Jul 30,2023 09:27

'ఏమండీ! వదిన గారు ఫోన్‌ చేస్తున్నారు.. వెళ్లి రానా?' హ్యాండ్‌ బ్యాగ్‌ చేతికి తగిలించుకుంటూ కొంటెగా చూస్తూ అడిగింది వనజ.
'వెళ్లి రా!' తలెత్తకుండా సోఫాలో కూర్చుని సండే మ్యాగజైన్‌ తిరగేస్తూ దర్జాగా చెప్పాడు గోవిందం.
'చంటాడి గురించి తెలుసుగా?'
ముందుకు వెళ్ల బోతూ గుమ్మం వద్ద ఆగి, గోవిందం కేసి చూస్తూ అంది.
'ఐదేళ్లు కూడా నిండని చంటాడిని చూసుకోవడం పెద్ద గొప్పా? ఆఫీసులో అరడజనుకు పైగా స్టాఫ్‌ నా కింద పనిచేస్తున్నారు. వాళ్లనే మేనేజ్‌ చేసే నాకు, చంటాడొక లెక్కా?' అన్నాడు నిర్లక్ష్యంగా పేపర్‌ను సగానికి మడత పెడుతూ..
'పిల్లలూ,పెద్దవాళ్ళూ ఒక్కటేనా?'
'నా దృష్టిలో ఒక్కటేనోరు'
'చాదస్తం అనుకోకండి. చంటాడు లేవగానే పాలు అంటాడు. సీసాలో పోసి వెంటనే పట్టాలి. పటికబెల్లం పౌడర్‌ వేస్తేనే తాగుతాడు. తేడా వస్తే ఆరునొక్క రాగం అందుకుంటాడు. వాడికి గుక్క సమస్య ఉంది తెలుసుగా?' గుర్తు చేస్తూ అంది.
'హేరు! నీకు నిద్రలో ''గురక'' వస్తుంది. అది సమస్య అంటే ఊరుకుంటావా?' అన్నాడు వెటకారంగా.
'ఒకటో తరగతి పిల్లాడికి పాఠం చెప్పినట్లు పదే పదే చెప్పకు. అవతల నా మేనకోడలి పెళ్లికి కొత్త బట్టలు తీయడం కోసం అక్క షాపులోకి ఈ పాటికి వెళ్లిపోయుంటుంది. వెళ్ళు! వెళ్ళవమ్మా! వెళ్ళు!' జయం సినిమాలో సదా చెప్పినట్లు చెప్పాడు.
'సరే అయితే' అంది.
'వీధి తలుపు దగ్గరగా వేసి వెళ్ళు' అన్నాడు చదువుతున్న పేపర్‌లో లీనమవుతూ.
సోఫా ముందున్న టీపారు మీద తన రెండు కాళ్ళూ జాపుకున్నాడు.
ఈ రోజు పంచాంగంలో తన రాశి ఫలితాన్ని చూసుకుంటున్నాడు.
''మకరరాశి.. ఈ రోజు మీకు భేషుగ్గా ఉంది. స్త్రీలతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీ జీవితంలో కొత్త అనుభవాలని చవిచూస్తారు!'' అని వుంది. కొత్త అనుభవాలు మాట బాగా నచ్చేసింది సుందరానికి. 'అది ఏమై ఉంటుందబ్బా?' అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు.
'ఆహా!ఇది కదా హ్యాపీ అంటే. సండే సెలవొస్తే సరిపోతుందా? ఒంటరిగా ఉండే ఛాన్స్‌ కూడా రావాలి కదా! తుంటరి ఆలోచనలను అమలు చేసే సమయం కుదరాలి. పేపర్‌ గంటల కొద్దీ ముందు వేసుకుని కూర్చున్నా, లేవమనే వాళ్లుండరు. ఫోన్‌లో ఛాటింగ్‌ ఎంతసేపు చేసినా వద్దనే వారుండరు. గోవిందం! ఇప్పుడు నీకు టైం వచ్చిందిరా, ఎంజారు యువర్‌ సెల్ఫ్‌' అనుకుంటూ భుజాలెగరేశాడు.
వాట్సాప్‌ మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నాడు.
