Dec 09,2022 07:11

పొద్దున్నే లేచి పేపర్‌ చూస్తే ఓ వార్త ఆకట్టుకుంది సూర్యారావుని. వీరేశలింగం పంతులు అవార్డు యోగీస్వరరావుకు ఇస్తున్నామని ఓ సంస్థ ప్రకటించింది. యోగీస్వరరావునే ఎందుకు సెలెక్టు చేశారు...ఆయన వితంతు వివాహాలు జరగరాదని...అది సమాజానికి హితం కాదని...టీవీల్లో చెబుతూ ఉంటాడు కదా అని కొందరు విమర్శించారు. ఐనా సరే మేము ఇచ్చి తీరతామని, వెనక్కిపోయే ప్రశ్నే లేదని ఆ సంస్థ వారు ప్రకటించారు. అదే పనిగానే ప్రజల ధ్యాస మళ్ళించడానికి ఈ అవార్డు ఇస్తున్నారని, వచ్చే సంవత్సరం ఈయనకే జాతీయ స్థాయిలో రాజా రామమోహన రారు అవార్డు కూడా ఇస్తారనీ తెలియవచ్చింది.
       సరే ఎవరెట్టా పోతే నాకేంటని ఆఫీసుకు పోయాడు సూర్యారావు. అక్కడా ఈమాటలే మాట్లాడుతున్నారు. తానూ ఆ అవార్డు ఇవ్వకూడదన్నాడు, దానికున్న విలువ పోతుంది కదా అనీ అన్నాడు. తన సీటుకు ఆ పక్కా, ఈ పక్కా కూచునే వాళ్ళే తనపైన ఎగిరెగిరి పడుతున్నారు. వామ్మో ఇదేదో మళ్ళీ తమని రెండు గ్రూపులుగా చేసే విషయంలా అనిపించి లైట్‌గా తీసుకోండి అనేసి ఆపేశాడు ఆ టాపిక్‌. అప్పటికి సమస్య తీరింది కాని ఈ మధ్య జరుగుతున్న సంఘటనల్ని చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుంది అని సూర్యారావుకి గుబులు పట్టుకుంది. ఇంటికొచ్చాడన్న మాటే కాని రోజులా హుషారుగా లేడు. సరేలే ఆఫీసులో గొడవేదైనా జరిగి ఉంటుందిలే అని అతని శ్రీమతి కూడా ఏమీ అనలేదు. తనకిష్టమైన ఆలూ కూర చేస్తే కూడా ఏమీ అనకుండా తినేశాడు.
         మరుసటిరోజు ఉదయమే లేచి పేపర్‌ తీశాడు. ఈసారి నోబెల్‌ బహుమతులకు కేంద్రప్రభుత్వం కొన్ని అప్లికేషన్లు పెడుతోందని, వాటి వివరాలు ఎవ్వరికీ తెలియకుండా తాము తెచ్చి వేస్తున్నామనీ చాలా గోప్యంగా ఈ సమాచారం సేకరించామని 'నేడే నేడే' పత్రిక ప్రకటించింది. ఇదంతా పచ్చి అబద్ధమని ప్రభుత్వం చెప్పే అవకాశాలు ఉన్నాయనీ అందులోనే రాశారు. ఆ అవార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అన్న అంశాలను చదవడం మొదలుపెట్టాడు.
           వైద్యంలో ఇచ్చే నోబెల్‌ బహుమతి ఆచార్య కుందన్‌ దవానీకి ఇవ్వాలని, శస్త్ర చికిత్సల గురించి మన పుస్తకాలెన్నో పరిశీలించి, పరిశోధించి రాసిన పుస్తకం మానవ జాతి చరిత్రలో, మానవ వైద్య చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోయిందని అందుకే ఆయన పేరు ఎంపిక చేశామనీ రాశారందులో. ఎన్నో వందల వేల సంవత్సరాలకు ముందే మనవాళ్ళు ఆపరేషన్లు చేశారనీ రాశాడు.
          ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ప్రొఫెసర్‌ కూర్మారావుకు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది. ఎందుకంటే, కొన్ని కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలేముందు రోజు ఏదో సమస్య వచ్చిందనీ, ఆ సమస్య పోవడానికి ఆయన వరుసగా ఐదారు గుళ్ళలో పూజలు చేయించాడని, ఇతర మతాల వారిని కూడా ప్రార్ధనలు చేయమని అడిగాడని, ఆ తరువాత ప్రయోగించిన ఉపగ్రహాలు జుయ్యిమని, రివ్వుమని ఆకాశంలోకి ఎగిరిపోయాయని అందుకే ఈ అవార్డుకు ఆయనే అర్హుడనీ ప్రకటించారు. వాటిని తయారు చేసిన శాస్త్రవేత్తలను మరిచారని ఎవరో అడిగితే, ఫైనల్‌గా ఈయన చేసిన పూజలవల్లే ప్రయోగం విజయవంతమైందని, అందుకే అవార్డుకు ఆయనను ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలిసింది.
           ఇక రసాయన శాస్త్రంలో అప్పుడెప్పుడో రామన్‌ పిళ్ళై ఆకుపసరుతో కనిపెట్టిన పెట్రోలే కాక ఇంకా వివిధ రాష్ట్రాల్లో అలాంటివాటి వివరాలు సేకరించి అవన్నీ కలిపి పెట్రోలు తయారు చేస్తే దానికి తిరుగుండదని రాసిన పుస్తకం ముందు వివిధ దేశాల ప్రయోగాలు నిలబడలేవనీ చెబుతున్నారు. అప్పుడు గల్ఫ్‌ దేశాలవాళ్ళే మన గడ్డం పట్టుకొని మరీ ఆ ప్రయోగం ఫార్ములా అడుగుతున్నారట. ఆవిధంగా ముందుకుపోయేలా రాసిన ఆ పుస్తక రచయిత ఆమ్లారావుకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్‌ గ్యారెంటీ అని నిర్ణయించారట.
       ఇక ఖగోళ శాస్త్రంలో ఓ విప్లవాత్మక సందేశాన్నిచ్చిన శుక్రదేవాచార్య పేరు పరిశీలనలోకొచ్చిందని, రావు గుండె తెలుగు గంగ రిజర్వాయరయ్యింది. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడూ తిరుగుతున్నారని కనిపెట్టిన సిద్ధాంతం తప్పు అని నిర్ణయించాడాయన. అందుకాయన ప్రత్యేకమైన టెలిస్కోపును కూడా కనిపెట్టాడనీ ఇక ప్రపంచ ఖగోళ శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుందనీ అంటున్నారు.
         ఇక సాహిత్యంలో నోబెల్‌. సూర్యారావు ఒక చేత్తో గుండెను, ఇంకో చేత్తో పేపరును పట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. చేతబడులపైన, ఇంకా అలాంటి మంత్ర విద్యలపైన ఎంతో సమాచారాన్ని సేకరించి రాసిన నవల మంత్రోదయం పుస్తకానికి గాను వెన్నెలూరి రాజేంద్రనాథ్‌ కు ఇవ్వాలని, ఈ నవల ప్రపంచ నవలా చరిత్రలోనే ఒక మేలుమలుపుగా మిగులుతుందనీ రాసుకొచ్చారు. మన సూర్యారావు తన గుండెను రెండు చేతులతో పట్టుకొని పేపర్‌ బండమీద పెట్టి మరీ చదవడం మొదలెట్టాడు..
          ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మివేసి ఇద్దరు ముగ్గురి ఆస్తులు పెంచిన ఆర్థికశాఖ మంత్రికి ఆర్థికశాస్త్రంలో, ఎన్నో ప్రభుత్వాలను అర్ధాంతరగా పడగొట్టి తమ జెండా పాతిన బహుత్‌ఝాకు రాజనీతి శాస్త్రంలో, అలాగే ఎన్నో రైళ్ళను తగులబెట్టించిన ప్రియతమ నాయకుడికి...ప్రపంచమంతా యుద్ధాలు చేయించిన అమెరికా ప్రెసిడెంటు బాష్‌ బాష్‌కు కలిపి సమ్యుక్తంగా నోబెల్‌ శాంతి బహుమతికి నామినేషన్‌ పంపాలని నిర్ణయించారు.
సూర్యారావు కళ్ళు తిరుగుతున్నారు, కాళ్ళు వణుకుతున్నారు, నోరెండిపోతోంది, చేతులు కాళ్ళూ నీలుక్కుపోయి కంట్రోల్‌ తప్పుతున్నారు, గట్టిగా అరిచాడు...

''ఇదంతా మోసం, అశాస్త్రీయం, అప్రజాస్వామికం, ఇదంతా నియంతలు ఆడుతున్న ఆట, నేను వ్యతిరేకిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను'' అంటూ అరుస్తున్నాడు.
సూర్యారావు పిల్లలు, భార్య అతని మొహంపై నీళ్ళు చల్లుతున్నారు, ఏదో కలవరిస్తున్నాడని
''హమ్మయ్యా, ఇది కలా.....''
''ఇలాగే నిద్రపోతే నిజమవుతుంది'' అంది అతని శ్రీమతి.

- జంధ్యాల రఘుబాబు,
సెల్‌ : 9849753298