
'మన ప్రియతమ అధినేత మహేంద్ర భూపతి ప్రమాదవశాత్తు మరణించడం వల్ల, వారి కుమారుడు రాజీవ్ చాలాకాలంగా అందుబాటులో లేకపోవడం వల్ల, వారు వచ్చేవరకు శ్రీ అమరేంద్ర భూపతి కుమారుడు చిరంజీవి సత్యదేవ్ మన రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు తాత్కాలిక 'సిఎండి' పదవిని అలంకరిస్తారు' అంటూ సత్యదేవ్‌ను ఆహ్వానించాడు జనరల్ మేనేజర్ నందకిషోర్. చప్పట్లతో ఛాంబర్ దద్దరిల్లిపోయింది. సత్యదేవ్ నవ్వుతూ సీట్లో కూర్చున్నాడు.
నా తమ్ముడు అమరేంద్ర, మరదలు తనూజ, సత్యదేవ్ భార్య లతిక ముఖాల్లో చెప్పలేనంత ఆనందం తొంగి చూస్తోంది. చాలామంది ముఖాల్లో ఆనందం తొణికిసలాడినా కొందరి ముఖాల్లో మాత్రం విషాదం కనిపించింది. వారు అసంకల్పితంగా గోడకు తగిలించి, దండవేసిన నా ఫొటోనే చూస్తున్నారు నందకిషోర్‌తో సహా. వాళ్లే నేను బతికున్న రోజుల్లో నాకు అత్యంత విశ్వాస పాత్రులు.
'రేపటి నుంచి మన నూతన అధినేత బాధ్యతలు తీసుకుంటారు. మీరంతా మీ మీ విధుల్లోకి వెళ్లండి' అని కిషోర్ అనగానే, ఉద్యోగులంతా వెళ్లిపోయారు. నా తమ్ముడు, మరదలు, లతిక కాసేపు కూర్చుని వెళ్లిపోయారు. ఛాంబర్ ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత తిలక్ లోపలికి వచ్చాడు. వాడిని చూడగానే మండిపడ్డాను. 'ఈ వెధవను ఎవరు లోపలికి రానిచ్చారు?' అనుకుంటూ పళ్లు కొరికాను.
బ బ బ
మా నాన్న ధీరేంద్ర భూపతి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి, స్వల్ప కాలంలోనే ఆ వ్యాపారాన్ని విస్తరిస్తూ చాలా పెద్ద స్థాయికి ఎదిగారు. ఆయన చనిపోయేసరికి మనదేశంలో అతిపెద్ద శ్రీమంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మా నాన్న చనిపోయాక మా అన్నదమ్ములమిద్దరం వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ, కొన్నేళ్ల తర్వాత అభిప్రాయ భేదాలొచ్చి విడిపోయాము. నేను అమిత వేగంతో వ్యాపారాన్ని విస్తరిస్తే, నా తమ్ముడు వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడు. నా సలహాలు వాడికి రుచించలేదు. వాడి దూకుడు వల్లే చాలా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారాలు అన్నీ మూసేసుకొని, మిగిలిన ఆస్తిపై వచ్చే రాబడితో గుట్టుగా బతుకుతున్నాడు. వాడి కొడుకు సత్యదేవ్ కూడా ప్రయోజకుడు కాలేదు. వాడిని బాగా చెడగొట్టింది ఈ తిలక్ గాడే. అందుకే వాడంటే నాకు మంట. సత్యదేవ్‌ను దార్లో పెట్టమని నా తమ్ముడు బతిమాలితే, నా దగ్గర పెట్టుకున్నాను గానీ వాడికి నా ఆఫీస్‌లో పెద్ద ఉద్యోగం ఏమీ ఇవ్వలేదు. ముందు సిన్సియర్‌గా పని నేర్చుకోమని, ఆ తర్వాతే మంచి స్థానం ఇస్తానని చెప్పి, జనరల్ మేనేజర్ అజమాయిషిలో ఉంచాను. చిన్న ఉద్యోగమని, జీతం తక్కువ అని నసిగినా నేను పట్టించుకోలేదు. నేను బతికున్నంత కాలం తిలక్, సత్యదేవ్ జోలికి రాకుండా స్ట్రిక్ట్‌గా చూడగలిగాను. సత్యదేవ్‌ను మెల్ల మెల్లగా దార్లోకి తీసుకురాగలిగాను. వాడు బాగుపడుతున్నాడనే నమ్మకం కలగడంతో వాడికి పెద్ద బాధ్యతలు కూడా అప్పజెప్పడంతో నా తమ్ముడు, మరదలు ప్రశాంతంగా ఉండడం మొదలు పెట్టారు. ఈ లోగా నా జీవితంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడినా, భూమి మీద నూకలు చెల్లిపోయాయి. దానికి కారణం సత్యదేవ్ అన్న వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను.
బ బ బ
'ఇప్పుడు చాలా ఆనందంగా ఉందిరా' అంటూ సత్యదేవ్‌ను కౌగలించుకున్నాడు తిలక్. 'నిన్ను, నన్ను విడదీసినవాడు పోయాడు. ఈ సామ్రాజ్యానికి నువ్వే రాజువయ్యావు. ఇంకేం కావాలి?' అన్నాడు గోడకున్న నా ఫొటోను కసిగా చూస్తూ. 'మెల్లగా మాట్లాడు. గోడకు చెవులుంటాయి' అంటూ నవ్వి 'ఇదంతా తాత్కాలికమేగా? రాజేంద్ర వస్తే ఈ సీటు ఖాళీ చేయాలిగా?' అన్నాడు సత్యదేవ్. 'ఆ... ఏముంది? వీడిని లేపేసినట్లు వాడినీ లేపేద్దాం. అప్పుడయితే నువ్వొక్కడివే. ఇప్పుడు తోడుగా నేనున్నానుగా?' అంటూ నవ్వాడు తిలక్. ఆ మాటలు వింటున్న నేను కోపంతో కుతకుతలాడిపోయాను.
వాడి మాటలతో వారం రోజులు వెనక్కి వెళ్లి గతాన్ని తవ్వుకున్నాను. సరిగ్గా వారం క్రితం నేను, సత్యదేవ్ ఒక బిజినెస్ పనిమీద అమెరికా బయల్దేరాం. దురదృష్టవశాత్తూ మేమెక్కిన విమానం ప్రమాదానికి గురయ్యి ఒక సముద్ర తీరంలో పడిపోయింది. కేవలం మేమిద్దరమే ప్రాణాలతో బయటపడ్డాం. సాంకేతిక కారణాల వల్ల రెండ్రోజుల వరకూ మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాలేదు. అప్పటివరకూ మా విమానం ఏమైపోయిందో తెలుసుకోలేకపోయారు. ఆ రెండ్రోజులు ఏ ఆహారమూ లేక ఎలా బతికి ఉన్నామో మాకే తెలియదు. తిండి లేక అక్కడే చచ్చిపోతామని రోజూ ఏడ్చే సత్యదేవ్‌కి నేను ధైర్యం చెప్పేవాడిని. ఒకరోజు హెలికాఫ్టర్ మా వైపే వస్తున్న శబ్దం విని, ఇద్దరం సముద్ర తీరాన ఉన్న పెద్ద రాయి ఎక్కి, మా చొక్కాలు తీసి ఊపుతూ హెలికాప్టర్‌ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న సమయంలో, సత్యదేవ్ నన్ను కిందకు తోసేశాడు. నా ఆస్తి మీద వ్యామోహం పెంచుకొని, నన్ను అంతం చేయడానికి ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నాడని నేను గ్రహించలేకపోయాను. ఆ ఆలోచనే లేని నేను, నీళ్లలో పడి ప్రాణాలు వదిలాను. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాళ్లకు నేను చనిపోయే దృశ్యం కనబడే అవకాశమే లేకపోవడం వల్ల, ఆ ప్రమాదంలో బతికి బట్టకట్టింది సత్యదేవ్ ఒక్కడే అనుకున్నారు అందరూ.
బ బ బ
మళ్లీ గట్టిగా నవ్వులు వినబడేసరికి వాళ్ల వైపు చూశాను. 'ఆ రాజీవ్ గాడు రాకముందే వాడిని మట్టుబెట్టాలి. తండ్రి చనిపోయినా రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకూ వాడెక్కడ ఉన్నాడు?' అన్నాడు తిలక్.
'ఏమోరా? ఢిల్లీలో రీసెర్చ్ చేసేవాడు. అక్కడ నుంచి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడట. వాడి జాడ తెలుసుకోవడానికి నందకిషోర్ గట్టి ప్రయత్నమే చేశాడు. అయినా లాభం లేదు. వాడు తిరిగి వచ్చాడంటే నాకు ఇబ్బంది తప్పదు. మా పెదనాన్న ఎంత కష్టపడి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడో వాడికి తెలుసు. ఆయన కోసమైనా ఈ సీట్లో కూర్చుంటాడు. నువ్వన్నట్లు ఆ పరిస్థితి రాకముందే వాడిని లేపేయాలి' అంటుంటే..
'సత్యదేవ్ మనసు ఇంతలా విషపూరితం అయిపోయిందా?' అనుకుంటూ చింతించాను. 'ఎంతో తెలివైన వాడినైన నేను, వీడి విషయంలో ఎలా బోల్తా పడ్డాను?' అనుకున్నాను బాధగా.
కాసేపటికి తిలక్ కూడా వెళ్లిపోయాడు. ఆ తర్వాత, కేవలం నేను మాత్రమే వాడే తాళాల గుత్తి తీసుకొని, నా పర్సనల్ అల్మారాలు అన్నీ వెదకసాగాడు సత్యదేవ్. నా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లనన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా ఒక కవర్ జారి పడడంతో దాన్ని అందుకుంటూ దానిపై ఉన్న తన పేరుని చూసి, కళ్లు విప్పార్చాడు. అది తనకోసమేనని తెలియడంతో ఆత్రుతగా ఆ కవర్ తెరిచి, అందులో ఉన్న ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు. ఆ ఉత్తరం నెలరోజుల క్రితం వాడికి నేనే రాశాను. కానీ వాడికి ఎలా అందజేయాలో తెలియక అలాగే ఉంచేశాను. అది ఇలా వాడి కళ్లబడుతుందని ఏనాడూ ఊహించలేదు. ఆ ఉత్తరంలో ఉన్న ప్రతి పదం నాకు ఇంకా గుర్తే.
'మై డియర్ సత్యదేవ్
కొన్ని నిజాలు నీకు తెలియజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఉత్తరంలో తెలియజేసే విషయాలు చదివి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను ఊహించలేకున్నాను.
అందరూ నా అంత అదృష్టవంతుడు లేడని అంటూ ఉంటారు. అది సగం మాత్రమే వాస్తవం. నీకు తెలుసుగా.. కారు ప్రమాదంలో మీ పెద్దమ్మను పోగొట్టుకున్న దగ్గర నుంచి జీవచ్ఛవంలా బతుకుతున్నాను. దానికి తోడు మీ అన్నయ్య రాజీవ్ నాకో సమస్యగా తయారయ్యాడు. వాడి ఆలోచనలు మనమెవ్వరం ఊహించని రీతిలో ఉంటాయి. వాడికి నా ఆస్తి, వ్యాపారం తృణప్రాయంగా తోస్తాయి. అయినా నేను బాధపడలేదు. కానీ వాడెంతో ఇష్టపడిన రీసెర్చ్‌ని, కెరీర్‌ని వదిలి, రామకృష్ణా మిషన్లో చేరి, ఆధ్యాత్మిక చింతనలో పడ్డాడు. ప్రాపంచిక సుఖాలకు, వైవాహిక జీవితానికి దూరంగా ఉండిపోవాలని ఒక ధృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. వాడి మనసు మార్చాలని నేను చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. నాకు మాత్రం ఎవరున్నారు? వాడినే చూసుకుంటూ బతుకుతున్న నాకు, తీవ్ర అశాంతితో బతకాల్సిన పరిస్థితి. వాడిని అలాగే వదిలేస్తే నాకు దక్కడేమోనన్న భయం పట్టుకుంది. దాంతో వాడిని మార్చాలని కంకణం కట్టుకున్నాను. పదే పదే పోరడంతో, నా బాధ పడలేక, వాడు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. నాకున్న నెట్‌వర్క్, పరపతి, పలుకుబడి ఏదీ పనికిరాలేదు. మూడు నెలల పాటు నా మనుషులు ఎంతగా గాలించినా వాడి జాడ తెలియలేదు. ఆ తర్వాతే అతి కష్టం మీద వాడెక్కడున్నాడో తెలిసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాడి శవం కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది నాకు. వాడు నా బాధపడలేక ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీ ఆశ్రమంలో చేరాడు. తన వివరాలు ఏవీ వారికి తెలియనివ్వలేదు. పేరు మార్చి చెప్పి, తప్పుడు అడ్రస్ ఇచ్చాడు. తక్కువ సమయంలోనే అందరితోనూ కలిసిపోయాడు. వాడు అక్కడ చేరిన రెండు వారాలకు అక్కడికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చి, వందల కొద్దీ జనం చనిపోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు ఇరవై వేలకు పైగా జనం గాయపడ్డారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఆశ్రమం తరపున వీడు కూడా వెళ్లి, వారం రోజులకు పైగా అక్కడుండి, అన్నిరకాల సేవలు చేశాడట. వందలాది శవాలను, అసంఖ్యాకమైన బాధితులను చూసిన రాజేంద్రకు జీవితంపై విరక్తి పుట్టి, తిరిగి వచ్చిన మర్నాడే ఆత్మహత్య చేసుకున్నాడట. తప్పుడు అడ్రస్ కారణంగా మనకు కబురు అందజేయలేక పోయామని స్వామీజీ బాధపడుతూ చెప్పారు. నా బాధ ఎవరికి చెప్పుకోను? బ్రతికి ఉండగానే నరకం అనుభవించాను. అక్కడే పదిరోజులు ఉండిపోయి, నా బాబు నడయాడిన ప్రాంతాలన్నీ చూసుకుంటూ, వాడి జ్ఞాపకాలతోనే గడిపేశాను.
