
రాష్ట్రాల హక్కులూ, అధికారాలపై దాడి చేయడమేగాక వాటి ఉనికికే ఉపద్రవంగా మారిన మోడీ సర్కారు పోకడలు, బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూల్చివేత కుట్రలకు ఫాంహౌస్ ఆపరేషన్ తాజా ఉదాహరణ. ఇలాంటివి ఎన్నిచేసినా అత్యధిక సంఖ్యాబలమున్న కెసిఆర్ సర్కారును పడగొట్టడం బిజెపికి సాధ్యం కాని పని. అయితే ఒత్తిళ్ల ద్వారా అస్థిరపర్చడం, కేంద్ర సంస్థల పేరిట వేటాడి వేధించడం ఇంకా పెరుగుతుంది. గతంలో కెసిఆర్ ఇతర పార్టీల వారిని చేర్చుకున్నారు గనక ఇది పెద్ద సమస్య కాదన్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం బాధ్యతారహితం. అప్పట్లో అన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. వాటిని సాకుగా చూపి దేశ వ్యాపితంగా ఇతర పార్టీల ప్రభుత్వాలను, కూల్చే బిజెపి కుట్రలను ఖండించకుండా తర్కం చేయడం బిజెపికి వంత పాడటమే. ఈ ఘటనల తర్వాత టిఆర్‌ఎస్ వంటి పార్టీలు తమ అంతర్గత పరిస్థితిని సమీక్షించుకుని పొంచివున్న కుట్రలను వమ్ము
చేసేందుకు సమాయత్తం కావాలి. హానికర ప్రభావాలకు అడ్డుకట్ట వేయాలి.
తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కోసం బిజెపి ఢిల్లీ పెద్దల ప్రత్యక్ష పాత్రతో దళారుల బృందం నేరుగా హైదరాబాద్ వచ్చి కన్నంలో దొంగల్లా దొరికి పోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు గాని ఆసక్తికర పరిణామం. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఇప్పటికి కనీసం ఆరు కాంగ్రెస్ ప్రభుత్వాలను, మరికొన్ని ఇతర పార్టీల సర్కార్లను కూల్చివేయడం దేశమంతటికీ తెలుసు. ఇందులో ఒకో రాష్ట్రంలో ఒక ఎత్తుగడ అనుసరించినా సారాంశం మాత్రం ఒక్కటే. సామ దాన భేద దండోపాయాల ప్రయోగం. ప్రజాస్వామ్య సూత్రాల ఖూనీ. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన. అధికార దుర్వినియోగం. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేసి లొంగదీసుకోవడం, లేదా వారిపైన ఇప్పటికే వున్న కేసులను కాస్త నెమ్మదిపర్చడం, పెద్ద పదవులు ఆశ చూపడం, కాంట్రాక్టులతో కార్పొరేట్ వరాలతో సంతృప్తిపర్చడం, నేరుగా కోట్లు కుమ్మరించి టోకున కొనేయడం. ఆ డబ్బు బదలాయించేందుకు రకరకాల వంకర టింకర మార్గాలు అనుసరించి ఒకోసారి దొరికిపోవడం చాలాచోట్ల చూశాం. కాని హైదరాబాద్‌లో పైలెట్ రోహిత్ రెడ్డి అనే అధికార పార్టీ ఎంఎల్‌ఎ ఫాంహౌస్‌లో మరో ముగ్గురు ఎంఎల్‌ఎలు హర్షవర్ధనరెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులతో బిజెపి దూతలు ప్రత్యక్షంగా పోలీసులకు చిక్కడం గతంలో తెలుగువాళ్లు చూడని దృశ్యం. బిజెపి నేతలు మూడు రోజులలో మూడు రకాలుగా మాటలు మార్చుతూ తప్పుకోవాలని తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ షరామామూలుగా బిజెపి, టిఆర్‌ఎస్‌లను కలిపి నాటకం ఆడుతున్నాయంటోంది. బిజెపి కుట్రలను, కొనుగోళ్లను వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ విమర్శలు, కేసులు, ఖండనలు, సమర్థనలు నడుస్తుండగానే వారి అక్రమ ఆఫర్ల ఆడియోలు లీక్ కావడం కథను మరింత పండించింది. దీనిపై హైకోర్టు నిందితుల రిమాండ్‌కూ దర్యాప్తుకు అనుమతినిచ్చింది గనక ఈ కేసు వేగం పుంజుకోవచ్చు.
ఆడియోలలో అసలు కథ
ఇక్కడ పట్టుపడిందీ, లీకులలో వున్నదీ బిజెపి వారే. ఫరీదాబాద్ పూజారిగా వచ్చిన రామచంద్ర భారతి విమానాశ్రయంలో సతీశ్ శర్మగా తప్పు పేరు నమోదు చేసుకున్నారు. మరొకరు సింహయాజి అనే మరో స్వామి తిరుపతిలో తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకుని రామరాజ మఠం పేరిట బిజెపి వారికి ఆశ్రయం కల్పించే పని చేస్తున్నారు. నందకుమార్ అనే మూడో దళారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చాలా దగ్గరగా మసలుతున్నట్టు సాక్ష్యాలున్నాయి. అదే సమయంలో టిఆర్‌ఎస్ వారికి కూడా నందుతో కొన్ని పరిచయాలున్నట్టు కనిపిస్తుంది. ఈ ముగ్గురు ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాక్‌స్టార్‌గా పిలవబడే అత్యంత శక్తివంతుడు బిఎల్ సంతోష్ కుమార్ కనుసన్నల్లో తాము ఇవన్నీ చేస్తున్నట్టు పార్టీలో నెంబర్ 2తో టచ్‌లో వున్నట్టు బిజెపి నేతలు ఫోన్‌లో స్పష్టంగా చెప్పుకున్నారు. తమకు అధిష్టానం ఆశీస్సులున్నాయని, తమవైపు వస్తే చెప్పిన ప్రకారం డబ్బులు ఇవ్వడమే గాక రాజకీయంగా ప్రమోట్ చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. ఎ.పి లో వైసిపి తిరుగుబాటు ఎం.పి రఘురామ కృష్ణంరాజుకు కల్పించినట్టు అన్ని రక్షణలు కల్పిస్తామన్నారు. దీని గురించి రాష్ట్ర బిజెపి నేతలకు కూడా తెలియదని వారిని తక్కువ చేసి మాట్లాడారు. తమకు తెలంగాణలో బలమైన నాయకత్వం లేకపోవడం లోపంగా వుందనీ చెప్పేశారు. ఆప్ ఎంఎల్‌ఎలు కూడా తమతో టచ్‌లో వున్నారనీ, తెలంగాణలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కూడా వస్తారని గొప్పలు చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక కన్నా ముందే ఇది జరిగితే ఇతరేతర ప్రయోజనాలుంటాయని అసలు రహస్యం కూడా కక్కేశారు. రోహిత్‌తో మాట్లాడిన దాంట్లో ఈ వివరాలుంటే వారిలో వారు మాట్లాడుకున్న మరో ఆడియోలో బేరసారాలు, రేట్ల ముచ్చట్లు, అధిష్టానం ప్రమేయం వంటి అంశాలున్నాయి.
టి బిజెపి పాట్లు, ఫీట్లు
జుగుప్సాకరమైన ఈ కొనుగోలు ప్రహసనం ఒక్కసారిగా బయిటకు రాగానే రాష్ట్ర బిజెపి నేతలు అసలు వారితో మాకేం సంబంధం అన్నారు. ఇదంతా కెసిఆర్ ఆడుతున్న నాటకమని ఎదురు దాడి చేశారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనవే అన్నారు. యాదాద్రిలో ప్రమాణం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు సవాల్ చేశారు. ఇంకా ఏడాది కూడా వ్యవధి లేని ఎంఎల్‌ఎల కోసం వంద కోట్లు ఎందుకు వెచ్చిస్తామని సవాళ్లు చేశారు. ఈ నలుగురిని కొంటే తాము సర్కార్‌ను కూలగొట్టలేము కదా అని ఎదురు ప్రశ్నలు వేశారు. అయితే విషయాలు తెలుస్తున్న కొద్దీ నెమ్మదిగా వారి గొంతులోనూ సమాధానాల తీరులోనూ మార్పు వచ్చింది. భయం పెరిగింది. ప్రభుత్వం కన్నా ముందే బిజెపి రాష్ట్ర కార్యదర్శి హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో సిట్ ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. పోలీసులు ఎసిబి కోర్టు ముందు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా నగదు పట్టుబడలేదు గనక ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం వర్తించదని, ఆధారాలపై సిఆర్‌పిసి 41 కింద నోటీసు ఇచ్చి దర్యాప్తు జరపాలని ఆదేశించింది. వారిని విడుదల చేసింది. ఎంఎల్‌ఎలు, ఎంపీలు ప్రభుత్వోద్యోగుల కిందకు వస్తారా లేదా అనేదానిపై కోర్టులు పరిపరివిధాల తీర్పులిచ్చాయి. డబ్బుతో పట్టుబడ్డారు గనక గతంలో అప్పటి టిడిపి ఎంఎల్‌ఎ, ఇప్పటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు (అది ఇంకా విచారణ లోనే వుంది). ఇప్పుడు కూడా పదిహేను కోట్లు పట్టుబడ్డాయని పోలీసులు చెప్పినట్టు వార్తాకథనాలు కొన్ని వచ్చినా, ఏవో బ్యాగులు చూపించినా పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. తమను ప్రలోభ పెడుతున్నారని పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే తాము రంగంలోకి దిగినట్టు వారు చెప్పారు. ఎఫ్‌ఐఆర్ లోనూ పొందుపర్చలేదు. ఎసిబి కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌పై మరికాస్సేపట్లో హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. లా అండ్ ఆర్డర్ పోలీసులు అరెస్టు చేయడం సరికాదని మొదట చెప్పిన హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది వాదన విన్నాక అసాధారణ స్వభావం రీత్యా నోటీసు లేకుండా అరెస్టు చేయొచ్చని అనుమతించింది.
మీడియాలో వింత కథనాలు
మొత్తంపైన ఈ కేసులో చాలా మీడియా సంస్థల వైఖరి వింతగానే వుంది. దొరికింది బిజెపి వారైనా వీరు మాత్రం కెసిఆర్ డ్రామానా అంటూ ఊదరగొట్టారు. స్వయం కల్పిత వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఇది ఎవరికి లాభమంటూ చర్చలు నడిపారు. ఇదేదో కెసిఆర్, బిజెపిల యుద్ధం అన్నట్టు చిత్రణనిచ్చారు. దానికి ఎసిబి కోర్టు తీర్పును వత్తాసుగా తీసుకున్నారు. అంతేగాని బిజెపి వారి వాదనలోని డొల్లతనాన్ని వారు నేరపూరితంగా పట్టుబడిన వాస్తవాన్ని దేశ వ్యాపితంగా వారి కూల్చివేత కుట్రలను పరిగణనలోకి తీసుకున్నది లేదు. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్నట్టు ఇన్ని ఆధారాలు కనపడుతున్నా అత్యధిక వ్యాఖ్యాతలు రెంటినీ ఒకే గాట కట్టి మాట్లాడారు. ఆడియో లీకులు వచ్చాక కూడా బిజెపిపై నేరుగా విమర్శ చేసేందుకు సాహసించలేదు. అంటే మన మీడియా మొగ్గు ఎటో, వ్యాఖ్యాతల ఝంఝాటం ఏమిటో దీన్నిబట్టే తెలుసుకోవచ్చు. కెసిఆర్ మీడియాతో మాట్లాడకపోవడం బూమరాంగ్ (బెడిసికొట్టిన) ఫలితమేనని సూత్రీకరించారు. ఈ మూడు రోజులు ఆ నలుగురు ఎంఎల్‌ఎలను ప్రగతి భవన్‌లోనే అట్టిపెట్టుకోవడం టిఆర్‌ఎస్ వైపు తప్పులను కప్పిపుచ్చడానికేనని తేల్చేశారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ మాట్లాడవద్దని కెటిఆర్ ట్వీట్ చేయడం ఇందుకు నిదర్శనంగా చూపారు. అయితే అదే ట్వీట్‌లో ఆయన బిజెపి వారు దొరికిపోయారన్న సంకేతం స్పష్టంగా ఇచ్చారు. హైకోర్టు తీర్పు తర్వాత ఈ రోజు మీడియాతో మాట్లాడినా కెటిఆర్ పరిమితంగానే స్పందించారు. అన్నీ చట్టబద్దంగా జరుగుతాయని సమర్థులైన దర్యాప్తు అధికారులు నిజానిజాలు నిర్ధారించేదాకా ఆగుదామని అన్నారు. యాదాద్రి నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేసిన బండి సంజరు ప్రహసనాన్ని మాత్రం తీవ్రంగా అపహాస్యం చేశారు. తాము ఏం మాట్లాడినా కేసును ప్రభావితం చేశామని అంటారు గనకే సంయమనం పాటిస్తున్నట్టు స్పష్టం చేశారు. మొదటి దశలో ఈ తీర్పు ఎక్కడ లేని సంచలనంలా చూపిన కొన్ని ఛానళ్లు మార్పు రాగానే తీర్పులో తప్పున్నట్టు లాయర్లతో చెప్పించడం మొదలెట్టాయి. సుప్రీం కోర్టు గతంలో స్పష్టంగా చెప్పినదానికి భిన్నంగా ఈ తీర్పు వుందని, ఇకపై ఏ కేసైనా అరెస్టు చేసే అధికారాలు పోలీసులకు సంక్రమిస్తాయని ఆరోపిస్తూ పైకోర్టుకు వెళ్లవచ్చని బిజెపి తరపు లాయర్లు చెబుతున్నారు. అది వారి హక్కు. అయితే దేశవ్యాపితంగా విశ్వసనీయత కోల్పోయి, రాష్ట్ర బిజెపి నేతలు హైకోర్టులో సిబిఐ దర్యాప్తు లేక సింగిల్ జడ్జి సిట్ విచారణ కోరడం దర్యాప్తును ప్రభావితం చేసేందుకేననే దానిపై ఎవరిలోనూ సందేహం లేదు. ఈ విషయాలు బయిటకు రాగానే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనను కూల్చేందుకు జరిగిన కుట్రలను గుర్తుచేశారు. ఇక గతంలోనే తనతో సహా ఆప్ ఎంఎల్‌ఎలను ఫిరాయింపచేయడానికి ప్రలోభాలు, కేసులు ప్రయోగించిన వైనాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశోడియా వెల్లడించారు. యజ్ఞయాగాలు చేసే స్వాములు, పూజారులే ఈ కేసులో దళారులు కావడం గమనించదగ్గది. అందరిపైనా ఇ.డి ని ప్రయోగించే కేంద్రం అక్రమ వ్యాపారులను కూడా విచ్చలవిడిగా వాడుకోవడం యాదృచ్ఛికం కాదు.
రాష్ట్రాలు, పార్టీల కర్తవ్యం
రాష్ట్రాల హక్కులూ, అధికారాలపై దాడి చేయడమేగాక వాటి ఉనికికే ఉపద్రవంగా మారిన మోడీ సర్కారు పోకడలు, బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూల్చివేత కుట్రలకు ఫాంహౌస్ ఆపరేషన్ తాజా ఉదాహరణ. ఇలాంటివి ఎన్నిచేసినా అత్యధిక సంఖ్యాబలమున్న కెసిఆర్ సర్కారును పడగొట్టడం బిజెపికి సాధ్యం కాని పని. అయితే ఒత్తిళ్ల ద్వారా అస్థిరపర్చడం, కేంద్ర సంస్థల పేరిట వేటాడి వేధించడం ఇంకా పెరుగుతుంది. గతంలో కెసిఆర్ ఇతర పార్టీల వారిని చేర్చుకున్నారు గనక ఇది పెద్ద సమస్య కాదన్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం బాధ్యతారహితం.అప్పట్లో అన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. వాటిని సాకుగా చూపి దేశ వ్యాపితంగా ఇతర పార్టీల ప్రభుత్వాలను, కూల్చే బిజెపి కుట్రలను ఖండించకుండా తర్కం చేయడం బిజెపికి వంత పాడటమే. ఈ ఘటనల తర్వాత టిఆర్‌ఎస్ వంటి పార్టీలు తమ అంతర్గత పరిస్థితిని సమీక్షించుకుని పొంచివున్న కుట్రలను వమ్ముచేసేందుకు సమాయత్తం కావాలి. హానికర ప్రభావాలకు అడ్డుకట్ట వేయాలి. బిజెపితో సఖ్యత పాటిస్తున్న ఎ.పి ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వారి పార్టీలు కూడా వాస్తవాలను గమనించి రాష్ట్రం కోసం సరైన రాజకీయ పంథా చేపట్టాలి. బిజెపి కుటిల యత్నాలు ఇప్పటికి విఫలమైనా మరెక్కడా పునరావృతం కాకుండా చేయాలి. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఇలాంటి నిరంకుశ పోకడలను, మతోన్మాద చర్యలను నిలవరించేందుకు సమీకృతం కావాలి.
తెలకపల్లి రవి