Mar 12,2023 11:39

మార్కెట్లో సగానికిపైగా నకిలీ వస్తువులు, దోపిడీ ధోరణితో నాసిరకం వస్తువులు అంటగడుతున్నారు. చిన్న పిల్లలు తినే పదార్థాలను నకిలీ లేబుల్స్‌తో అమ్మేస్తూ.. ప్రాణాల మీదకు తెస్తున్నారు. కొనుగోలు చేసిన వస్తువుకు పరిమాణం, స్వచ్ఛత, నాణ్యత, ప్రమాణం వ్యాపారస్తుడు చెప్పినట్లు లేకపోవడం.. దీనిపై ఏమి చేయాలనే అవగాహన వినియోగదారుడికి లేకపోవడంతో ఎక్కువమంది మోసాలకు గురవుతున్నారు. కానీ తినే పదార్థాల నుండి సినిమా టికెట్లు, కార్ల కొనుగోలు, భవనాల నిర్మాణం, కొనుగోలు, ఇన్సూరెన్సులు, పోస్టల్‌, లీగల్‌, విద్యుత్‌, నీరు తదితర అన్ని అంశాలపైనా వారికి అన్యాయం జరిగిందని భావించిన ప్రతి ఒక్కరూ నేరుగా ఫిర్యాదు చేసి, వారే వాదించుకుని న్యాయం పొందొచ్చు. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కులు, వారికి వర్తించే చట్టం, కోర్టులో పిటీషను దాఖలు చేసుకోవడం, ఖర్చు లేకుండా న్యాయం పొందడం, సొంతంగా వాదించుకోవడం కోసం అనేక చట్టాలున్నాయి. దీనిమీద ఈ ప్రత్యేక కథనం..

Awareness-is-the-weapon


మార్కెట్లో పెరిగిపోతున్న దోపిడీని అరికట్టేందుకు పార్లమెంటు 'వినియోగదారుల హక్కుల పరిరక్షణా చట్టాన్ని' 1986 డిసెంబరు 24న ఆమోదించింది. అయితే సాంకేతికత పెరిగిన నేపథ్యంలో 2019లో పాత చట్టాన్ని మార్చి, మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు. ఇది 2020 జులై 20వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. వినియోగదారుల హక్కుల చట్టాన్ని ప్రథమంగా అమెరికా అధ్యక్షులు జాన్‌ ఎఫ్‌ కెనడీ 1962 మార్చి 15న యుఎస్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అది ప్రపంచ దేశాల్లో 1973 నుండి అమల్లోకి వచ్చింది. దాంతో మార్చి 15వ తేదీని 'అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణా దినం'గా జరుపుతున్నారు. దీనికంటే ముందే 1920లో రాల్ఫ్‌ నాడార్‌ అనే వ్యక్తి వినియోగదారుల హక్కులపై పోరాటం చేసినట్లు ఆ చట్టం ప్రతినిధులు చెబుతున్నారు.
 

                                                                              మనదేశంలో..

మనదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబర్‌ 24న అమల్లోకి వచ్చింది. దాదాపు అన్నింటా మోసాలు, అవకతవకల నుండి రక్షణ కల్పిస్తోంది. పరిష్కారం, నివారణ, న్యాయపరమైన మార్గాల ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలూ లేకుండా నష్టపరిహారం అందించడంలో న్యాయం చేస్తుంది. 'రైట్‌ టు సేఫ్టీ, రైట్‌ టు బి ఇన్ఫార్మ్‌, రైట్‌ టు చూజ్‌' అనే నినాదాలతో వినియోగదారుల హక్కుల కోసం పనిచేస్తోంది. కానీ కొంత కాలంగా మార్కెట్లో సగానికి పైగా నకిలీ వస్తువులు, దోపిడీ ధోరణితో నాసిరకం వస్తువులు ఇబ్బడిముబ్బడిగా డంప్‌ అవుతున్నాయి. తినే పదార్థాల నుండి సినిమా టిక్కెట్లు, కార్ల కొనుగోలు, భవనాల నిర్మాణం-కొనుగోలు, ఇన్సూరెన్సులు, పోస్టల్‌, లీగల్‌, విద్యుత్‌, నీరు తదితర అన్ని అంశాలపైనా.. అన్యాయం జరిగిందని భావించిన ప్రతి ఒక్కరూ నేరుగా ఫిర్యాదు చేసి, కోర్టులో వారే వాదించుకుని న్యాయం పొందొచ్చు. దీనిపై అవగాహన కల్పించడంతో పాటు, జరిగిన నష్టానికి పరిహారం పొందేలా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన ప్రత్యేక వెబ్‌సైట్‌ కూడా ఉంది. వినియోగదారుల హక్కుల చట్టానికి లోబడి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌లో అనేక అవకాశాలను ఫ్రభుత్వం కల్పించింది.
 

