అధికారం అంధకారమైనప్పుడు
అసమానతలు అగుపించవు కదా?
అక్షర కిరీటాన్ని తగిలించుకుని
కంచికి చేరని కథలు గుర్తించు !!
ఎవ్వడి నోటి ముద్ద ఎక్కడికి పోయిందో
వాడి గుండె చప్పుడు కంటి కెపుడు చేరిందో
మానవతా పూతోట ఆక్రమించిన కలుపు బలుపు
పీకి పంట ప్రాణ ప్రతిష్ట అభ్యుదయం పూయాలి
అక్షరాలకు అటూ ఇటూ చూస్తూ సమస్యలు
పట్టించుకోక పరిష్కారం ఎలా కాపు కాస్తుంది?
విధ్వంస విషాదాన్ని ఆనందంగా నటిస్తూన్న
ప్రభావాన్ని చెయ్యెత్తి చూపే పర్యాయపదం
నువ్వే!! ముమ్మాటికీ నిజం నువ్వే !!
నీ కనుల ముందర అవకరాలన్నీ చెరిపేసే
భరోసా వాఖ్యల్ని కవన శిఖరం ఎక్కి లిఖించు!
దేశం ఇంటి నిండా గుచ్చు తుప్పుపట్టిన ముప్పు
ఇనుపముక్కల్ని సూదంటు రాయివై ఆకట్టు
విరామమెరుగక పరిశ్రమించినా మనం
ప్రపంచీకరణలో చరమగీతాలవుతున్నాం
ఉద్యోగాలన్నీ వుఫ్ అంటూ గాల్లో కెగిరే
ప్రైవేటీకరణ సమిధలవుతున్నాం!!
'నీ అంతరంగం' ఎంత అంగరంగ అద్దంలావున్నా
గాయపడిన గాజుముక్కలైతే అతికించలేము !!
కానీ పూనుకుంటే మరో ఉక్కుపల్లకీ నిర్మించి
దేశప్రజల్ని అందులో నిలబెట్టగలం!!
భూమిపై ఆకుపచ్చ వసంతధ్యేయం
అభ్యుదయమని సంభావిస్తేనే నేడు
పదవీవిరమణ చేసినవారు రేపటి కార్మికులకు
భద్రంగా అందించే భవిత! భవితకు భరోసా !!
ఎల్. రాజా గణేష్
92474 83700