Apr 02,2023 07:55

ఇరుకిరుకు దారుల్లో బతుకీడుస్తూ
అంధకార బంధురాన బాధలు మోస్తూ
ధర ఒరల సుడిలో ప్రజ మునిగిపోతుంటే
దగాకోరు తోడేళ్లకు ఇష్టమైన ఆహారమైంది
ఈ నాటి ప్రజాస్వామ్యం!!
బోయీల్ని భద్రపరిచే దశలో పచ్చనోట్లు
పలావ్‌ పాకెట్‌.. మందు బాటిల్స్‌కు
లొంగే రోజువారీ కూలీలుగా కుదిరే
నిరుపేద వారే చప్పట్లు కొడుతూ
జేజేలు పలుకుతూ నాయకుల్ని
భుజ పల్లకీలపై మోస్తున్నారు !!
మెత్తని రబ్బరు సుత్తి లయ నాయకులది !!
శృతి కాని బుర్రకథ మన జనాలది !!
అనునిత్యం జరిగే అవినీతి కథలతో
శీలం కోల్పోయిన సత్యం సాక్షిగా
తేనె కుండలలో ఈదులాడే ఈగలకు
తియ్య తియ్యనా?? ప్రాణం ఖతమా ??
నువ్వూ నేను ఎవరికివారు వేరు వేరుగా
వున్నన్నాళ్లూ విడిపోని దుఃఖం
పడి పడి మరీ మరీ నవ్వుతుంది
సంతోషం విలవిల వలవలా ఏడుస్తోంది
మనల్ని నిద్రపుచ్చే వారిని గుర్తించి
నిద్ర నుండి మేల్కొని చూడగలిగితేనే
సూర్యుడు ఎర్రెర్రని కుంచెతో దినాన్ని దివ్యంగా
చిత్రీకరిస్తూ మన భవిత సంకేతమ్‌ అనిపిస్తాడు
స్వేదపు సెగలుకక్కే ఆవిరి యంత్రాల్లాగా
బుర్రలో గుజ్జులేని ఆలోచనలతో ఉంటే
చేతిలో తాళాలు లేక తలుపులు తెరుచుకోవు
జనసంద్రం గట్టు చేర్చే వంతెన ఎందుకు??
మారుతున్నది పాత్రధారులే
కానీ ఈ వింతనాటకం పాతదే కదూ ??
ముగింపు మారాలంటే
ఈ దొంగల చేతితాళాలు అక్కర్లేదులే!
బద్దలుకొట్టి తీరాలి !!
అంతరంగం అంగరంగంగా పదునుకొచ్చే
ఆలోచనలు పుట్టకపోతే మనిషి మనిషా ?
ఆవేదనలకు విముక్తి కలిగించేదే బతుకులో
పరిణామక్రమం !!సమసమాజ పురోగమం!!

ఎల్‌.రాజా గణేష్‌
92474 83700