/Awareness-is-the-weapon

                                                                  అవగాహన కల్పించడంలో లోపం..

నష్టపోయిన వినియోగదారుడు కోర్టును ఆశ్రయించడం, కనీస రుసుముతో న్యాయం పొందడం ఎలా అన్నదే చట్టం ఉద్దేశం. ఈ చట్టం అమల్లోకి వచ్చి, దశాబ్దాలు గడుస్తున్నా వినియోగదారులకు వారి హక్కుల గురించి అవగాహన లేదు. కల్పించే ప్రయత్నాలూ చేయడం లేదు. వ్యాపారులు, తయారీదారులే పాలకులుగా మారడంతో పార్లమెంటులోనూ చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. వారి ఆధ్వర్యంలోనే నడిచే ప్రభుత్వాలు ప్రచారం కల్పించడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
 

                                                         ఆన్‌లైన్‌ అమ్మకాలతో మరిన్ని చిక్కులు..

ఇటీవల కాలంలో సాంకేతికత పెరగడంతోపాటు డిజిటల్‌, ఆన్‌లైన్‌ లావాదేవీలు, టెలీ మార్కెటింగ్‌ పెరగడంతో మోసాలూ మరింత ఎక్కువయ్యాయి. ఆన్‌లైన్‌ వ్యాపారాలు నిర్వహించే సంస్థలకూ వర్తించే విధంగా 2020 జులైలో తీసుకొచ్చిన చట్టంలో మార్పులూ చేర్పులూ చేశారు. అయితే మోసం జరగకుండా చూసుకోవడం, వస్తువులు కొనేటప్పుడే దాని నాణ్యత, గ్యారంటీ వంటి వివరాలు తెలుసుకోవడం వినియోగదారుడి ప్రథమ కర్తవ్యం. వస్తువు వివరాలు వెల్లడించడం, అర్థమయ్యేలా చెప్పడం వ్యాపారి బాధ్యత. అంటే ఒక వస్తువైనా, మందైనా అందులో ఏమేమి ఉన్నాయి. వాటివల్ల ప్రయోజనం ఏమిటి అనే అంశాలను అడిగి తెలుసుకోడం మన కర్తవ్యం. అడిగితే చెప్పడం అనేది వ్యాపారి కనీస బాధ్యత. నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసే సమయంలో ఈ రెండూ వర్తిస్తాయి. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే సమయంలో అంత గ్యారంటీ ఉండదు. వస్తువు చేతికొచ్చిన తరువాతగానీ దాని అసలు రూపం తెలియదు.. బాగుంటే సరేసరి. లేకుండా డబ్బులు గుల్ల. అయితే రిటర్న్‌ ఆప్షన్‌, రీ ఫండ్‌ ఫెసిలిటీ ఉందీ లేనిదీ చూసుకోవాల్సింది కొనుగోలుదారే. ఏదేమైనా ఒక్కోసారి ఆ ఆప్షన్స్‌ కూడా వర్తించకుండా, ఎగ్గొట్టెయ్యడమే ఎక్కువగా ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో జరిగేది. కష్టపడి సంపాదించిన సొమ్ము అక్రమార్కుల పాల్జేయడం తీవ్ర ఆర్థిక నష్టమే కాదు.. మనశ్శాంతి కూడా ఉండదు.