స్టేటస్‌లకు ఎమోజీలు పోస్ట్‌ చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌ మెసేజ్‌లకు లైక్‌ కొడుతూ షేర్‌ చేస్తున్నాడు.
'హమ్మయ్యా.. ఇదీ అసలైన ఆదివారం' అనుకునేలోగా..
'అమ్మా' అన్న చంటాడి అరుపులాంటి పిలుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
గబగబా గదిలోకి వెళ్ళాడు.
'అమ్మ కాదురా, ''నాన్నా.. నాన్నా'' అని అరవాలి. అదే... పిలవాలి' అంటూ వాడిని జోకొట్టసాగాడు.
గోవిందం చేతిని బంతిని విసిరినట్టుగా తీసేస్తూ.. 'అమ్మ కావాలి.. నాకు అమ్మే కావాలి!' అన్నాడు చంటాడు కోపంగా.
'చంటీ!ఈ రోజు సండే రా! రోజూ అమ్మ ముక్కు రాస్తూ సీసాలో పాలు తాగుతావు కదా, ఈ రోజు నా ముక్కు రాస్తూ తాగు నాన్నా! ఒకే నా!' అంటూ థమ్సప్‌ సింబల్‌గా బొటన వేలు చూపిస్తూ నవ్వుతూ వాడి పక్కన పడుకోబోయాడు గోవిందం.
అంతే... ఆ మాట వినగానే చంటాడు వాడి రెండు కాళ్లు గాల్లోకి ఎత్తి పరుపు మీద గట్టిగా కొట్టాడు. పక్కనే ఉన్న పాలసీసాను నేల మీదకు బలంగా విసిరాడు. 'నాకు అమ్మే కావాలి!' అంటూ మళ్ళీ ఏడుపు అందుకున్నాడు.
'అమ్మ వద్దంటే ఒప్పుకోవు. మంచం పై నుండి దిగవు. అస్తమానూ అమ్మేనా? అప్పుడప్పుడు నాన్న చంకనెక్కాలి. మీసం పట్టుకు లాగాలి. నిన్న కాక మొన్న మొన్న బొడ్డు ఊడిన నీకే అంత కోపం ఉంటే.. ఎప్పట్నుంచో గెడ్డం పెంచుకుంటున్న నాకెంత కోపం ఉండాలి?' అంటూ కళ్లెర్ర చేశాడు.
ఈ కళ్లెరుపును వాడు కేర్‌ చేసేటట్లు లేడు. వాడికొచ్చిన అరునొక్క రాగాన్ని మరింత పెంచాడు.
గోవిందం చెవులు చిల్లుపడేలా, పైన స్లాబు పెచ్చులూడి పడిపోయేలా, వాడి రాగం శతి మించింది.
గోవిందానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
పాలసీసాలో పాలు నేల పాలయ్యాయి. అపార్ట్మెంట్‌లో వాళ్లంతా వచ్చి తలుపులు బాదేటట్లున్నారు. వాడి ఏడుపు వింటే చంటాడని తానేదో చితక బాదేస్తున్నాననుకుని వాళ్లంతా గొడవ చేసేటట్లున్నారు.
'బుద్ధి తక్కువై కోపం చూపించాను. ఏడుపు ఆపరా.. పాలు మళ్ళీ తెస్తాను.. తాగరా' అన్నాడు బతిమాలుతూ.
చంటాడు అడ్డంగా తల ఊపాడు. రాగం పెంచాడు. గుక్క పెట్టాడు.
గోవిందంలో ఒక్కటే టెన్షన్‌.
గతంలో చిల్డ్రన్‌ స్పెషలిస్ట్‌ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
'మీ చంటాడి గుక్క ఆపడానికి మందు లేదు. మీరే వాడిని కవ్వించకుండా నవ్వించాలి. వాడు చెప్పినట్టు చేస్తూ ఏడవకుండా చూసుకోవాలి. గుక్క రానీయద్దు. మురిపెమే ముద్దు. కావాలంటే మీరు ఏడవండి. వాడిని మాత్రం నవ్వించండి!'
అక్కడి వరకూ గుర్తుంది. కానీ, గుక్క పెట్టి వాడు స్తంభించిపోతే ఏం చేయాలో సమయానికి గోవిందానికి గుర్తుకు రావడం లేదు. కోర్టులో సెక్షన్లు గుర్తుకు రాని చెట్టుకింద ప్లీడరులా ఉంది పరిస్థితి.