వాడి మరణవార్త ఎవరికీ చెప్పాలనిపించలేదు. అందరి దృష్టిలో వాడు జీవించి ఉన్నట్లే ఉండాలని అనుకుంటూ, నేనూ అదే ధ్యాసలో ఉంటూ ప్రశాంతంగా బతకడానికి నిర్ణయించుకున్నాను. వాడి చావు కళ్లారా చూడకపోవడం నాకు మేలే చేసింది. వాడింకా బతికే ఉన్నట్లు సమాధానపడటం నాకు పెద్దగా కష్టం కాలేదు.
ఇదంతా నీకెందుకు చెబుతున్నానోనని నువ్వు తికమక పడుతున్నావని భావిస్తున్నాను. ఈ పెదనాన్నను నువ్వు కన్నతండ్రిలా ప్రేమగా చూస్తావని నేను అనుకోవడం లేదు. ఆఫీసులో నీకు చిన్న స్థానం ఇచ్చానని, తక్కువ జీతం, తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని, సొంత కొడుకైతే ఇలా చేయనని నువ్వు నా మీద అయిష్టం పెంచుకున్నావని నేను గ్రహించాను. కానీ ఇప్పుడు నీకో నిజం తెలియాల్సి ఉంది. ఒకరకంగా నువ్వు కూడా నా సొంత కొడుకువే. మీ నాన్నకు పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత, వంశోద్ధారకుడు కావాలని మీ నాన్న బలంగా పట్టుబట్టేసరికి, 'ఆర్టిఫీషియల్ ఇన్సెమినేషన్' ద్వారా నా వీర్యకణాలతో మీ అమ్మ గర్భం దాల్చడంతో నువ్వు పుట్టావు. ఈ రహస్యం ఇంతవరకూ మా ముగ్గురి మధ్యే ఉండిపోయింది. నాకు మిగిలిన ఏకైక వారసుడువి నువ్వే కాబట్టి ఈ రహస్యం నీకూ తెలియాల్సి ఉంది. కానీ నా నోటితో నీకెలా చెప్పాలి? అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. కానీ నీకిది ఎలా అందజేయాలి.. అన్నది కూడా పెద్ద సమస్యే. అయినా ప్రయత్నిస్తాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటాను.
ఇట్లు మీ నాన్న.'
బ బ బ
ఉత్తరం చదివిన సత్యదేవ్, నేను ఊహించినట్లే బాగా కదిలిపోయాడు. భోరున ఏడుస్తూ కుమిలిపోతున్న కన్న కొడుకుని అలా చూడటం చాలా కష్టంగా ఉంది నాకు. గట్టిగా పట్టుకొని, ఓదార్చాలని అనిపించినా ఏమీ చేయలేని నా అశక్తతకు మౌనంగా రోదించడం తప్ప నేను ఏం చేయగలను? పశ్చాత్తాపం వాడిని దహించేస్తుందని నాకు అర్థమయ్యింది. కన్నతండ్రినే మట్టుబెట్టి, సొంత అన్నను చంపాలని ప్లాన్ చేసిన వాడికి, అసలు నిజం తెలిస్తే, పరిస్థితి ఏమిటన్నది నేను ఊహించలేనిది కాదు. టేబుల్ మీద తలపెట్టుకుని చాలాసేపటి వరకూ రోదిస్తూనే ఉన్నాడు సత్యదేవ్. ఆ తర్వాత మెల్లగా పైకి లేచి, దేనికోసమో చాలాసేపు వెదికాడు. చివరకు బ్లేడ్ లాంటి దాన్నొకటి పైకి తీశాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని నాకు బోధపడింది. వాడిని ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు. ఎంత గింజుకున్నా నాకే మార్గమూ కనబడటం లేదు. వాడి నిర్ణయంలో ఏ మార్పూ లేదు. ''ఎందరికో జీవితాన్ని ఇచ్చిన మహనీయుడు మా పెదనాన్న మహేంద్ర భూపతి, మరెందరికో ఆదర్శంగా నిలిచిన నా అన్న రాజీవ్ ఈ లోకంలో లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోతున్నాను. ఎంతో ప్రియమైన వారిద్దరినీ కోల్పోయి జీవించడం నావల్ల కావడం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కాదు.. అని ఇందుమూలంగా తెలియబరుస్తున్నాను'' అని ఒక కాగితం మీద రాయగానే నా గుండెలు అదిరిపోయాయి. భయంతో వణుకుతూ, ధైర్యం కూడగట్టుకుంటున్నాను. వాడు మెల్లగా బ్లేడ్ అందుకొని, ఎడమ చేతి మణికట్టుపై ఆన్చాడు. అక్కడి నరాన్ని కోసుకుంటే, క్షణాల్లో ప్రాణం పోతుంది. ఆ ఘోరం చూడలేక కళ్లు మూసుకున్నాను. మిగిలిన ఒకే ఒక వారసుడి చావుకి నేనే కారణమన్న చేదు నిజం నన్ను కాల్చేస్తుంది. చనిపోయాక కూడా నాకిలాంటి శిక్ష పడుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు.
బ బ బ
'అయ్యా... మీ కోసం ఈ స్వామీజీ వచ్చారండి?' అంటూ లోపలికి అడుగుపెడుతున్న అటెండర్ స్వరం వినబడటంతో నాతో పాటు సత్యదేవ్ కూడా ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా అతని చేతిలో బ్లేడ్ కింద పడింది. టక్కున తను రాసిన కాగితాన్ని దాచేశాడు. గండం గడిచినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. నాకిప్పుడెంతో ప్రశాంతంగా ఉంది. అటెండర్ వెనుకే కాషాయ దుస్తుల్లో ఉన్న పరమానంద స్వామీజీ కూడా లోపలికి వచ్చారు. రాజీవ్ చివరగా ఉన్నది ఆయన ఆశ్రమంలోనే.
'నేను మీ పెదనాన్న గారిని కలవాలని వచ్చాను. ఆయన పరమపదించారని ఇప్పుడే తెలిసింది. రాజీవ్ మరణం ఆయన్ని బాగా కుంగదీసింది. మా ఆశ్రమంలో ఉన్నన్నాళ్లూ ఆయనలో ధైర్యం నింపడానికి చాలా ప్రయత్నించాను. కాస్త మార్పు కనిపించింది. శేషజీవితమంతా ప్రజాసేవకే కేటాయిస్తానని, అందుకు నా సహకారం కావాలని అడిగారు. ఆయనలాంటి వారు ముందుకొస్తే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, దానికి తగ్గ ప్రణాళికతో వస్తానని వాగ్దానం చేశాను. ఆ పని మీదే ఇప్పుడొచ్చాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు' అంటున్న స్వామీజీ గొంతులో నిరాశ స్పష్టంగా ధ్వనించింది. 'ఇప్పుడు మాత్రం ఏమైంది? నేనిప్పుడు వారి వారసుడిని మాత్రమే కాదు. వారి ప్రతినిధిని కూడా. ఇప్పుడు ఆయన ఆస్తి అనుభవించాలనే కోరిక నాలోనూ లేదు. ఆయన ఆశయాలు నెరవేర్చడమే నా ప్రథమ కర్తవ్యం. అందుకోసం ఎంతైనా శ్రమిస్తాను' అంటున్న సత్యదేవ్ కంఠంలో నిజాయితీ గమనించిన నా హృదయం ఉప్పొంగిపోయింది. నేను పోగొట్టుకున్నదంతా తిరిగి పొందానన్న ఆనందంతో పులకించిపోయాను. ఇప్పుడు నాలో ఉన్న బెంగంతా తీరిపోయింది. స్వామీజీ ఆధ్వర్యంలో వాడు సత్కార్యాల్లో మునిగిపోతాడు. ఆత్మహత్యా ప్రయత్నం శాశ్వతంగా విరమించుకుంటాడు. 'నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది?' అనుకోగానే నా 'ఆత్మఘోష' చరమాంకానికి చేరినట్లు తెలిసింది. నా ఆత్మ మెల్ల మెల్లగా ఈ లోకాన్ని వదిలి వేస్తుందన్న విషయం కూడా నాకు అర్థమయింది.
కొయిలాడ రామ్మోహన్‌రావు
9849345060