Awareness-is-the-weapon

                                                              జిల్లా స్థాయిలో రక్షణ కమిషన్‌..

వినియోగదారుల కోర్టులో వినియోగదారుడే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. వస్తువులు ఎక్కడ కొన్నా తన సొంత జిల్లా లేదా ఉద్యోగం చేసే జిల్లాలో ఫిర్యాదు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి హైదరాబాద్‌ లేదా విజయవాడలో వస్తువులు కొనుగోలు చేశారు. అతను నెల్లూరులో గానీ, కర్నూలులో గానీ నివశిస్తుంటే ఆయా జిల్లా కేంద్రాల్లోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. ఇలా ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో వినియోగదారుల రక్షణ కమిషన్‌ పనిచేస్తోంది. కొనుగోలు చేసిన వస్తువుల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్లో ఫిర్యాదు చేయొచ్చు. రూ.5 లక్షల విలువ కలిగిన వస్తువుల వరకూ కోర్టులో ఎటువంటి ఫీజూ చెల్లించనవసరం లేకుండానే న్యాయం పొందొచ్చు. దీనిపై నాలుగు నెలల్లో కోర్టు తీర్పు ఇస్తుంది. అక్కడా సరైన న్యాయం జరగలేదని వినియోగ దారుడు భావిస్తే, రాష్ట్ర కమిషన్లోనూ ఫిర్యాదు చేయొచ్చు.

Awareness-is-the-weapon


 

                                                            రాష్ట్ర, జాతీయ స్థాయి కమిషన్లలో ఇలా...

జిల్లా స్థాయిలోనే రూ.50 లక్షల విలువైన సేవల వరకూ విచారణ జరుగుతుంది. రెండు కోట్ల విలువైన వస్తువులలోపు రాష్ట్ర కమిషన్లోనూ, అంతకుమించి విలువైన వస్తువుల కేసును జాతీయ కమిషన్లోనూ ఆన్‌లైన్‌ పద్ధతిలో ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనికోసం జాతీయ వినియోగదారుల సేవా కేంద్రం మొబైల్‌ యాప్‌ కూడా ఉంది. దీంతోపాటు 1915, 1800114000 టోల్‌ఫ్రీ నెంబర్లకూ ఫిర్యాదు చేయొచ్చు. వారు సంబంధిత జిల్లాలకు సమాచారం అందిస్తారు. దీనికోసం వస్తువులు కొనుగోలు చేసే సమయంలో బిల్లులు, ఆన్‌లైన్‌ పద్ధతిలో అయితే ఇన్‌వాయిస్‌ ఇతర సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. అవి లేకపోతే ఎలాంటి ఫిర్యాదూ తీసుకోరు. కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడానికి రూ.500 నుండి రూ.1000 మాత్రమే ఫీజు ఉంటుంది.
           ప్రతి కొనుగోలు దారుడికీ కొన్ని హక్కులుంటాయి. ప్రతి వ్యాపారికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేరమనేది వస్తువు కొనుగోలు వరకే వర్తించదు. ఆ వస్తువు గురించి ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయని ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ చేయడం కూడా నేరమే అవుతుంది. వీటి గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది. కొనే వస్తువు మనకు ఉపయోగపడాలే తప్ప, ఎలాంటి హానీ కలిగించకూడదు. వాటి ధరల విషయంలో కూడా పారదర్శకత ఉండాలి. గ్యారంటీ పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది.

Awareness-is-the-weapon


                                                                నగదు చెల్లింపుల సర్వీసుకు..

