Apr 19,2023 07:33

కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి స్టీల్‌ప్లాంట్‌ పూర్తిస్థాయి సామర్ధ్యంతో ఉత్పత్తి చేయకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూసివేసింది. ముడిసరుకు వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇవ్వటంలేదు. రైల్వే ర్యాకులను అడ్డుకుంటున్నది. సొంత గనులు ఇవ్వడంలేదు. స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే చర్యలు చేపడుతున్నది. ఇన్ని కుట్రలు చేస్తుంటే స్టీల్‌ప్లాంట్‌కి లాభాలు ఎలా వస్తాయి ?

          విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం నిత్యం వంచనలకు పాల్పడుతూనే వుంది. తాజాగా ఏప్రిల్‌ 13న విశాఖలో ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తీ రోజ్‌గార్‌ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని ప్రకటించారు. మరలా సాయంత్రం స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ...నా చేతిలో ఏమీ లేదు. ఢిల్లీలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దీన్నిబట్టి రిమోట్‌ కంట్రోల్‌ ఎవరి చేతిలో వుందో అర్ధమవుతోంది. మొన్న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం అమ్మే విషయంలో తగ్గేదే లేదని సమాధానం చెప్పారు. బిజెపి ప్రకటనలు ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ద్వంద్వనీతిని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టీల్‌ సహాయ మంత్రి ఉదయం ఒక ప్రకటన సాయంత్రం ఒక ప్రకటన చేయడమంటే తెలుగు ప్రజలను, పోరాటం చేస్తున్న కార్మికులను మోసం చేయటమే. కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని అంశాలలో అన్యాయం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం విషయంలో బరితెగించి ముందుకు పోతూ అనేక జీవోలు విడుదల చేసింది. ప్రైవేటీకరణలో భాగంగానే ట్రాన్సాక్షన్‌ అడ్వైజరీ కమిటీ, లీగల్‌ అడ్వైజరీ కమిటీ, ఆస్తుల మదింపు కమిటీలు వేసింది. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు దీనిపై గత రెండు సంవత్సరాలకు పైబడి పోరాటాలు, నిరసనలు ఉధృతం చేస్తున్నాయి. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడుతున్నాయి. మొదటి నుండి స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడితే...డివిడెండ్లు, పన్నుల రూపంలో ప్రభుత్వాలకు సుమారు రూ.50 వేల కోట్లు చెల్లించింది. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు, సొంత గనులు కేటాయించాలని పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఇదే అదానీ, అంబానీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఆగమేఘాల మీద ఆర్థిక సంస్ధల ద్వారా ఏర్పాటు చేస్తోంది. అలాంటిది దేశ సంపదను పెంచుతున్న ప్రభుత్వ రంగ పరిశ్రమైన స్టీల్‌ప్లాంట్‌ పట్ల ఎందుకు ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తోంది. దీన్నిబట్టి బిజెపి కి దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల పట్ల ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమౌతుంది. దేశభక్తి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటమా? ఇటీవల కాలంలో స్థానిక స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఒక కొత్త జీవో విడుదల చేసింది. దీనిని ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకం మొదలెట్టింది. దీనిని ఆధారం చేసుకొని జిందాల్‌ కంపెనీ భాగస్వామి అయ్యేందుకు కుట్రలు పన్నుతోంది.
         కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి స్టీల్‌ప్లాంట్‌ పూర్తిస్థాయి సామర్ధ్యంతో ఉత్పత్తి చేయకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూసివేసింది. ముడిసరుకు వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇవ్వటంలేదు. రైల్వే ర్యాకులను అడ్డుకుంటున్నది. సొంత గనులు ఇవ్వడంలేదు. స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే చర్యలు చేపడుతున్నది. ఇన్ని కుట్రలు చేస్తుంటే స్టీల్‌ప్లాంట్‌కి లాభాలు ఎలా వస్తాయి? తడి గుడ్డతో గొంతు కొయ్యడమంటే ఇదే. ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్లకు సొంతగనులు వున్నా మరలా వారికే గనులు కేటాయిస్తున్నారు. రబోద్‌లో స్టీల్‌ప్లాంట్‌కున్న బొగ్గు గనులను అర్ధాంతరంగా రద్దు చేసి ప్రైవేట్‌వారికి అప్పగించారు. కాని ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఎందుకు కేటాయించడం లేదు? ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా బ్యాంకులు, ఎల్‌ఐసి, రైల్వే, గనులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులను తన అనుయాయులకు అమ్మకాలు జరుపుతోంది. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ వాటా వచ్చింది. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అని నినదించి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న మన విశాఖ ఉక్కుని రక్షించుకొనే బాధ్యత తెలుగు ప్రజలందరిపైన వుంది.
         స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ఉదాసీనంగా వుంది. అసెంబ్లీలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసి చేతులు దులుపుకుంది. ఒకపక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే వితండవాదం చేస్తోంది. ఇటీవల రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి... స్టీల్‌ బిడ్డింగ్‌లో పాల్గొనకూడదని, పాల్గొంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరించటమే అని వక్రభాష్యం చెబుతున్నారు. మొదట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రకటించారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు, కీర్తిశేషులు మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్‌లోనైనా పాల్గొని స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని ప్రకటించగా...నేడు సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌ దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఒకపక్క స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ప్రగల్భాలు పలుకుతూనే వాడచీపురుపల్లిలో ఉన్న శాండ్‌ మైన్స్‌ ఎందుకు రద్దు చేశారు? ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం స్టీల్‌ప్లాంట్‌ విషయంపై కేంద్రం ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట కూడా అనడడంలేదు. జనసేన స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం పోరాడతామని చెబుతూనే బిజెపి పంచన చేరి ఇప్పుడు మాట్లాడడంలేదు. ఇటీవల బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌, బాగల్పూర్‌ ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని చూస్తే ప్రజలందరూ ఐక్యంగా పోరాడడం వలన కేంద్రం వెనక్కి తగ్గింది. స్టీల్‌ప్లాంట్‌పై బిఆర్‌ఎస్‌ తీసుకున్న వైఖరిని మన రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించాల్సింది పోయి ఎదురు దాడికి పూనుకుంటున్నది. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రజలకు అర్ధమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్ళడానికి ఎందుకు చొరవ చూపడంలేదు? రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రకటన చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో స్టీల్‌ప్లాంట్‌ లేదా? రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
          కేంద్ర స్టీల్‌ విధానాన్ని పరిశీలిస్తే 2030 నాటికి 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ అవసరం. నేడు 122 మిలి యన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మన స్టీల్‌ప్లాంట్‌ వాటా 7.3 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేయాలి. ఏనాడూ పూర్తిస్థాయి సామర్ధ్యాల ఉత్పత్తికి నోచుకోకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అవసరం ఏమిటో అర్ధమౌతుంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. కావున దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని, విశాల పోరాటాలకు మద్దతునివ్వాలని, తెలుగోడి పోరాటం తెగువ చూపాలని విజ్ఞప్తి.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
కె. లోకనాధం

కె. లోకనాధం