Jul 10,2022 07:05

మరోవైపు నుంచి చూస్తే దక్షిణ భారతంలో కర్ణాటక తప్ప మరెక్కడా బిజెపికి ఠి¸కాణా లేదు. కేరళ, తమిళనాడులలో అసలే నాస్తి. ఎ.పి లో అతి పరిమితం. ఎ.పి తో పోలిస్తే తెలంగాణలో తమకు నాలుగు లోక్‌సభ స్థానాలు, జిహెచ్‌ఎంసిలో 48 సీట్లు, ఉప ఎన్నికల తర్వాత మూడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి గనక, ముస్లిం జనాభా మజ్లిస్‌ ప్రభావం వున్నాయి గనక ఏదోలా కాలూనవచ్చని బిజెపి పథకాలు వేస్తున్నది.

ఈ తాపత్రయమంతా ఏదో తెలంగాణలో గెలిచేస్తామన్న నమ్మకంతో కాదని బిజెపికి సన్నిహితులైన వ్యాఖ్యాతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో దేశం మొత్తం మీద 100 స్థానాలు కోల్పోతామని వారి అంతర్గత సర్వేలో తేలిందట. ఉత్తరాదిలో కోల్పోయే ఈ స్థానాల భర్తీ కోసం ఎక్కడ ఏ అవకాశం వున్నా ఉపయోగించుకోవాలనే దక్షిణాది డండయాత్ర అవసరమైంది. అయితే ఇది ఆఖరుకు దండగే అవుతుందని ఆ పార్టీలోనే సందేహాలున్నాయి.

త శని, ఆదివారాలలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు, అనంతర బహిరంగ సభల ద్వారా బిజెపి నాయకత్వం దక్షిణాది రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయబోతున్నట్టు చాలా హడావుడి చేసింది. ఆ మేరకు తీర్మానమే చేసి సభలో అదే వల్లెవేశారు. ఆ మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్‌లో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభనూ తమ ప్రచార సంకేతాలు పంపడానికే వినియోగించుకున్నారు. బిజెపి ఏం చేసినా అమిత ప్రచారమిచ్చే మీడియా కూడా కార్యవర్గ సమావేశాలు నిర్వహించడమే గొప్ప విషయంగా ముందుకు తెచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పైన, పాలకపక్ష టిఆర్‌ఎస్‌ పైన ఏకపక్షంగా దాడి జరిగింది. ఎ.పి లో జరిగింది పార్టీ సమావేశం కాదు గనక, అక్కడ తమకు లోబడి వుండే వైసీపీనే పాలిస్తున్నది గనక కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు వారి ద్వారానే తమ ఆలోచనలు అమలు చేయించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకూ సంబంధించి కేంద్రం నెరవేర్చవలసిన వాగ్దానాలు చాలా వున్నా కేంద్రం వల్ల ఉత్పన్నమైన సమస్యలు చాలా వున్నా, వాటి ప్రసక్తి లేకుండా పైపై మాటలతోనే సరిపెట్టారు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరులు. ఇటీవలి కాలంలో తమను విపరీతంగా విమర్శిస్తున్న కెసిఆర్‌పై తీవ్ర దాడి చేశారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని బీరాలు పోయారు. ఎ.పి కి ప్రత్యేకహోదా రెవెన్యూ లోటు భర్తీ అమరావతి రాజధానికి సహాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత వంటి అంశాలు కనీసం ప్రస్తావనకు రాలేదు.
 

                                                                       మతతత్వం, నిరంకుశత్వం

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ దేశాభివృద్ధి గురించి గొప్పలు పోయారు. సభలో జైశ్రీరామ్‌ నినాదాలు మార్మోగడం ఒకటైతే వక్తలందరూ మైనారిటీల పట్ల సంతుష్టీకరణ తగదని ఎప్పటి పాటే పాడారు. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో వుందని, కెసిఆర్‌ కుటుంబ పాలన వల్ల తెలంగాణ తక్కిన దేశాన్ని అందుకోలేకపోతున్నదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలే వుంటే అభివృద్ధి సాధ్యమని డబుల్‌ ఇంజన్‌ సిద్ధాంతం చెప్పారు. దేశం ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఉద్యోగాల కోత వంటి అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంటే బిజెపి నేతలు మోడీ అద్భుతమైన అభివృద్ధి సాధించినట్టు, ఇండియా విశ్వగురుగా మారుతున్నట్టు చెప్పుకున్నారు. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా సంబోధిస్తూ పేరు మార్పును సూచించారు. తెలంగాణలో హిందూ దేవాలయాలు, రాజవంశాల గురించి ఏకరువు పెట్టిన ప్రధాని చార్మినార్‌తో సహా చారిత్రాత్మక స్థలాల ఊసే తీసుకోలేదు. యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చార్మినార్‌లో వివాదాస్పద కట్టడమైన భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించడమే గాక సభలోనూ ప్రస్తావించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజరు అయితే దేవుడు లాంటి మోడీని ఎలా విమర్శిస్తారని ఆవేదన చెందారు. అంతకు ముందు దేశ రాష్ట్ర సమస్యల గురించి కెసిఆర్‌ లేవనెత్తన ప్రశ్నలకు ఈ సభలో ఎవరూ జవాబు చెప్పలేదు. రాష్ట్ర విభజన గురించి గతంలో తను చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించలేదు. విభజన సమస్యల పరిష్కారం గురించీ చెప్పింది శూన్యం. ఏతావాతా తాము అధికారంలోకి రాబోతున్నామనే భావనను ధృఢతరం చేయడమే వారి ఏకైక లక్ష్యంగా కనిపించింది. సభకు జనం బాగా రావడంతో ఇక గెలుపే తరువాయి అన్నట్టు రెచ్చిపోయారు. మీడియా సంస్థలు అనేకం అలానే చేస్తున్నాయి.
 

                                                                   ఎ.పి, తెలంగాణల భిన్న దృశ్యాలు

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ సమావేశాలకు ముందు నుంచి బిజెపి మతతత్వం, నిరంకుశత్వాలపై విమర్శలు చేస్తూ వచ్చింది. మోడీని స్వాగతించడానికి ముఖ్యమంత్రి వెళ్లకుండా లాంచనంగా ఒక మంత్రిని పంపారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కెసిఆర్‌ బైక్‌ ర్యాలీతో ఘనంగా తీసుకువచ్చారు. ఆ రెండు రోజులు పత్రికల మొదటి పేజీలను తమ అడ్వర్టయిజ్‌మెంట్లతో ముంచేసి, బిజెపికి అవకాశం లేకుండా చేశారు. హోర్డింగులు, ఫ్లెక్సీలకు కూడా చోటు లేకుండా కావాలని తమవే కట్టారని బిజెపి నేతలు గగ్గోలు పెట్టారు. ఆరు నెలల్లో మూడు సార్లు మోడీ వస్తే ఒకసారైనా ముఖ్యమంత్రి స్వాగతించకపోవడం ఆయనకు చాలా కష్టం కలిగించిందనీ, అందుకే ఆయన కెసిఆర్‌ పేరు ఎత్తకుండా వెళ్లిపోయారని వివరించారు. ఇందుకు భిన్నంగా ఎ.పి లో జగన్‌ ప్రభుత్వం మోడీ అడుగులకు మడుగులొత్తింది.
గతంలో బిజెపి నాలుగు స్థానాలు గెలిచిన ప్రాంతంలో సామాజిక వ్యూహం ప్రకారమే ఆదివాసులను మెప్పించడానికి అల్లూరి సభను ఎన్నుకున్నారని ఆ పార్టీ నేతలు ఆంతరంగికంగా చెప్పారు. అల్లూరి విగ్రహావిష్కరణ సభలోనూ మోడీ భజనే ప్రధానమైంది. అక్కడికి అగ్రహీరో చిరంజీవిని పిలిచిన నేపథ్యంలో మోడీ ప్రత్యేక సాన్నిహిత్యం ప్రదర్శించారు. ఆయన తమ్ముడూ తమ మిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌కు అనేక సందేహాల మధ్య ఆహ్వానం అందిందంటున్నా ఆయన పాల్గొనలేదు. టిడిపి అధినేత చంద్రబాబుకు ఆహ్వానం వున్నా రాలేకపోవడం ఒకటైతే ఆ పార్టీ తరపున పాల్గొనవలసి వున్న అచ్చెం నాయుడును రానివ్వకపోవడం మరొకటి. రాష్ట్ర ప్రభుత్వ అయిష్టత ఒకటైతే బిజెపి కూడా ఇక్కడి పార్టీల మధ్య తగాదాలు పెంచే ద్వంద్వనీతిని ప్రదర్శించింది. ప్రత్యేక హోదా, లోటు భర్తీకి సహాయం, అమరావతి, పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కు అమ్మకం విరమణ వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా అడగాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేకపోయింది. మోడీ బయిలుదేరే ముందు ఒక మెమోరాండం ఇచ్చి అడిగామనిపించుకున్నారు. తన పర్యటన ఫోటోలు షేర్‌ చేసి సంతోషించిన మోడీ ఈ వినతి పత్రాన్ని కనీసంగా పట్టించుకోలేదు. టిడిపి కూడా ఈ ఆహ్వానాల చిచ్చుపై వివాదం తప్ప రాష్ట్ర ప్రయెజనాల కోసం పెదవి మెదపలేదు. జనసేన సరేసరి. అడిగిన వామపక్షాల నాయకులనే అరెస్టు చేయడం ఈ కథలో కొసమెరుపు.
 