వస్తువే కాదు.. నగదు బదిలీ సేవల్లోనూ డబ్బులు చెల్లించిన తరువాత, సర్వీసు చేయకపోయినా ఫిర్యాదు చేయొచ్చు. దీన్ని వినియోగదారుల సేవాలోపం అంటారు. దీనిపై కోర్టుకు వెళితే ఆధారాలను పరిశీలించి, తీర్పు ఇస్తుంది. ఇచ్చిన తీర్పు అమలు చేయకపోతే సెక్షన్‌ 72 కింద కోర్టులో కంప్లెయింట్‌ చేయొచ్చు. అప్పుడు పార్టీ నేరుగా కోర్టుకు వచ్చి, డబ్బులు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మూడేళ్ల నుండి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది. దీనికోసం వినియోగదారుడు నేరుగా లేదా అడ్వకేట్‌, లేదా సంఘం ద్వారా వినియోగదారుల కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయొచ్చు. ఇందులో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. పిటీషన్‌ పరిశీలించి, బాధితులకు న్యాయం చేస్తారు. పిటీషన్లో న్యాయం ఉందని తేలితే మోసం చేసిన వ్యక్తికి ఆరునెలల నుండి 10 సంవత్సరాల పాటు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

Awareness-is-the-weapon


                                                                 భవన నిర్మాణ కేసులే ఎక్కువ..

వినియోగదారుల కోర్టుల్లో ఇటీవల భవన నిర్మాణాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఫలానా సదుపాయాలు కల్పిస్తామని ముందుగానే డబ్బులు కట్టించుకుంటున్న కొద్దిమంది బిల్డర్లు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. సదుపాయాల మాట పక్కనబెడితే అసలు భవనమే కట్టడం లేదు. కట్టినా ఒకస్థాయి వరకూ నిర్మించి, అసంపూర్తిగా వదిలేస్తున్నారు. కనీస సదుపాయాలు ఉండవు. నిర్ణీత సమయంలో పూర్తిచేయరు. పార్కింగు, జనరేటర్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తామని డబ్బు తీసుకుని వాటిని కల్పించరు. దీంతో డబ్బు కట్టిన వ్యక్తి అన్ని రూపాల్లోనూ నష్టపోయి, చివరకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరహా మోసాలకు గురైన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై అగ్రిమెంటు పరిశీలించిన న్యాయమూర్తులు న్యాయం ఉందనుకుంటే వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఏ తీర్పు అయినా 30 రోజుల్లో అమలు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మానసికంగా కుంగిపోయినట్లు వైద్య రిపోర్టుల ద్వారా తెలిస్తే, దానికీ పరిహారం ఇప్పించే అవకాశం ఉంటుంది.

Awareness-is-the-weapon

                                                             చట్టానికి తూట్లు పొడిచిన కేంద్రం..

వినియోగదారుల రక్షణ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన కేంద్రం బలహీనపరిచే విధంగా మార్పులు, చేర్పులు చేసింది. 1986 నుంచి అమలులో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు ప్రజలకు కాక వ్యాపారులకు ఉపయోగపడేలా ఉన్నాయి. జిల్లా వినియోగదారుల సేవలకు సంబంధించి సెక్షన్‌ 34, సబ్‌సెక్షన్‌ 1 ప్రకారం వస్తువుల విలువ రూ.50 లక్షలకు మించని కేసులు మాత్రమే విచారించాలని ఆంక్ష పెట్టింది. రాష్ట్ర కోర్టులో కమిషన్‌ సెక్షన్‌ 47 సబ్‌సెక్షన్‌ -1 క్లాజ్‌(ఎ), సబ్‌క్లాస్‌(ఐ) ప్రకారం వస్తువుల సేవలు పదికోట్ల రూపాయలలోపు ఉన్న పరిధిని రెండుకోట్లకు తగ్గించింది. అలాగే జాతీయ వినియోగదారుల పరిష్కార కమిషన్లో సెక్షన్‌ 59 సబ్‌ సెక్షన్‌ 1, క్లాజ్‌(ఎ), సబ్‌క్లాజ్‌(ఐ) ప్రకారం పదికోట్లలోపు వివాదాలను పరిష్కరించే విధంగా అధికారాలు కట్టబెట్టింది. దీనివల్ల మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. కేంద్రంతోపాటు రాష్ట్రం కూడా ఈ వ్యవస్థను బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోంది. జిల్లా కమిషన్‌ ఛైర్మన్‌కు జిల్లా న్యాయమూర్తితో సమానమైన వేతనం, రాష్ట్ర కమిషన్‌ ఛైర్మన్‌కు హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన వేతనం చెల్లించాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ అధికార పార్టీలు మాత్రం వారి తరపు న్యాయవాదులను ఛైర్మన్లుగా నియమిస్తున్నారు. దీనివల్ల అక్కడా అవినీతి పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది.

