
గెలవాలనుకోవడం తప్పుకాదు, ఎలాగైనా గెలవాలనుకోవడమే అసలు తప్పు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అధికార వైసిపి 'ఎలాగైనా' అన్నీ గెలవాలనుకుంటోంది. గత ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజా విశ్వాసాన్ని పొందడం ద్వారా గెలవొచ్చు. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక అక్రమ మార్గాల ద్వారా గెలవాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఇచ్చిన హామీల్లో 98.2 శాతం అమలు చేశామంటున్న వైసిపి నేతలు కేవలం ఐదు స్థానాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇంతగా ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఓటర్ల చేర్పింపు దగ్గర నుండి ఇప్పటి వరకు వరుసగా అనేక అక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నారు? అధికార యంత్రాగాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం, ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ధిక్కరించడం, చివరికి ముఖ్యమంత్రే నేరుగా తమ పార్టీ ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సి, నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశం జరిపి ఎమ్మెల్సీ స్థానాలన్నీ గెలిచి తీరాల్సిందేనని ఎందుకు ఆజ్ఞాపించారు.? అధికార పార్టీ ...పట్టభద్రులకు, గురువులకు భయపడుతుందా? నిష్పక్షపాతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే తమ పాలనా వైఫల్యాలు బహిర్గతమవుతాయని భయమా?
అధికార పార్టీ అక్రమాలు
అధికార పార్టీ నేతలు ఓటర్ల చేర్పింపు దగ్గర నుండి అక్రమాల వరద పారిస్తున్నారు. ఓట్ల నమోదు ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. అయితే అన్ని స్థానాల్లోనూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్ల వాలంటీర్లు ఇల్లిల్లు తిరిగి అప్లికేషన్ ఇవ్వడం, సర్టిఫికెట్లను సేకరించడం, గజిటెడ్ అధికారి సంతకాలు లేకుండానే సచివాలయాల్లో అప్‌లోడ్ చేయడం లాంటి వాటిని చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది మూడు సంవత్సరాల సర్వీసు, మరియు ఆరు సంవత్సరాల పిఎఫ్ చెల్లింపు వుండాలని ఎన్నికల సంఘం నిబంధనలున్నాయి. వీటిని ఉల్లఘించి అధికార పార్టీ వారికి చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారీ సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్పించారు. డిఇఓల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. రాత్రికి రాత్రే భారీగా ఓట్లు నమోదయ్యాయి. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్‌కు సంబంధించి నవంబర్ 5 నాటికి 1,98,695 ఓట్లు నమోదు కాగా, 7వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు 2,81,301, రాత్రి 12 గంటలకు 4,17,244 ఓట్లు నమోదయ్యాయి. అలాగే ఇదే స్థానంలో టీచర్ ఎమ్మెల్సీకి 5వ తేదీ నాటికి 12,815 నమోదు కాగా, 7వ తేదీ సాయంత్రం నాటికి 16,366, రాత్రి 12 గంటలకు 26,403 ఓట్లు నమోదు అయ్యాయి. పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు కావడం వెనుక ఖచ్చితంగా పాలక వర్గ పార్టీల నేతలదే కీలక పాత్ర.
ఓటర్ల నమోదులో పెద్ద సంఖ్యలో అక్రమాలు జరిగినట్లు లెక్కలు స్పష్టంగా చెబుతున్నా పాలకులకు ఈ నమోదు సంతృప్తినివ్వలేదు. విచ్చలవిడి అక్రమాలను అంగీకరించని అధికారులను బదిలీ చేశారు. ఒకవైపు నవంబరు 7వరకు ఓటర్ల నమోదు జరుగుతున్న సమయంలోనే నవంబర్ 3వ తేదీ ఆకస్మికంగా నెల్లూరు, అనంతపురం డిఇవోలను బదిలీ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రికార్డులు డిఇవోల దగ్గరే వుంటాయి. వీరే ఆయా సర్వీసు సర్టిఫికేట్లను ధృవీకరించాల్సి ఉంది. రాయలసీమ జిల్లాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌ను ఇలాగే బదిలీ చేశారు. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 13 'ఓటర్ల నమోదుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతున్నప్పుడు దానితో సంబంధం ఉన్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయరాదు' అని స్పష్టంగా చెపుతోంది. కానీ రాష్ట్రంలో ఈ చట్టం తుంగలో తొక్కబడింది. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు దేశ, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసినా దిక్కులేదు.
అధికార యంత్రాగం దుర్వినియోగం
కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార పార్టీ టీచర్ ఎమ్మెల్సీ భర్త రాష్ట్రస్థాయి విద్యాశాఖాధికారి. ఆయనను ఎన్నికలు జరుగుతున్న రాయలసీమ జిల్లాలకు తీసుకురావడం కోసం అక్కడున్న ఆర్‌జెడిని బదిలీచేశారు. ఇన్‌ఛార్జీ ఆర్‌జెడి ప్రతాపరెడ్డి ఇక్కడికి రావడమే రాజకీయ లక్ష్యంతో వచ్చారు. ఒక వైపు టీచర్ స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీచర్లు ప్రచారం చేయకూడదని ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మరో వైపు ఆర్‌జెడి హోదాలో ప్రతాపరెడ్డి ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పాఠశాలల హెడ్‌మాస్టర్స్, కస్తూరిబా స్కూల్ ఎఓ లు, జిల్లా విద్యాధికారులతో విద్యా సమీక్షల పేరిట పగలు, రాత్రి రాజకీయ నాయకులకంటే బరితెగించి ప్రచారం చేశాడు. అనంతపురంలో రాత్రి ఓ స్వచ్ఛందసంస్థ గెస్ట్‌హౌస్‌లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ స్కూల్స్ టీచర్లతో జరిగిన పార్టీలో పాల్గొన్నారు. దీన్ని అడ్డుకున్న వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై పోలీసులు..హత్యాయత్నం కేసు పెట్టారు. అంతా అయిన తరువాత... అన్నట్లు ప్రతాపరెడ్డి హెడ్‌క్వార్టర్ వదలి వెళ్లరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆంధ్ర యూనివర్శిటీ వి.సి ఏకంగా అధికార పార్టీ నాయకులతో కలిసి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, అధ్యాపకులను అదిరించి, బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రజాసంఘాల కార్యకర్తలను చూసి వి.సి, రిజిస్ట్రార్ దొడ్డిదారిన జారుకున్నారు. ఉపాధ్యాయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే సస్పెన్షన్ తో పాటు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అన్నమయ్య జిల్లా విద్యాధికారి సర్క్యులర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం జరిగిందనే సాకుతో ఒక పాఠశాలలోని 17 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులిచ్చారు. కరపత్రం పంచినందుకే కాదు, తీసుకున్నందుకు కూడా టీచర్లను సస్పెండ్ చేస్తామంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి నేరుగా తన నియోజకవర్గంలోని కంబదూరు పాఠశాలలో తమ పార్టీ అభ్యర్థికి మద్ధతుగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో చాలామంది ఎంఎల్‌ఏలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందిని పిలిపించుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఫిబ్రవరి 9 నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో వుంది. అయినా గత నెల 24, 25 తేదీల్లో 'సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం' పేరుతో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో కలిసి ఇంటింటికీి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించింది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ (పి.ఒ.సి) పేరుతో ఒక్కో పోలింగ్‌బూత్‌కు 10మంది చొప్పున వైసిపి కార్యకర్తలను నియమించి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, పోలింగ్ రోజున తమ పార్టీ కార్యకర్తల ద్వారా అక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం మౌనంగా వుండడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం.
ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత
ఉద్యోగ, కార్మిక, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన వైసిపి ఇంత త్వరగా ఆయా వర్గాలనుండి ఎందుకు దూరమైందో, అందుకు మూలమైన కారణాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ చర్యలు లేవు. అధికార దర్పాన్ని ఉపయోగించి నిరసన నోళ్లు మూపిద్దామని, అధికార బలప్రయోగంతో ఎన్నికల్లో గెలుద్దామని ప్రభుత్వ నేతలు భావిస్తున్నారు. ఉద్యోగులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పిఆర్‌సి ఇస్తామని, సిపిఎస్ ..వారంరోజుల్లోనే రద్దు చేస్తామని, సకాలంలో డి.ఎ ఇస్తామని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నూతన ఉద్యోగాలు ఇస్తామని, స్కీంవర్కర్స్ సమస్యలు పరిష్కరిస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఇవేమీ అమలు కాలేదు. పైగా ఉద్యమించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులపై దుష్ప్రచారం చేశారు. తప్పుడు కేసులు బనాయించారు. . వీటన్నింటి ప్రభావం ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. అందుకే అక్రమాలకు సిద్ధమయ్యారు.
ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఈ ప్రభుత్వ విధానాల వైఫల్యాల గురించి ఏనాడూ మాట్లాడదు. వ్యక్తిగత విమర్శలతోనే రెండు పార్టీలు ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని వైసిపి, టిడిపి ప్రశ్నించడం లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు. శాసనమండలిలో పిడిఎఫ్ ఎంఎల్‌సిలు ప్రజా ప్రత్యామ్నాయ విధానాల అమలు కోసం నినదించారు. పాలక పార్టీ విధానాలపై ప్రశ్నించారు, నిలదీశారు. పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజల పక్షాన నిలిచారు. విలువలతో కూడిన రాజకీయాలను ఆచరించి చూపారు. వారిని బలపరచి గెలిపించడమే నిజమైన ప్రత్యామ్నాయం.
- వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు
వి.రాంభూపాల్