                                                                   దక్షిణాదిలో అక్కడ మాత్రమే !

మరోవైపు నుంచి చూస్తే దక్షిణ భారతంలో కర్ణాటక తప్ప మరెక్కడా బిజెపికి ఠి¸కాణా లేదు. కేరళ, తమిళనాడులలో అసలే నాస్తి. ఎ.పి లో అతి పరిమితం. అంతర్వేది రామతీర్థం వంటి ఘటనలతో మతతత్వం తీసుకురావాలన్నా ఇప్పటికైతే ప్రజల నుంచి స్పందన రాక జిన్నా టవర్‌ను ఎత్తుకున్నారు. ఎ.పి తో పోలిస్తే తెలంగాణలో తమకు నాలుగు లోక్‌సభ స్థానాలు, జిహెచ్‌ఎంసిలో 48 సీట్లు, ఉప ఎన్నికల తర్వాత మూడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి గనక, ముస్లిం జనాభా మజ్లిస్‌ ప్రభావం వున్నాయి గనక ఏదోలా కాలూనవచ్చని బిజెపి పథకాలు వేస్తున్నది. జాతీయ కార్యవర్గ హంగామా ఇందులో భాగమే. ఈ సమావేశాల ముగింపులో మోడీ పాస్మండ్‌ (అంటే వదలివేయబడిన వారు) ముస్లింలను, ఇతర ఉపేక్షిత సామాజిక వర్గాలనూ దగ్గర చేసుకోవాలనీ చేసిన బోధ కూడా బిజెపి ఇరకాటాన్ని చెబుతుంది. ఈ తాపత్రయమంతా ఏదో తెలంగాణలో గెలిచేస్తామన్న నమ్మకంతో కాదని బిజెపికి సన్నిహితులైన వ్యాఖ్యాతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో దేశం మొత్తం మీద 100 స్థానాలు కోల్పోతామని వారి అంతర్గత సర్వేలో తేలిందట. ఉత్తరాదిలో కోల్పోయే ఈ స్థానాల భర్తీ కోసం ఎక్కడ ఏ అవకాశం వున్నా ఉపయోగించుకోవాలనే దక్షిణాది డండయాత్ర అవసరమైంది. అయితే ఇది ఆఖరుకు దండగే అవుతుందని ఆ పార్టీలోనే సందేహాలున్నాయి.
 