Awareness-is-the-weapon


         వినియోగదారుల కేసులకు సంబంధించి జిఎస్‌టి, ఎయిర్‌లైన్స్‌, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, విద్యుత్‌, ఫుడ్‌సేఫ్టీ, మెడికల్‌, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌, లీగల్‌ అనేక అంశాలపై ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఉంది. నేరుగా ఫిర్యాదు చేసే కంటే వినియోగదారుల ఫోరం వెబ్‌సైట్లో అకౌంట్‌ ఓపెన్‌ చేసుకుని, ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ తెలుసుకునే వీలుంటుంది.

Awareness-is-the-weapon


                                                                       ఏయే సందర్భాల్లో..

వైద్యులు, న్యాయవాదులు అందించే సేవలు కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమగ్ర చట్టం పరిధిలోకి వస్తాయి. సేవల్లో.. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా వాటివల్ల నష్టం వాటిల్లినా పరిహారం కోరడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇవే కాక...

Awareness-is-the-weapon
  • నాణ్యత లేని, కల్తీ సరుకులను విక్రయించినప్పుడు.
  • మందుల దుకాణంలో కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ), నాసిరకం మందులు అమ్మినా, గరిష్ట చిల్లర ధరకన్నా ఎక్కువగా విక్రయించినా..
  • ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం, సేవా లోపం కారణంగా నష్టం వాటిల్లినా.
  • ప్రభుత్వ వైద్యశాల అయినప్పటికీ చికిత్స కోసం రుసుము (యూజర్‌ ఛార్జీలు) వసూలు చేసినా చట్టం పరిధిలోకి వస్తుంది.
  • బ్యాంకు రుసుములు వసూలు చేసే సేవలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు.
  • జీవిత, సాధారణ బీమా కంపెనీలు క్లెయిమ్స్‌ పరిష్కారం విషయంలో ఇబ్బంది పెట్టినప్పుడు.
  • టెలివిజన్‌, ఫ్రిజ్‌లాంటి విద్యుత్‌ ఉపకరణాలు సక్రమంగా పనిచేయనప్పుడు.
  • కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల రైతులకు నష్టం వాటిల్లినప్పుడు.
  • రైల్వేలు, విమానయాన సంస్థలు, విద్యుత్‌ సంస్థ, బ్యాంకులు, బీమా కంపెనీలు, చిట్‌ఫండ్‌ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా లోపాలుంటే..


 

Awareness-is-the-weapon

                                                                 ఇన్సూరెన్స్‌ పాలసీలకు ఇలా..

అలాగే ఇన్సూరెన్స్‌ పాలసీల్లోనూ ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. క్యాష్‌లెస్‌ క్రెడిట్‌ పాలసీ అని చెప్పి డబ్బులు కట్టించుకుని.. తీరా చికిత్స సమయానికి చేతులెత్తేస్తుంటారు. రకరకాల ఆంక్షలు పెడుతుంటారు. ఆస్పత్రి యాజమాన్యం ఆ పాలసీ చెల్లదని చెబుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా వినియోగదారుల కోర్టుల్లో ఫిర్యాదు చేయొచ్చు. ముందుగా ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి ఫీజు కట్టేసి రశీదులు తీసుకుని, ఇన్సూరెన్స్‌ కంపెనీపై ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ వినియోగదారులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది.

వల్లభనేని అభిజ్ఞ
6303103799