున్నారనే ఆరోపణల మధ్య ఏక కాలంలో పరస్పర విరుద్ధమైన వైసిపి, టిడిపి, జనసేన మూడింటినీ లోబర్చుకోవడమే గాక బిఆర్‌ఎస్ పైనా ఒత్తిడి పెంచడం కుటిల నీతికి దర్పణం. తమలో తాము కలహించుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేసే ఈ పార్టీలు బిజెపిని మాత్రం ప్రశ్నించడం లేదు. పైపెచ్చు పరస్పర కలహాలతో జుట్టు దాని చేతుల్లోనే పెడుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా పేరబెట్టిన కృష్ణా జలాల పంపిణీ సమస్యపై ఆదరాబాదరాగా ట్రిబ్యునల్‌కు కొత్త విధివిధానాలను ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో అవకాశాలు పెంచుకోవాలన్న బిజెపి తాపత్రయం స్పష్టమైపోయింది. అయిదు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ కాకుండా రెండు రాష్ట్రాల మధ్యనే విభజన, అది కూడా ఏకపక్షంగా నిర్ణయించిన షరతుల మీద జరగడం ఎ.పి కి ఆమోదయోగ్యం కాదు. తెలంగాణకూ బలమైన అభిప్రాయాలున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుకు ఉమ్మడి ఎ.పి కూడా అభ్యంతరాలు చెప్పి సవాలు చేసింది. ఇప్పుడు ఆ పరిధిలోనే పున:పంపిణీ ఎలా న్యాయమవుతుంది? ఈ విషయంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఒకరినొకరు అనుకోవడం తప్ప ఢిల్లీ లోని మోడీ కౌటిల్యాన్ని ప్రశ్నిస్తున్నది లేదు. ఈ తరుణంలోనే మోడీకి అస్మదీయుడైన అదానీ మహాశయుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కావడం, రేవులు సంస్థలు, విశాఖ భూములు ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధం కావడం యాదృచ్ఛికం కాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జిందాల్స్‌కు కట్టబెట్టడానికి పన్నాగాలు పన్నుతూనే మరోవంక ఎం.పి జీవిఎల్‌తో ప్రైవేటీకరణ నిల్చిపోయిందని చెప్పించడం బిజెపికే చెల్లింది. ఈ అంశంలో ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీలు పోరాడింది లేదు. ఇవన్నీ చాలనట్టు మత రాజకీయాలు కూడా తరచూ తలెత్తుతున్నాయి. మత రాజకీయాలను ఎదుర్కొనే బదులు తాము మరింతగా మతోద్ధారకులమన్నట్టు వైసిపి, టిడిపి, జనసేన వ్యవహరిస్తున్నాయి.
కార్యాచరణే సమాధానం
అందుకే మోడీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయడమే గాక స్వంతంగా పునాది లేని చోట చెలగాటమాడగలుగుతున్నది. అన్నిచోట్లా ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నట్లు అర్థమవుతున్నది. దీన్ని తరచూ అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారుకానీ దొడ్డిదోవన తెచ్చిన ఈ నిరంకుశత్వం అప్పటి కంటే దారుణంగా తయారైంది. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య తత్వాన్ని కాలరాచే బిజెపి రాజకీయ దాడులకూ కుయుక్తులకూ తెలుగు రాష్ట్రాల పరిణామాలే అద్దం పడుతున్నాయి. ఈ దశలో పాలక పార్టీలు మనుగడ కోసం మోడీకి తలవంచుతున్న తీరు, పిల్లి మొగ్గలు వేస్తున్న వైనం అత్యంత నష్టదాయకం. బడా మీడియా మోడియాగా మారిపోవడంతో వాస్తవాలు పాక్షికంగానే అందుతున్నాయి. కేంద్ర రాష్ట్రాల హానికర విధానాలపై పోరాడవలసిన తరుణమిది. ముందు తెలంగాణలోనూ తర్వాత ఎ.పి లోనూ ఎన్నికలు రాబోతున్నాయి గనక పొత్తుల ఎత్తులే ఇప్పుడు మొత్తం నిండిపోతున్నాయి. ఏ సర్వేలోనూ బిజెపికి అనుకూలత లేకున్నా ప్రాంతీయ పార్టీల ఊగిసలాటలూ అవకాశవాదాలే అంతిమంగా దానికి తాళాలు అప్పగిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. విజయవాడలో జరిగిన సమగ్రాభివృద్ధి చర్చ, విశాఖ ఉక్కు యాత్ర, తెలంగాణలో ప్రజా ఉద్యమాల వంటి కార్యాచరణలే దానికి విరుగుడు. ప్రజల హక్కులనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఐక్య పోరాటాలే ఇప్పుడు మార్గం చూపాలి. బిజెపి వినాశకర విధానాలతో చేతులు కలపని శక్తులను కూడగట్టాలి.
తెలకపల్లి రవి