Apr 30,2023 08:06

ఆవకాయకీ, వేసవి కాలానికీ ఎంత అవినాభావ సంబంధముందో మనందరికీ తెలిసిందే. ఎంత టెక్నాలజీ పెరిగినా, స్పీడ్‌ యుగమని చెప్పుకుంటున్నా వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే సంవత్సరమంతా చెక్కు చెదరకుండా నిలువ ఉంటాయి. వాడే పదార్థాలు, చేసే పని శుభ్రంగా ఉండాల్సిందే మరి. ఏమాత్రం తడి తగిలిగా, పరిశుభ్రత పాటించకపోయినా పచ్చళ్లు పాడైపోతాయి. అంతే కాదు.. ఈ పచ్చళ్ళలో కల్లుప్పుని వాడటమే మంచిది. దానికే ప్రాధాన్యం ఉంది. అందుకని తీరిక లేదనుకోక కొంచెం శ్రద్ధ వహించి పద్ధతిగా చేస్తే.. 'ఆహా! ఏమి రుచి' అనవచ్చు సంవత్సరమంతా.

  • ములక్కాయలతో..
1

కావలసినవి: మామిడికాయలు - 2, ములక్కాయలు - 2, ఆవపొడి-50 గ్రా., మెంతి పొడి-2స్పూన్లు, కారం-100గ్రా., ఉప్పు - 100గ్రా, వెల్లుల్లి రెబ్బలు - 20, నువ్వుల నూనె - 1/2 కేజీ
తయారీ : మామిడికాయలు, ములక్కాయలు శుభ్రంగా కడిగి, తుడిచి ఆరనివ్వాలి. అంగుళం సైజు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక బేసిన్‌లో ముక్కలు, నూనె, పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలిసేలా కలపాలి. దీనిని ఒక జాడీలో పెట్టుకుంటే సంవత్సరమంతా నిలువ ఉంటుంది. ఇదే వెరైటీ మామిడి, ములక్కాడల ఆవకాయ పచ్చడి.

  • గుత్తి ఆవ..
2

కావలసినవి : మామిడికాయలు - 6, ఆవపిండి - 1/4 కేజీ, మెంతిపిండి - 2 స్పూన్లు, కారం -1/4 కేజీ , ఉప్పు - 1/4 కేజీ, పసుపు - స్పూను, ఇంగువ - 1/2 స్పూను, నువ్వుల నూనె - 1/4 కేజీ
తయారీ : ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి, పొడిగుడ్డతో తుడిచి పక్కనుంచాలి. పైన చెప్పిన పొడులు, ఉప్పు, కారం అన్నింటినీ స్టఫ్‌ చేసేందుకు వీలుగా నూనెతో కలపాలి. కాయ తొడిమవైపు నుంచి ప్లస్‌ ఆకారంలో కాయ మూడోవంతు వరకూ కట్‌ చేయాలి. లోపలి జీడిని తీసివేసి, టెంకె భాగాన్ని పొడిగుడ్డతో తుడవాలి. కాయ మధ్యలో ఈ మిశ్రమాన్ని ఉంచి ఒక వెడల్పు ప్లాస్టిక్‌ గిన్నెలో ఉంచాలి. రెండో రోజుకు రసం ఊరుతుంది. ఆ రసం అంతా ఇగిరిపోయే వరకూ ఎండలో పెట్టాలి. తరువాత జాడీలో భద్రపరచుకోవాలి. అంతే నోరూరించే గుత్తిమామిడి ఆవకాయ రెడీ.

  • మాగాయ..
3

కావలసినవి : మామిడికాయ ముక్కలు - 4 గ్లాసులు, ఉప్పు - 1/2 గ్లాసు, కారం - 1/2 గ్లాసు, మెంతిపొడి - 2 స్పూన్లు, పసుపు - స్పూను, నువ్వుల నూనె - 3/4 గ్లాసు
తాలింపుకు : ఆవాలు - 2 స్పూన్లు, ఎండుమిర్చి - 4, కరివేపాకు - 2 రెబ్బలు
తయారీ : మామిడికాయలు పెచ్చు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. టెంకెలు ఇష్టమైన వాళ్లు వాటితో సహా ముక్కలను ఒక బేసిన్‌లో తీసుకోవాలి. దానికి ఉప్పు, పసుపు బాగా పట్టించి రెండు రోజులు గాజు లేదా ప్లాస్టిక్‌ డబ్బాలో ఊరనివ్వాలి. మధ్యలో ముక్కలను ఒకసారి కలపాలి. ఊరిన రసాన్ని రెండు గంటలు, ముక్కలను రోజంతా విడివిడిగా ఎండబెట్టాలి. ఒక బేసిన్‌లో ముక్కలు, రసం, కారం, మెంతిపొడి వేసి, బాగా కలపాలి.
బాండీలో నూనె వేడిచేసి తాలింపు పెట్టి, ఆరిన తరువాత పచ్చడిలో వేసి బాగా కలపాలి. అలా రెడీ అయిన పచ్చడిని జాడీలో పెట్టుకుని వాడుకోవచ్చు. అంతే మాగాయ పచ్చడి రెడీ అయినట్లే.

  • బెల్లంతో..
3

కావలసినవి : మామిడికాయలు - 6, బెల్లం - 1/4 కేజీ, కారం -1/4 కేజీ , ఉప్పు - 200 గ్రా., పసుపు - స్పూను, నువ్వుల నూనె - 1/4 కేజీ
తయారీ : మామిడికాయలను జీడి తీసి ముక్కలు కోసుకోవాలి. ఒక బేసిన్‌లో కారం, ఉప్పు, పసుపు, బెల్లం వేసి 50 గ్రా. ల నూనెతో బాగా కలపాలి. దీనిలో మామిడిముక్కలు వేసి కలిపి, రెండురోజులు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగి జూసీగా జామ్‌లా వస్తుంది. దీనిని జాడీలో భద్ర పరచుకొని సంవత్సరమంతా నిలువ పెట్టుకోవచ్చు. అంతే చాలా రుచిగా ఉండే బెల్లం ఆవకాయ రెడీ. ఇది టిఫిన్స్‌లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

  • పులిహోర ఆవ..
5

కావలసినవి : మామిడికాయలు - 3, ఆవపిండి - 150 గ్రా., వెల్లుల్లిరెబ్బలు - 10, మెంతిపిండి - 2 స్పూన్లు, కారం -1/4 కేజీ, ఉప్పు - 200గ్రా., పసుపు - స్పూను, ఇంగువ - 1/2 స్పూను, నువ్వులనూనె - 1/2 కేజీ
తాలింపుకు : ఎండుమిర్చి - 4, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు - స్పూను చొప్పున
తయారీ : ఒక బేసిన్‌లో చిన్నగా కట్‌చేసుకున్న మామిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపొడి, పసుపు అన్నింటినీ వేసి, బాగా కలుపుకోవాలి. ఒక బాండీలో 50 గ్రా. నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసి బాగా వేగిన తరువాత, చల్లార్చి, మామిడిముక్కల మిశ్రమానికి కలపాలి. మిగిలిన నూనెను కూడా కలుపుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పులిహోర మామిడి ఆవకాయ రెడీ. దీనిని శుభ్రమైన, పొడిగా ఉన్న జాడీలో నిలువపెట్టుకోవాలి.