Aug 09,2023 07:08

ఆదివాసీల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా జరిపి విజయవంతం చెయ్యాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.

           ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో సుమారు 40 కోట్ల మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తించాలని 1994 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్‌ పేర్కొంది. ప్రపంచం నలుమూలలా ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆదివాసీల హక్కులను గుర్తించడానికి మాత్రం ప్రభుత్వాలు నేటికీ నిరాకరిస్తున్నాయి. భారత దేశంలో 10 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు జీవిస్తున్నారు. 700 వందల ఆదివాసీ, 75 ఆదిమ జాతి తెగల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా జరిపి విజయవంతం చెయ్యాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.
 

                                                               ఆదివాసీ ప్రాంత అడవులు కార్పొరేట్‌ పరం

భారత రాజ్యాంగం 5, 6 షెడ్యూల్‌ ప్రాంత అడవులలో నివసిస్తున్న ఆదివాసీలకు అక్కడి సహజ వనరులపై హక్కు కల్పించింది. ఆదివాసీలకు, గ్రామ సభలకు సర్వ అధికారాలు కల్పించింది. అయితే ఆదివాసీ ప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులను బడా కంపెనీలకు ధారాదత్తం చెయ్యడానికి, ఆదివాసీ ప్రాంత అడవులను అదానీ, అంబానీ పరం చేయడానికి, విలువైన బొగ్గు, బాక్సైట్‌, కాల్సైట్‌, లేటరైట్‌, మాంగనీస్‌, యురేనియం, గ్రానైట్‌, ఐరన్‌ ఓర్‌, వన మూలికలు, వృక్ష జంతు సంపదను ప్రైవేట్‌ బడా సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. ఆదివాసీల అభిప్రాయాలు, ప్రతిపక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. ఆదివాసీ ప్రాంతంలో ప్రవేట్‌ బడా సంస్థల ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులపై ఉన్న హక్కులను తొలగించింది. దీనివలన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటివరకూ ఆదివాసీలు సహజ సిద్ధంగా అటవీ ఫలసాయం పొందేవారు. ఇప్పుడది నేరం అవుతుంది. ఆదివాసీల అడవులు, భూమి, సహజ వనరులకు రక్షణగా ఉన్న గ్రామసభకు అటవీ హక్కులు, 1/70 తదితర చట్టాల అధికారాలు లేకుండా చేసింది. తక్షణమే ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులు, భూమి, సహజ వనరులపై హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
 

                                                                     జీవో నెం 3 అమలు చెయ్యాలి

ఆదివాసీ ప్రాంత గిరిజన హక్కులు, చట్టాల అమలుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లకు భారత రాజ్యాంగం విస్త్రుతమైన అధికారాలు కల్పించింది. 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న జీవో 3 అమలు చేసి 20 రకాల విభాగాలలో ఉపాధి కల్పించింది. అంతటి కీలకమైన జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ ప్రాంతంలో రిజర్వేషన్‌ ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లు, హక్కులను రద్దు చేసినట్లయింది. గిరిజనేతర జాతులైన బోయ వాల్మీకులకు ఆదివాసీలుగా గుర్తింపు కల్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసిపి ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంత అడవులు, సహజ వనరులను బడా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయి. తక్షణమే జీవో నంబర్‌ 3 అమలుకు చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
 

                                                   పోలవరం నిర్వాసితులకు, వరద బాధితులకు సహాయక చర్యలు

గత సంవత్సరం జులై 11న వచ్చిన గోదావరి వరద వల్ల అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు చెందిన కూనవరం, వరరామచంద్రాపురం, దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 200 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వంద రోజులపాటు ఈ గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల నీరు వెనక్కి తన్ని ఈ జల ప్రళయం సంభవించింది. ఈ మండలాల్లోని ఊళ్ళకు ఊళ్ళు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలవారు కొండలు, గుట్టలు ఎక్కి వారాల తరబడి అక్కడే నానా అగచాట్లు పడ్డారు. రెండు నెలల తర్వాత గ్రామాలకు చేరుకున్నారు. అదే పరిస్థితి నేటి వరదల సమయంలో మరలా పునరావృతం అయ్యింది.
గత వారం రోజులుగా మునక మండలాల గ్రామాలు గోదావరి, శబరి నదుల వరద వల్ల జల దిగ్బంధనంలో ఉన్నాయి. వరద ముంపు సమస్యపై సత్వరం ప్రభుత్వం స్పందించాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి.
 1. గోదావరి వరద ముందస్తు చర్యలు సత్వరం తీసుకోవాలి. 2. వరద బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి. 3. వరద గ్రామాల నుండి బాధితులను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలి. పడవలు, లాంచీలు సిద్ధం చేయాలి. 4. వరద బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలిక గుడారాలు నిర్మించుకోవడానికి ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు ఇవ్వాలి. 5. ప్రత్యామ్నాయ రహదారులను పునరుద్ధరించాలి. రోడ్లను మరమ్మతు చేయాలి. 6. పాఠశాలలు మూత పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 7. చింతూరులో ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసరును వెంటనే నియమించాలి.
 

                                                       షెడ్యూల్‌ ప్రాంతంలో నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలు కలపాలి

రాష్ట్ర వ్యాప్తంగా 1500 ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. షెడ్యూల్‌ ప్రాంతంలో లేనందున అక్కడ నివసిస్తున్న ఆదివాసీల భూములు, అడవులకు రక్షణ లేదు. గిరిజనేతర పెత్తందారులు, మైనింగ్‌ మాఫియా మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఐటిడిఎ పర్యవేక్షణ, పథకాలు, నిధులు అందక...ఆదివాసీ గ్రామాలకు విద్య, వైద్యం ఉపాధి, మంచి నీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందు బాటులో లేక...బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. తక్షణమే నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి.
 

                                                                          యుసిసి ని వ్యతిరేకిద్దాం

రాజ్యాంగం ఆదివాసీలకు ప్రత్యేక శాసనాలు చేసింది. వారి సంస్కృతి, ఆచారాలను గుర్తించింది. అయితే కేంద్ర బిజెపి ఆదివాసీలపై హిందూ భావజాలాన్ని రుద్దేందుకు, ఆదివాసీల ప్రత్యేక శాసనాలు, సంస్కృతి ఆచారాలు తొలగించేందుకు ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయాలని చేస్తున్నది. ఆదివాసీ ప్రాంతంలో యుసిసి అమలును వ్యతిరేకించాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.

/ వ్యాసకర్త ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /

కిల్లో సురేంద్ర

కిల్లో సురేంద్ర