కాలు గాలిన పిల్లిలా ఏమి చేయాలో పాలుపోక 'పాల సీసా' కోసం మంచానికి అటూ ఇటూ తల పట్టుకుని, కళ్ళు మూసుకుని తిరుగుతున్నాడు.
అప్పటికే వాడు గుక్క ఆపేయడం, వనజ వచ్చి వాడి నడ్డి మీద గట్టిగా గిల్లడం ఒకేసారి జరిగాయి.
గోవిందం ఏ చలనం లేకుండా చూస్తున్నాడు.
చంటాడు మాత్రం చలించాడు.
తిరిగి ఏడుపు అందుకున్నాడు.
వనజ ముక్కు రాస్తూ, మొహం కేసి చూస్తూ పాలు తాగాడు. తిరిగి హాయిగా నిద్ర పోయాడు.
'హమ్మయ్య! సమయానికి దేవతలా వచ్చావ్‌!' అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
'మీ దృష్టిలో నేను దెయ్యాన్ని కదా! ఇప్పుడు సడన్‌ గా దేవతనై పోయానా?' మూతి ముడుస్తూ అంది.
'అయినా ఎక్కడో దారిలో ఉన్న నీకు చంటాడి ఏడుపు ఎలా వినిపించిందే? సినిమాలో చూపిస్తాడు కదా! నిజమేనే?' మాట మారుస్తూ వనజ కేసి ప్రేమగా చూస్తూ అన్నాడు.
'నే వెళ్తే కదా రావడానికి. నేను వాష్‌రూమ్‌కి వెళ్లొచ్చేటప్పటికి చంటాడి పక్కన మీరు సర్కస్‌ ఫీట్లన్నీ చేస్తున్నారు' అంది వనజ నవ్వుతూ.
'ఎందుకు వెళ్ళలేదు?' వనజ కేసి విచిత్రంగా చూస్తూ అడిగాడు.
'వదిన గారు షాపింగ్‌కి సాయంత్రం రమ్మన్నారు!'
'మరి ఉదయం అని చెప్పావే?' అర్థంగాక అడిగాడు.
'నిన్న సాయంత్రం చంటాడిని మీరు ఎత్తుకుంటే ఏడ్చాడు. నా దగ్గరకు రాగానే నవ్వాడు. అప్పుడు నేను పిల్లలను పెంచడం ఒక ఆర్ట్‌ అనంటే మీరు ఒప్పుకోలేదు. ''అదే మైనా పెద్ద గొప్పా? వీధిలో కుక్క కూడా పిల్లలను పెంచు తుంది!'' అంటూ వెక్కిరించారుగా. మగాడిగా ఉద్యోగం చేయడమే పెద్ద గొప్ప అన్నారుగా. మీ గొప్పతనం చూద్దామని ఇలా చేశాను.' నవ్వుతూ అంది.
'సరదాగా సవాలక్ష అంటాం. అవన్నీ నిజాలు కావే' తప్పదనుకుంటూ చెప్పాడు.
'సీరియస్‌గా ఉన్న సీరియల్స్‌నే చూస్తాను. సరదా నాకు పడదు' సీరియస్‌గా అంది.
'గుక్క పెట్టినప్పుడు నడ్డి మీద గిల్లాలన్న సంగతి మరిచాను. లేకపోతే వాణ్ణి నేనే ఊరుకోబెట్టే వాణ్ణి' మీసం మెలేశాడు తగ్గేదెలే.. అన్నట్లు అభినయిస్తూ.
'మీ సరదా నేనెందుకు కాదనాలి? సాయంత్రం షాపింగ్‌కు నేనే వెడతాను. చంటాడిని మీరు చూసుకోండి' రెట్టించిన ఉత్సాహంతో అంది.
'ఆ' అంటూ గోవిందం మళ్లీ తలపట్టుకున్నాడు.
'ఏమిటీ ఆ ఫోజ్‌? అవాక్కయ్యారా?' అంది వనజ తలమీద మొట్టుతూ..

కె.వి. లక్ష్మణరావు
9014659041