                                                                    రాజ్యసభ, సినిమా టచ్చులు

బిజెపి నాయకత్వం ఇవే గాకుండా మరిన్ని చమక్కులు కూడా ప్రదర్శించారు. ఈ సమావేశాలకు ముందే తెలంగాణ బిజెపి నేత డా.కె.లక్ష్మణ్‌ను యు.పి నుంచి రాజ్యసభకు ఎన్నుకున్నారు. ఏకంగా నలుగురిని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇతర రంగాల తరపున రాజ్యసభకు నామినేట్‌ చేయించారు. వీరంతా పరివార్‌ భావజాలానికి దగ్గరగా వుండేవారే. కేరళకు చెందిన పరుగుల రాణి పి.టి ఉష ఆ రాష్ట్రంలో బిజెపి సభలకు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా పనిచేశారు. ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా మొన్న మార్చిలో అంబేద్కర్‌, మోడీ ఒకటేనని ప్రశంసించి విమర్శలు మూటకట్టుకున్నారు. ఇక హెగ్డేవార్‌ బయోపిక్‌ తలపెట్టిన, ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరిని రాముడిగా చూపించిన విజయేంద్ర ప్రసాద్‌ గురించి ఇదే శీర్షికలో చెప్పుకున్నాం (రాజ్యసభ తర్వాత ఆయన రజాకార్‌ ఫైల్స్‌ పేరిట సినిమా కథ రాస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కుమారుడైన రాజమౌళి మహాభారత్‌పై పని చేస్తుంటే వారి బాహుబలి హీరో ప్రభాస్‌ పరివార్‌ మార్కు రామ కథ ఆదిపురుష్‌లో నటిస్తున్నారు). ఇక కర్ణాటకకు చెందిన దేవేంద్ర హెగ్డే ధర్మస్థలి అనే ఆలయ ధర్మకర్తగా మతధార్మిక కార్యక్రమాలు సాగిస్తుంటారు. కె.లక్ష్మణ్‌తో కలుపుకుని అయిదు దక్షిణాది రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం, తమ భావజాలానికి అనుగుణమైన వారినే ఎంచుకోవడం స్పష్టం (ఇందుకు పూర్తి విరుద్ధంగా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఇంటికి పంపటంలో మోడీ వ్యక్తిగత ముద్ర కనిపిస్తుంది.). కాని ఈ బలహీన రాష్ట్రాలలో కూడా బిజెపిలో నాయకత్వ ముఠా సంబంధమైన తగాదాలు కొనసాగుతూనే వున్నాయి. వాటిని చక్కదిద్దడానికి అధికార దర్పాలలో మునిగి ప్రజలకు దూరమైన తమ నాయకులను దారికి తెచ్చుకోవడానికి మోడీ త్రయం వారిని నియోజక వర్గాల పర్యటనలు చేయాలన్నది. ఒకో మంత్రికి మూడు లోక్‌సభ నియోజకవర్గాలను అప్పగించింది. హైదరాబాదు సమావేశాల సందర్భంలోనూ కార్యవర్గ సభ్యులను ముందే రప్పించి ... ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం కోసం 119 అసెంబ్లీ స్థానాలలో క్షేత్రస్థాయి పర్యటనలకు పంపింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల కోసం టిఆర్‌ఎస్‌ మాజీ ఈటెల రాజేందర్‌ ఆధ్వర్యంలో చేరికల కమిటీ వేసింది. అయితే బిజెపిలో ఉక్కపోత, పైనుంచి హుకుంలు భరించలేక చాలామంది బయిటకు రావడం జరుగుతోంది. మోడీతో ప్రత్యక్ష ముఖాముఖికి హాజరైన జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లలోనే నలుగురు టిఆర్‌ఎస్‌లో చేరడం ఇందుకో తాజా ఉదాహరణ. కనుక బిజెపి హడావుడికి వాస్తవంగా కనిపిస్తున్న పరిస్థితికి పొంతనే లేదు. అయినా అభద్రత ఆవరించిన బిజెపి నేతలు ఎంతకైనా సిద్ధపడతారని వాస్తవాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూలదోస్తామని బాహాటంగానే చెబుతున్నారు. కనక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు లౌకిక శక్తుల ఉపేక్షకు అవకాశం లేదు.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి