చాలా మందికి గుమ్మడి కూరగా వండుకుని తినడమే తెలుసు. అయితే ప్రస్తుతం గుమ్మడితో స్వీట్లు, హల్వా, కూరలు, వడియాలు ఇలా అనేక వంటకాలు చేస్తున్నారు. అంతేకాదు.. గుమ్మడిలోనూ అనేక పోషకాలు, ఔషధాలూ ఉన్నాయి.. పూర్వం దప్పళం పులుసు చేసుకుని తినేవారు. అలా తెలుగువారి పసందైన వంటకాల్లో గుమ్మడి ఒకటి. కరకరలాడే వడియాలు వంటకాలకు వాడేది ఒక రకమైతే. మరో రకం బూడిద గుమ్మడి. సీజన్ వచ్చిందంటే ఒకప్పుడు ప్రతి వాళ్ళ పెరట్లోనూ పాదులై విచ్చుకుని కాయలు ఇరగ కాసేవి. తక్కువ జాగాల్లో చక్కగా కాసే ఆధునిక హైబ్రిడ్ వంగడాలు.. వీటిలో అందుబాటులో రావడంతో మిద్దెపంటలుగా, కుండీల్లోనూ, చిన్నచిన్న పెరట్లోనూ చక్కగా పెంచుకుంటున్నారు. అసలు గుమ్మడిలో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం..
దేశవాళి..
మెరక ప్రాంతం ఉంటే సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా ఈ పంటను వేసుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ మొదటి వారంలో గుమ్మడి విత్తనాలు నాటుతారు. సంక్రాంతి నాటికి పూతా, పిందే బయలుదేరుతుంది. విత్తు నాటిన వారం రోజులకి మొక్క వేస్తుంది. పది రోజులకి ఒక తడి చొప్పున నెల రోజుల్లో మూడు ఆరుతడులు పెట్టాలి. ఆ తర్వాత పాదులకు నీళ్లు అవసరం ఉండదు. పాదులపై ఎక్కువగా గాజు పురుగు ఆశించి నాశనం చేస్తుంది. మోనోక్రోటోపాస్ లేదా ఎమ్45 లేదా ఎండోసల్పాన్ వంటి మందులు పిచికారీ చేసి నియంత్రించవచ్చు. భూమిలో పోషకాలు, వాతావరణ అనుకూలతను బట్టి 20 నుండి 50 కాయల వరకూ కాస్తుంది. ఒక్కో కాయ ఐదు నుంచి 12 కేజీల వరకూ బరువుంటుంది. అదే హైబ్రిడ్ అయితే 30 కేజీల వరకూ బరువు ఉంటాయి. మార్చి ఏప్రిల్ నాటికి ఎండలు ముదరడంతో ఎండిపోయి పాదులు కూడా చనిపోతాయి.
సూరేడు..
గుండ్రంగా, తప్పడిగా, చుట్టూతా తొనలు లాంటి ఉబ్బెత్తు ఆకారంతో లేత గోధుమ పసుపు రంగు కలబోతలతో భలే ఆకర్షణగా ఉంటుంది. రంగు రూపులో కూడా దానికదేసాటి. కుకుర్ బీటా దీని శాస్త్రీయ నామం. అమెరికాలోని మెసో ప్రాంతానికి చెందిన తీరం నుంచి ఇది ప్రపంచమంతా ఎగబాకింది. క్యాలరీలు, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ షుగర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, క్యాల్షియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, సి విటమిన్ వంటివి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలను పొడి చేసి ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా వినియోగించేవారు.
పచ్చ..
ఇది హైబ్రిడ్ సూర్యుడు గుమ్మడిలో ఒక రకం. కాయ ఆకుపచ్చగా ఉండి దాని మీద చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. ఇది విదేశీ రకం. కాయలు చిన్నగా వివిధ ఆకారాల్లో ఉంటాయి. రుచిగా ఉన్నప్పటికీ, మన వాతావరణానికి ఈ రకం కాయలు సరిగ్గా కాయవు. వాణిజ్యపరంగా కాకుండా ఇళ్లల్లో ఈ రకాన్ని పెంచుకోవచ్చు.
దేశవాళీ బూడిద..
దాదాపు రెండున్నర నెలల పాటు కాపు ఉంటుంది. కాయ పూర్తిగా బూడిద కడితే పక్వానికి వచ్చినట్టు లెక్క. ఏప్రిల్‌కి కాపు పూర్తిగా మందగిస్తుంది. ఒక్కోపాదు 20 నుంచి 30 కాయలు కాస్తుంది. పది నుంచి 20 కేజీల వరకూ బరువు ఉంటుంది. పొడి వాతావరణంలో ఉంచితే కాయ చాన్నాళ్లు నిలువ ఉంటుంది.
బూడిద గుమ్మడి..
లావుగా, స్థూపాకారంగా, బూడిద రంగులో కనువిందు చేసేవి బూడిద గుమ్మడికాయలు. వీటిని విభూది పండ్లు అని కూడా పిలుస్తారు. తాకగానే దానికున్న బూడిద చేతిని అంటుకుంటుంది. యాష్ గార్డ్, యాష్ పంపికిన్, వ్యాక్స్ గార్డ్, వింటర్ మిలాన్, కర్రీ మిలాన్ అని దీనికి బోలెడు పేర్లు ఉన్నాయి. జపాన్ దీని పుట్టినిల్లు. మనదేశంలో కేరళలో బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా పండుతాయి. వీటిని సలాడ్స్, పచ్చళ్లు, వడియాలు, ఒరుగులు, పిండి వంటకాలు చేసుకుని తింటుంటారు.
వీటిని అక్టోబర్ నెల్లో నాటుతూ ఉంటారు. పాదుదశలో ఒకటి రెండుసార్లు కాస్త పొడి తడి పెడితే సరిపోతుంది. రెండు నెలలకు కాపు అందుకుంటుంది. బూడిద గుమ్మడి పాదు బలమైన జాతి. ప్రతికూల ఆటుపోట్ల వాతావర్ణాన్ని తట్టుకుంటుంది. కాస్త ఆధారం దొరికితే చాలు చెట్టు, పుట్ట ఏది అందుబాటులో ఉంటే దాన్ని అలిమేసి చకచకా ఎక్కేసి కాపు కాసేస్తుంది.
ఎర్ర గుమ్మడి..
ఇందులో మరో రకం ఎర్రగుమ్మడి. కాయ ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఆకారం, పరిమాణం వింతగా ఉంటుంది. అయితే శీతల వాతావరణంలో బాగా పెరుగుతుంది. రైతులకు పెద్ద లాభసాటి కాదు.
సొర బూడిద..
సొర బూడిద గుమ్మడి హైబ్రిడ్ రకం. కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి. ఇళ్లలోనూ, కుండీల్లోనూ వీటిని పెంచుకోవచ్చు. పొలాల్లో పెంచితే కాయలు వేలాడడానికి అనుకూలంగా ఉండేటట్లు పందిళ్లు వేయాలి. కాయలు రుచిగా ఉంటాయి. చట్నీలకు బాగా ఉపయోగపడతాయి. శీతల ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి.
చిలుకూరి శ్రీనివాసరావు
8985945506