Nov 10,2023 10:01

గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకూ... తినే ఆహారం నుంచి ధరించే దుస్తులు... తొడుక్కునే చెప్పులు... బంగారు..వెండి ఆభరణాలు.. మార్కెట్లో కనిపించే ప్రతి వస్తువూ... తినే ఆహార పదార్థాలు.. తాగే నీరుతో సహా సమస్తం కల్తీల మయం.. డబ్బులు పోవటం మాట అటుంచితే మోసపోయామనే మానసిక కృంగుబాటును వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. జరిగిన నష్టంతో కృంగిపోకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులు- విధుల గురించి తెలుసుకుని ఆచరిస్తే జరిగిన నష్టానికి పరిహారం అందుకోవొచ్చు. దీనిపై విజయవాడ విద్యాధరపురంలోని దళవాయి సుబ్బరాయ నగర పాలకసంస్థ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన వీడియోలు ప్రజానీకాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


ప్రతిరోజూ ప్రతిఒక్కరూ టూత్‌ పేస్టు నుంచి ఇంట్లో సామాన్లు,నూనెలు, పప్పులు, కూరగాయలు, బిస్కెట్లు, తినే పదార్థాలు వంటివి కొనుగోలు చేస్తుంటారు. మందులు, పెట్రో ఉత్పత్తులు ఇలా ఏ వస్తువు కొన్నా దాని ముగింపు తేదీని చూసుకోవాల్సివుంది. వస్తువు కల్తీ, నకిలీయా అనేది కూడా ధృవీకరించుకోవాలి. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర ప్రమాణం వంటి వాటికి సంబంధించి సమాచారం ఉన్నాయో లేదా పరిశీలించాలని దళవాయి సుబ్బరాయ నగర పాలకసంస్థ పాఠశాల విద్యార్థులు సూచిస్తున్నారు. వారు చేసిన వీడియోల సారాంశం ఈ కింది విధంగా ఉంది. చట్టాలపై సరైన అవగాహన లేకపోవటం, మాకెందుకులే అని సున్నితంగా తిరస్కరించటం వంటి కారణాలతో వదలేస్తే ఆ జాడ్యం సమాజ వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. హక్కులను గుర్తిస్తేనే రక్షణ పొందొచ్చు. 'వినియోగదారుడా' మేలుకో అంటూ పిలుపునిచ్చారు.

011

                                                               క్లబ్‌లతో వినియోగదారులకు అవగాహన

వినియోగదారుల హక్కుల చట్టాలకు సంబంధించి 13 అంశాలపై అవగాహన, విశ్లేషణలకు పాఠశాలలో రెండు క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. సిబ్బంది ద్వారా ఏర్పాటైన క్లబ్‌కు అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు ఎం.కోటయ్య, ఉపాధ్యక్షులుగా వి.రాజ్యలక్ష్మి, కార్యదర్శిగా జె.భానుప్రకాష్‌, కోశాధికారిగా సిహెచ్‌విఎస్‌వి ప్రసాద్‌, సభ్యులుగా కె.శివపార్వతి, కె.నాగరాజు, సిహెచ్‌ వసంతలక్ష్మి, ఎం.కమలకుమారి, కె.సుమలత ఉన్నారు. విద్యార్థుల క్లబ్‌కు అధ్యక్షులుగా కె.సుమంత్‌ (9వ తరగతి), కార్యదర్శిగా పి.పావని దుర్గ (8వ తరగతి), ప్రధానోపాధ్యాయులు ఎం.కోటయ్య, టీచర్‌ గైడ్‌గా పులిపాటి దుర్గారావు వ్యవహరిస్తున్నారు. 8, 9 తరగతులు చదివేవారిలో మొత్తం 100 మంది విద్యార్థులు క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు. తెలుగు ఉపాధ్యాయులు ఆర్‌బి ఉదరు కిరణ్‌ సాంకేతిక సహకారం అందించారు. 13 రకాల చట్టాలు-అంశాలపై ఒక్కొక్క విద్యార్థి సమగ్రంగా అధ్యయనం చేయటం, వీడియో ద్వారా తెలియజెప్పేలా తర్ఫీదును ఇచ్చారు. తద్వారా ఈ వీడియోలు నేడు సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల హక్కులను కాపాడే కృషిలో ఉపయోగపడుతున్నాయి.
                                                                        - యడవల్లి శ్రీనివాసరావు

 

kotaiah

                                                               భావి తరాలకు ఆదర్శం కావాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యార్థి దశ నుంచే వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించటం కోసం కన్స్యూమర్‌ క్లబ్‌లను ఏర్పాటుచేశాం. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐఐపిఎ) తరపున ఈనెల ఆరోతేదీన మా పాఠశాలకు వచ్చిన ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ సురేష్‌మిశ్రా వినియోగదారుల పరిరక్షణ చట్టం గురించి మా విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అధికారి పివివి సత్యనారాయణ, ఎన్టీఆర్‌ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి జి.మోహనబాబు, సహాయ పౌరసరఫరాల అధికారి (సర్కిల్‌-1) శ్రీలక్ష్మి, సర్కిల్‌-2 పి.ధనుంజయరెడ్డి, సివిల్‌ సఫ్లయిస్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకట్‌, శివ, శ్రీను అభినందించారు.
                        - మాతంగి కోటయ్య, ప్రధానోపాధ్యాయులు

 

022

                                                                  విద్యార్థుల్లో సరికొత్త నైపుణ్యం

సమాజంలోని అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మావంతుగా ఆ కృషి జరుగుతోంది. మొత్తం 13 అంశాలపై అవగాహన, చట్టాలపై సమగ్ర విషయ పరిజ్ఞానం పిల్లలకు తెలియజేశాం. వారి ఎంతో చక్కగా చెబుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు వస్తు సేవల వినియోగం, రక్షణ పద్ధతుల గురించి తెలియజేస్తే వారు ఆచరణలో పాటిస్తున్నారు. ఆధార్‌, బ్యాంక్‌ ఓటీపీలు చెప్పమని వస్తున్న ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌కు ఖాతాల్లోని బ్యాలెన్స్‌లు ఖాళీ అవుతున్నాయి. ఆన్‌లైన్‌ ఆర్డర్లలోనూ, పార్శిళ్లలోనూ కూడా మోసాలు జరగకుండా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు.
                 -పులిపాటి దుర్గారావు, క్లబ్‌ గైడ్‌ టీచర్‌

 

033

                                                               హక్కులు తెలుసుకోవటం బాధ్యతే

మా క్లబ్‌లో దాదాపుగా 100 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. రాజ్యాంగపరమైన హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టాలకు సంబంధించిన వాటిపై సమగ్రమైన సమాచారంతో వీడియోలు చేశాం. మా సందేశం చూసి కొందరైనా తెలుసుకుని అవినీతి నిరోధానికి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడతారని ఆశిస్తున్నాం.
                             వెన్నా జయశ్రీ, 9వ తరగతి

 

044

                                                                  తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం

ఏది కొనుగోలు చేసినా బిల్లులు పొందటం ప్రాథమిక హక్కుగా భావించాలి. తద్వారానే గ్యారంటీ, వారెంటీల గురించి తెలుస్తుంది. గడువు ముగిసిన వస్తువులను అంటగడితే నష్టపరిహారం పొందటంతోపాటుగా పంపిణీ చేసిన కంపెనీలకు జరిమానాలను సైతం వినియోగదారుల ఫోరంలు విధిస్తాయి. అందరం వినియోగదారులమే. మా తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం.
                                                                                               కె.సుమంత్‌, 9వ తరగతి

 

055

                                                                    ఫోరంను ఆశ్రయిస్తే న్యాయం

ఏ రకంగా మోసపోయినా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయొచ్చు. ఆయా స్థాయిల్లో ధృవీకరణలు జరిగాక మోసం నిజమైనదైతే బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలను ఫోరం తీసుకుంటుంది.
                                                           - జి.పవిత్ర, 9వ తరగతి విద్యార్థిని