
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పదేపదే ద్రోహం చేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇప్పటికే ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన నరేంద్రమోడీ సర్కారు తాజాగా రాజధాని విషయంలోనూ అదే బాట నడుస్తోంది. బుధవారం నాడు రాజ్యసభలో ఇచ్చిన సమాధానం, అదేరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు బిజెపి నయవంచనకు పరాకాష్ట. వైసిపి పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, దానిపై ఏం మాట్లాడినా కోర్టు ధిక్కరణ (సబ్‌జ్యూడిస్) అవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సమాధానం చదివిన వారెవ్వరైనా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానం ముందు తన అభిప్రాయాన్ని చెబుతుందని అనుకుంటారు. కానీ, అదే రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో మోడీ ప్రభుత్వం ఇప్పటికే జరిగిన పరిణామాలను ఏకరువు పెట్టడం తప్ప కొత్తగా ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని ఏమనాలి? ఇది రాష్ట్ర ప్రజలను వంచించడం కాదా ?
రాజధాని అంశంపై ఎటువంటి సమాధానం గానీ, స్పందన గానీ ప్రస్తుతానికి తెలియచేయలేం అని ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం నివేదించింది. పైగా, 'భవిష్యత్తులో అవసరమైన సరైన సమయంలో జవాబిస్తాం. ఆ హక్కును రిజర్వు చేసుకుంటున్నాం' అని పేర్కొనడం హాస్యాస్పదం. ఏలిన వారి దృష్టిలో 'అవసరమైన సరైన సమయం' అంటే ఏమిటో? ఇక సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు, వాటి సమస్యల పరిష్కారం పట్ల కేంద్రానికి బాధ్యతలు ఉంటాయి తప్ప హక్కులు ఉండవన్న విషయం మోడీ సర్కారుకు తెలియదని అనుకోలేం. 'ఎస్‌ఎల్‌పిలో లేవనెత్తిన వివిధ అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే జవాబు ఇవ్వగల సమర్ధత ఉంది' అని కూడా కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఈ డొంక తిరుగుడు, దాటవేత ఏమిటి? అంటే, ఇప్పటి వరకు ఈ అంశంపై మోడీ సర్కారుకు ఎటువంటి వైఖరి లేదని అర్ధం చేసుకోవాలా? అదే నిజమైతే రాష్ట్రంలో బిజెపి నాయకులు ప్రజల చెవులు ఊదరగొట్టేలా చేస్తున్న ప్రకటనల మాటేమిటి? అధినాయకత్వం ఆమోదం లేకుండానే మాట్లాడుతున్నారని భావించాలా? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, దాని నుండి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం బిజెపికి కొత్త కాదు. అటువంటి విచ్ఛిన్న రాజకీయాల వల్లనే రాష్ట్రం ఒకసారి తీవ్రంగా నష్టపోయింది.
రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా పేర్కొంటూ తీర్మానం చేసింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కూడా ఆ తీర్మానాన్నే బలపరిచింది. అధికారంలోకి వచ్చిన తరువాత దానికి కట్టుబడి ఉండటమే సరైన పద్ధతి. పాలనా, శాసన వ్యవస్థలు ఒక దగ్గర ఉండటమే వాంఛనీయం. హైకోర్టును కావాలనుకుంటే కర్నూలులో ఏర్పాటు చేయవచ్చు. శాసన, పాలనాపరమైన రాజధాని ఒకే దగ్గర ఉండాలి. దీనికి భిన్నంగా తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలను చీల్చి లబ్ధి పొందాలని చూసే శక్తులకు ఊతమిస్తుంది. అటువంటి సమయం కోసమే మతోన్మాద, విభజన శక్తులు కాచుకుని ఉన్నాయి. ఒకదాని తరువాత ఒకటిగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాలను ఎండగట్టి రాష్ట్ర ప్రజల తరపున పోరాడాల్సిన అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దానికి భిన్నంగా పరస్పర ఆరోపణల్లో మునిగి తేలుతూ అసలు దోషిని వదిలేస్తున్నాయి. రాజధాని విషయంలో కేంద్రం చేసిన తాజా ప్రకటనల తరువాత కూడా వైసిపి, టిడిపిలు ఇదే విధంగా స్పందిస్తుండటం బాధాకరం. అధికారమే పరమావధిగా ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న ఈ ధోరణి అంతిమంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగచేస్తుంది. ఈ విషయాన్ని ఆ పార్టీలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. రెండు పార్టీల అధినేతలు గుర్తించాలి. రాష్ట్ర ప్రజల ఐక్యత, ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి రెండు పార్టీలు సిద్ధపడాలి. ప్రజానీకం కూడా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.