
- జులై 26 గోరా వర్థంతి
దేవుడు అబద్దం. మనిషిలో నీతి పెరగాలంటే అతని మనసులో దైవ భావన పోవాలి. ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరుగుతూ ఉంది. దానితో విద్వేషాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా స్వచ్ఛమైన నీతిమంతుడైన మానవుడిగా మిగులుతాడు. ప్రజల మధ్య అడ్డుగోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చినప్పుడు సోదరభావం దానంతట అదే వెల్లివిరుస్తుంది. ప్రేమ, ఆప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!-అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) ఆలోచనలు.
ఎవరీ గోరా? తెలుగు ప్రజలకు ఎందుకు ప్రియతముడయ్యాడూ? మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్న ఈ దైవ కేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి జీవితాంతం కృషి చేశాడు. వృక్షశాస్త్ర అధ్యాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధీజీ అనుచరుడు, జాతీయ స్థాయి కాంగ్రెస్ కార్యనిర్వాహకుడు. అస్పృశ్యతా నివారణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే-ప్రజల్లో కులమతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి. దేశంలో ఉన్నత విద్య సులభంగా అందుబాటులో లేని రోజుల్లో దాని కోసం తపించి, శ్రమించి స్నాతకోత్తర పట్టా సాధించిన వైజ్ఞానిక విద్యార్థి. ఉన్నత విద్యావంతుడై కూడా తన సుఖం తాను చూసుకోకుండా జనం కోసం జనం మధ్యలో తిరుగుతూ వారిలో వివేకాన్ని పెంచిన బాధ్యతగల పౌరుడు. గోరా నవ యువకుడిగా ఉన్నప్పటి నుండే - అంటే దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండే, సామాజిక కార్యాచరణకు పూనుకున్నారు. అనతి కాలంలోనే ఆయన చేపట్టిన సానుకూల నాస్తికత్వ ప్రచారం అనేకమందిని ఆకర్షించింది. స్వచ్ఛందంగా అనేకమంది ముందుకొచ్చి ఆయన కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. క్రమంగా వాళ్ళే వాలంటీర్లయి ఆయనకు తోడు నిలిచారు.
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చత్రపురంలో గోరా 1902 నవంబర్ 15న జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారావు. పుట్టింది ఉన్నత వర్గంలోనైనా ఆయన దానికి ఎన్నడూ విలువ ఇవ్వలేదు. పైగా కుల మతాల అడ్డుగోడలు తొలగించడానికే ఉద్యమించారు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్య, పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడి యట్ చదువు పూర్తి చేసి, మద్రాసు (తమిళనాడు) ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి దశలోనే విజయనగరానికి చెందిన సరస్వతిని పెళ్లి చేసుకు న్నారు. అప్పుడామె వయస్సు పదేళ్ళు మాత్రమే. గోరా అనేక చోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధురలోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పనిచేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్లి కొలంబో లోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడయ్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. స్వతంత్ర భావాలు గల గోరా ఎక్కడా ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేకపోయేవారు. నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన-ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయ వాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించుకుని, భార్య పిల్లలతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని గోరా అనుకున్నారు. ఆ ఆలోచనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు. సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కులమతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని రూపొందించడానికి 1940లో కృష్ణా జిల్లా ముదునూరులో 'నాస్తిక కేంద్రం' ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధునిగా పనిచేస్తూనే సామాజిక, ఆర్థిక సమానత్వానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కులమతాల నిర్మూలనకు, అస్పృశ్యతా నిర్మూలనకు, దళితుల ఆలయ ప్రవేశానికి, కులాంతర-మతాంతర వివాహాలు జరిపించడానికి నిరంతరం కృషి చేశారు- గోరా. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పనిచేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలను మరింత విస్తృతపరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందువయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత గోరా గారిదే! అప్పుడాయన వయసు 70 సంవత్సరాలు.
భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి? అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జులై 26న గోరా తుది శ్వాస విడిచారు. 2002లో గోరా శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా బిళ్ళ విడుదల చేసింది. గోరా మరణానంతరం ఆయన శ్రీమతి సరస్వతీ గోరా - నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్వహించారు. 2006లో సరస్వతీ గోరా మరణం తర్వాత 2020లో నాస్తిక కేంద్రం ఎనభై సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంది.
ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణ లోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయ ట తిరిగితే 'గ్రహణం మొర్రి' రాదని, తన భార్య గర్భిణిగా ఉన్న ప్పుడు తప్పనిసరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిది మంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. జనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి! రాహు- కేతువులు ఎక్కడో లేరు సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెపుతూ ఉండేవారు. గోరా దంపతులు తమ పిల్లలకు పెట్టిన పేర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన కొడుక్కి 'లవణం' అని, భారతీయులు చట్ట సభల్లో గెలిచినప్పుడు పుట్టిన కొడుక్కి 'విజయం' అని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టిన కొడుకులకు సమరం, నియంత-అనీ తమ తొమ్మిదో సంతానానికి 'నవ్' (నౌ.9) అని, గాంధీ-ఇర్విన్ ఒడంబడిక జరిగిన సందర్భంలో పుట్టిన కూతురికి 'మైత్రి' అని, మరో అమ్మాయికి మనోరమ అనీ పేర్లు పెట్టారు. దేవుళ్ళ పేర్లు పెట్టుకునే జాడ్యం నుండి తెలుగువారిని కాపాడాలన్న ఉద్దేశంతో తమ సంతానానికి ఇలా ప్రత్యేకమైన పేర్లు పెట్టి చూపించారు. వీరి ప్రభావంతో చాలా మంది దంపతులు వారికి పుట్టిన పిల్లలకు దేవుడి పేర్లు పెట్టుకోవడం మానేశారు. అందుకే చూడండి...ఆధునికుల పేర్లు మానవ్, కౌశల్, వాత్సల్య, ప్రేమ, కారుణ్య లాంటివి కనిపిస్తున్నాయి.
సరస్వతి గోరా పూర్తిగా భర్తను అనుసరించి సంఘ సేవికగా మారారు. చిన్న వయసులోనే వివాహమైనా, అనతి కాలంలోనే ఆమె గోరా ఆలోచనల్ని అందుకుని ముందుకు నడిచారు. గోరా శ్రీలంకలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈమె అక్కడ నిప్పుల మీద నడిచి చూపించారు. అందులో దైవ మహిమలేవీ లేవని నిరూపించారు. అంతే కాదు, దేవదాసీ వ్యవస్థ నుంచి మహిళల్ని బయటికి లాగి, సరస్వతి గోరా వారికి వివాహాలు జరిపించారు. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కొన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జీవితాంతం బొట్టు, కాటుక, మంగళసూత్రాలు వంటివి ధరించకుండా మనువాద నియమాల్ని తిరస్కరించారు. గోరా మరణించినప్పుడు కూడా మతానికి సంబంధించిన కార్యక్రమాలేవీ లేకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రేమ, ఆప్యాయత, నైతికత మాత్రమే మానవత్వ లక్షణాలని గోరా దంపతులు చాటి చెప్పారు.
నిరంతరం కార్యరంగంలో శ్రమిస్తూనే, ఉపన్యసిస్తూనే గోరా నాస్తికత్వం మీద పత్రికలు-పుస్తకాలు ప్రకటించారు. ఆయన రచించిన పదహారు పుస్తకాలలో సగం ఇంగ్లీషువి. యాన్ ఎథీస్ట్ విత్ గాంధీ, పాజిటివ్ ఎథీస్ట్, ది నీడ్ ఆఫ్ ఎథిజమ్ వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. నాస్తికత్వం, దేవుని పుట్టుపూర్వోత్తరాలు, నేను నాస్తికుణ్ణి, సృష్టి రహస్యం, ఆర్థిక సమానత్వం, నాస్తికత్వం-ప్రశ్నోత్తరాలు వంటివి కూడా బహుళ జనాదరణ పొందిన రచనలు. ప్రతి ఒక్కరూ గోరా రచనలు చదవాలి. చదివించాలి.
/వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు