Mar 05,2023 09:00

వర్షం సన్నగా మొదలైంది. అనుకుంటూనే ఉంది వర్షానికి చిక్కుతుందని. బస్‌ ఇంకా రాలేదు. 113 రాగానే బస్టాప్‌ చాలా వరకు ఖాళీ అయింది. వెనక ఉన్న బెంచీ మీద చోటు దొరకడంతో వెళ్ళి, జాగ్రత్తగా చీర మడతలు సరి చేసుకుని కూచుంది హారిక. టైము తొమ్మిదిన్నర దాటింది. వచ్చేవారం మొదలవుతోన్న ప్రాజెక్ట్‌లో లాస్ట్‌ మినిట్‌ మార్పులు ఉండటంతో ఆలస్యం అయిపోయింది ఆఫీస్‌లో. రాత్రి ముదిరి మరింత నలుపుని అద్దుకుంటోంది. వర్షం వల్ల మనుషులు పలచబడుతుండటంతో రోడ్డు తడిగా మెరుస్తూ కుబుసం విడిచిన నల్ల తాచులాగ ఉంది.
సిటీ బస్‌ ప్రయాణాల్లో డ్రెస్‌లు ఎంత కంఫర్ట్‌ ఇచ్చినా సరే, చీరలే ఇష్టం తనకి. అందునా హాండ్‌లూం చీరెలు మంచి జరీ అంచులు చూసి మరీ ఎన్నిక చేసుకుంటుంది. మడత నలగని చేనేత చీరలో ఎవరైనా ఎంత బాగుంటారో కదూ!
ఏదో బస్‌ వస్తోంది. వర్షంలో నంబర్‌ కనపడట్లేదు. దగ్గరికి వచ్చాక చూసింది. ప్చ్‌. తన బస్‌ కాదు.
దగ్గర్లోని మెట్రోస్టేషన్‌ వరకూ ఆటోలో వెళ్లి, అక్కడి నుంచి మెట్రోలో నాగోల్‌ వెళ్ళి, అక్కడి నుంచి ఇంటికి ఆటోలో వెళ్తే? దానికంటే కాసేపు వెయిట్‌ చేసి బస్సెక్కడమే నయం. ఇంటికి రెండు నిమిషాల నడక. బస్‌ దిగాక రెణ్ణిమిషాల్లో ఇంట్లో ఉంటానన్న ఆలోచన మొహాన నవ్వు తెప్పించింది, బస్‌ రాకుండానే. వర్షం పెరగకుండా తగ్గకుండా, సన్నగా నిలకడగా కురుస్తోంది.
ఫేస్బుక్‌ ఓపెన్‌ చేసి చూసింది. ఎవరిదో మెసేజ్‌. 'చీరెలో మీరు భలే ఉంటారు. మీకు పెళ్ళయిందా? సింగిలా? ఆ విషయం చెప్పరేంటి?'
విసుగ్గా మూసేసి రోడ్డు వైపు చూసింది.
'హలో'!
ఉలిక్కిపడి చూసింది. ఆ చివర కూచుని ఉన్నాడెవరో. ఎప్పటి నుంచి ఉన్నాడో గమనించలేదు.
చూసిందిగానీ మాట్లాడలేదు.
'హలో' మళ్ళీ అన్నాడు.
అతనివైపు చూసి, తల పంకించింది రిప్లైగా.
'మీ ఆఫీసు స్టెల్లా ఛాంబర్స్‌లో ఉంది కదూ!'
రోజూ గమనిస్తున్నాడా? సరే చావనీ. ఆఫీసు మెయిన్‌రోడ్డు మీద ఉంది మరి. బయటికి వస్తుంటే చూశాడేమో!
'ఏం కావాలి మీకు?'
'అహ. జస్ట్‌ అడుగుతున్నాను'
'ఎందుకు?'
'ఊరికే'
కొంచెం విసుగ్గా చూసింది. చీకటి కాబట్టి అతనికి కనపడకపోయి ఉండొచ్చు.
'నా ఆఫీసు కూడా అదే బిల్డింగ్‌లో ఎనిమిదో ఫ్లోర్‌ లో'
'ఓ..ఓకే'
'మీరు.. సింగిలా?'
వీడి మొహం మండ. ఎంత డైరెక్ట్‌గా అడుగుతున్నాడో? ఇందులో డైరెక్ట్‌ ఇండైరెక్ట్‌ ఏముంది? 'మీకు పెళ్లయిందా' అనో, 'మీ వారి ఆఫీసెక్కడ మరి?' అనో డొంక తిరుగుడుగా అడిగితే ఓకేనా? అతనివైపు బ్లాంక్‌గా చూసింది.
'అవును, సింగిలే నేను'
'నైస్‌' నైసా? తను సింగిల్‌ అయితే వీడికి నైస్‌!
'వాట్‌ డూ యూ డూ ఫర్‌.. దట్‌?'
ఏమిటంటాడు? వాట్‌ డూ యూ డూ ఏంటి?
'కమ్‌ అగైన్‌? ఐ డిడింట్‌ గెట్‌ యూ'
'డూ యూ హావ్‌ ఏ పార్ట్నర్‌? ఐ మీన్‌, బారుఫ్రెండ్‌?'
కాళ్ళు చల్లబడ్డాయి. అరచేతుల్లో చెమట్లు పట్టాయి.
ఏంటి ఈ ధైర్యం? ఎవరూ లేరు కదాని చిల్లరగా ఏమైనా బిహేవ్‌ చేస్తాడా?
అతని వైపు చూసింది.
ఆరడుగుల ఎత్తు. ఒత్తయిన జుట్టు. చెక్కిన శిల్పంలాగ ఉన్నాడు. నిటారుగా ఉన్న జిమ్‌ బాడీ. బలంగా ఉన్నాడు. అందగాళ్ళలోకి చేరే రూపమే. వీధిలైట్ల వెలుగులా ఒక పక్కనే వెలుతురు పడుతూ ఏదో పాత సినిమాల ప్రొఫైల్లో కనపడే కథా నాయకుడిలాగ.
'వాడ్డూయూ మీన్‌?' కోపం పరిగెత్తుకుంటూ వచ్చేసింది గొంతులోకి.
'ఐ మీన్‌ టు ఆస్క్‌ యూ.. మీకు బారుఫ్రెండ్‌ ఉన్నాడా?'
వ్యవహారం టూ మచ్‌గా ఉంది. తేల్చాల్సిందే. భయమా ఏంటి?
'ఎవరు మీరు? నా ఆఫీసు తెల్సినంత మాత్రాన, నన్ను ఒకటి రెండుసార్లు చూసినంత మాత్రాన, ఇలా వెరీ పర్సనల్‌ ప్రశ్నలు వేసే హక్కు మీకెవరిచ్చారు? పరిచయమై పది నిమిషాలన్నా కాలేదు, అలా ఇంట్రూడ్‌ అయిపోతున్నారు? టైమ్‌పాస్‌ కా? అలాటి పిచ్చి ట్రయల్స్‌ వేయకండి. తిక్క రేగితే మంచిదాన్ని కాదు' కోపం మండిపడింది గొంతులో..
చివరికి వచ్చేసరికి.. అతను మాట్లాళ్ళేదు రెణ్ణిమిషాలు.
'అది కాదు..'
'ఏది కాదు, తమాషాగా ఉందా? హౌ డేర్‌ యూ టూ ఆస్క్‌?' మాట ఇంకా పూర్తికాలేదు..
'నో, వినండి.. మీకు కావాలంటే నేను అవైలబుల్‌గా ఉన్నాను, ఆన్‌ పేమెంట్‌'.
'వాట్‌?' ఒక్క క్షణం బుర్ర పనిచెయ్యలేదు. అవైలబుల్‌గా ఉన్నాడా? ఆన్‌ పేమెంటా? అంటే? తల విదిలించి అతని వైపు చూసింది. నిజాయితీగా ప్లెయిన్‌గా ఉంది మొహం. చటుక్కున మొహం తిప్పుకుంది. 'ఛ, అలా అనేశాడేంటి?'
'ఎస్‌ మేమ్‌. ఐ డూ దట్‌ ఫర్‌ మనీ. ఐయామే పార్ట్‌టైమ్‌ మేల్‌ సెక్స్‌వర్కర్‌. ఈ వృత్తికి ఒక పేరు కూడా ఉంది. నా జీతం సరిపోదు నాకు, నా ఫ్యామిలీకి. అందుకే..'
ఏమనాలో తోచలేదు. ఇలాటి వాళ్ల గురించి చదివింది, విన్నదిగానీ.. తనకే తారసపడతాడని ఊహించలేదు. అతనికి జవాబివ్వాలని అనిపించలేదు. అక్కడి నుంచి బయటపడాలనిపించింది. దారినపోయే ఆటోని చేయెత్తి ఆపింది.
అతను కొంచెం హర్ట్‌ అయినట్టు 'అదేంటి? ఇందులో మీరు కోపగించుకోవలసింది ఏముంది? మీకు ఇష్టమైతే చెప్పండి. నాకు డబ్బు అవసరం ఉంది. కోవిడ్‌ తర్వాత బిజినెస్‌ లేదు. మీ ఫ్రెండ్స్‌ ఎవరైనా ఉంటే వాళ్లకి సజెస్ట్‌ చెయ్యండి ప్లీజ్‌' అన్నాడు.
అతని వైపు కొంచెం భయంగా చూసి, గబుక్కున ఆటోలోకి గెంతినంత పనిచేసింది.
ఆలోచనలు వదలట్లేదు. ఇది తనకే ఎదురవ్వాలా? కొలీగ్స్‌ ఎవరికైనా చెప్దామంటే ఏమనుకుంటారో? అమ్మకి చెప్తే? వేరే ఇల్లు తీసుకుని ఉండద్దు, పిన్ని వాళ్ళింట్లోనో, అత్తయ్య వాళ్ళింట్లోనో ఉండమంటుంది. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో చేరమని ఎప్పటి నుంచో పోరుతోంది కూడా. కానీ, తనకి తన సొంత స్పేస్‌ కావాలి. ఒక్కతే మేడ మీది ఇంట్లో ఉండటంలో ఎంత హాయి, ఎంత స్వేచ్ఛ. ఇష్టమైతే ఒండుకోవచ్చు, లేదంటే ఆర్డర్‌ చేసుకోవచ్చు. అదీ ఒద్దంటే బయటికిపోయి తినొచ్చు. కాలనీలో అలా అడుగు బయటపెడితే చాలు. బోల్డన్ని ఫుడ్‌ సెంటర్లు. వెనక లైను మొత్తం హాస్టళ్ళే. ఇల్లు నీటుగా సర్దుకున్నా, పెంటకుప్పలా ఉంచుకున్నా అడిగే వాడుండడు. కింద ఉండే ఓనర్లు కూడా ఎందుకూ ఏమిటీ అని అడిగే రకాలు కాదు. ఎంత మంచివాళ్ళో.
'నీహా, ఆఫీసు నుంచి వస్తూ, సెంట్రల్‌ పక్క సందులో ఉండే చైనీస్‌ ఫుడ్‌ బండివాడి దగ్గర నూడిల్స్‌ పట్టుకురావే తల్లీ. స్విగ్గీలో అందరి దగ్గరా ట్రై చేశాంగానీ ఆ బండివాడు చేసినట్టు ఎవరూ చెయ్యలేరని అర్థమైపోయింది' అంటుంది ఆంటీ తను ఆఫీసుకు వెళ్ళేటపుడు. లేదా, ఫోన్లో మెసేజ్‌ పెడుతుంది, నూడిల్స్‌ తెమ్మని.
'ఆడపిల్లకు ఇల్లు అద్దెకిస్తే చూడండి. అసలు ఈ పిల్ల పైన ఉన్నట్టే తెలీదు. మహా అయితే సినిమా పాటలు వినిపిస్తుంటాయి. ఇంతకు ముందు ఇద్దరు అబ్బాయిలకి ఇచ్చామా, అబ్బబ్బ ఎంత రోత పుట్టించారో. ఒక అమ్మాయిని తెచ్చుకుని చాలా గొడవ చేశారు' చెప్పిందోసారి ఆంటీ, ఆదివారం వాళ్ళింటికి భోజనానికి వెళ్ళినపుడు.
'నేను అబ్బాయిల్ని తెచ్చుకుంటే?' నవ్వేసింది తను.
ఆవిడా నవ్వేసింది. 'అది నీ ఇష్టం రా. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదు.'
తెల్లబోవడం తన వంతైంది. 'మరి ఆ బాచిలర్స్‌ని తిట్టారు?'
'ఆ ఇద్దరు గాడిదలూ కల్సి ఒక పిల్లను తెచ్చుకుని, నానా హింసలూ పెట్టారు దాన్ని. పొద్దున్నే ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోతుంటే మీ అంకుల్‌ ఆపి, వివరాలు కనుక్కుని, ఉన్న పళాన వాళ్ళిద్దరి సామానూ వీధిలో పడేసి, బయటకు పొమ్మన్నారు. ఆ పిల్లను ఆస్పత్రికి తీసుకెళ్లా నేను.'
ఆవిడ మామూలుగా చెప్తున్నా, ఆ క్షణంలో వాళ్లంటే గొప్ప గౌరవం కలిగింది.
పెళ్ళో పెళ్ళో అని అమ్మ సతాయించేస్తోంది.
'ఏం వయసై పోయిందని? మళ్ళీ పెళ్ళి చేసుకోమంటే వినకుండా నా ప్రాణాలు తీస్తున్నావు' అంటుంది అమ్మ ఒక్కోసారి ఆవేదనగా.
నిజమే ముప్పై ఏళ్ళకే మొగుడిని పోగొట్టుకున్న ముప్పై ఆరేళ్ళ విధవ కూతురు సిటీలో ఉద్యోగం చేస్తూ, ఒంటరిగా ఇల్లు తీసుకుని ఉంటుంటే ఆమాత్రం భయమో మరోటో ఉండటం సహజమేగా! అతను పోయాక, తనను శరీర దాహం అంతగా ఏమీ వేధించలేదు. ఆ జ్ఞాపకాల్లోంచి బయట పడటానికే టైం పట్టింది. అవి పూర్తిగా మాసిపోయేవి కాదు. అతనితో గడిపిన జీవితం గుర్తొస్తే తన ప్రణయ జీవితం అంతటితో ఆఖరు అనిపిస్తుంది. ఏ మగాడిని చూసినా ఏ రస స్పందనలూ కలగవు. కొంతమంది నిగూఢంగా మాట్లాడి, మరి కొంతమంది వెకిలిగా ట్రై చేసి, విఫలమైన వాళ్ళున్నారు కొలీగ్సూ, బంధువులలో. వాళ్ల మీద కోపమేమీ రాదు. ఒంటరిగా ఉందని తెలిశాక, ప్రయత్నించి చూడడం విధాయకం అనుకునే వాళ్లకి తక్కువేముంది. లోకం తీరంతే కదా అనిపిస్తుంది. ఇప్పటికీ అమ్మ నెలకి రెండు సంబంధాలన్నా తీసుకొస్తుంది. అన్నీ రెండో పెళ్ళివే. 'తార' నవల్లో కుటుంబరావ్‌ అంటాడు 'మన పిల్లకు రెండో పెళ్ళి అయినపుడు ఆ వచ్చేవాడు మొదటి సంబంధమేనా అని చూస్తామటమ్మా?' అని. అలాటి పేరయ్య ఎవడో దొరికి ఉంటాడు అమ్మకి.
మాడు వాసనతో ఉలిక్కిపడి చూసింది. బ్రెడ్‌ పూర్తిగా మాడింది. తీసి డస్ట్‌బిన్‌లో పడేసి, టీ పెట్టుకుని బాల్కనీలో కుర్చీ వేసుకుని కూచుంది. చల్లని గాలి అప్పుడప్పుడు వాన తుంపర్లను కూడా మోసుకొచ్చి, మొహాన చల్లి, పోతోంది. తీగ మీద ఉన్న టవల్‌ లాగి, భుజాల చుట్టూ కప్పుకుంది. మొన్న పట్టిన ముసురు ఇంకా తగ్గలేదు. వాళ్ళని కోరుకునే ఆడవాళ్లని ఎలా పసిగడతారు వీళ్ళు? అసలు వాళ్ళు మగవాళ్ళ కోసం చూస్తున్నారని ఎలా తెలుసుకుంటారు? ఎంత ఛార్జ్‌ చేస్తాడు అతను? ఆ స్త్రీలు చెప్పినట్టల్లా వింటాడా? తనకంటే వయసులో పెద్దవాళ్లు అయితే ఒప్పుకుంటాడా? ఛ, పిచ్చి ఆలోచనలు. అతనెలా పోతే తనకెందుకు? చిల్లరగా ప్రవర్తించలేదు అతను, అది చాల్లే. రేపు దీపతో చెప్పాలి అతని సంగతి.
''ఛీ, అసలు వాడితో ఎందుకు మాట్లాడావు? వాడు ఆ సంగతి చెప్పగానే చెప్పు తీసుకోవాలి' అసహ్యంతో ఎగిరిపడింది దీప.
'అది కాదు దీపా, మనం ఒప్పుకోకపోయినా, ఇష్టపడకపోయినా ఆ వృత్తిలో మగవాళ్లు కూడా ఉంటారన్నది నిజమే కదా! వాళ్లలో ఒకడు నన్ను అప్రోచ్‌ అయ్యాడే అనుకుందాం. చెప్పు తీయడం ఎందుకూ?' విస్మయంగా చూశాను.
'మరి లేకపోతే? రమ్మని తలుపు తీస్తావా? వాడెవడో నువ్వు సింగిల్‌ అని కనిపెట్టాడు. రోజూ నీ రూమ్‌ వరకూ వస్తున్నాడో ఏంటో చూడు'.
'అలా వెంటపడి వేధించే పోకిరిలాగా లేడు దీపా. నిజాయితీగా విషయం ఇదీ అని చెప్పాడు.'
'మండినట్టే ఉంది వాడి నిజాయితీ, నీ జాలీనూ. నీ దగ్గరికి వచ్చి అలా అడుగుతాడా? ఎలాటి దానివి అనుకుంటున్నాడు?' దీపతో చెప్పి లాభం లేదు. అతను ఈ బిల్డింగ్‌లోనే వేరే ఆఫీసులో పనిచేస్తున్నాడని చెప్పాను కాదు.
'ఏంటాలోచిస్తున్నావు? ఇంకోసారి వాడు బస్టాప్‌లో కనపడితే 'షీ టీమ్‌' కి ఫోన్‌చెయ్యి. వాడు కనపడితే మాట్లాడకు. ఛీ, ఫ్రెండ్స్‌ని కూడా సజెస్ట్‌ చెయ్యమన్నాడా? సిగ్గు లేకపోతే సరి. ఏం, ఒళ్ళొంగదా? కాళ్ళూచేతులూ తిన్నగా లేవూ? పనిచేసుకు చావలేడూ? బస్తాలెత్తైనా సంపాదించాలిగానీ.. ఇదేం పనీ? యాక్‌!'
'దీపా, ఆడవాళ్ళు ఆ వృత్తిలో ఉంటే ఇలాగే మాట్లాడతామా? వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించమా?'
'రెండూ ఒకటేనా?'
'ఏం ఎందుకు కాదు.. దీపా! ఒకటి గమనించు. ఎవరో ఒక పోకిరీ మనతో మాటలు కలిపి, దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే, ఎంత చిరాకుపడతాం? ఏదో ఒక వంకతో ఎక్కడ తాకుతాడో అని హడలిపోతాం. ఇతను అలా కాదు. అది అతని ప్రొఫెషన్‌. అతను అవకాశాలను సొల్లు వాగుడుతో వేస్టు చేసుకోడు. అందుకే ప్లెయిన్‌గా మాట్లాడాడు. ఇందులో నన్ను వేధించింది ఏముంది?'
దీప ఆశ్చర్యంగా చూసింది.
'నీ మొహం. పిచ్చిగా మాట్లాడకు. రేపు బస్టాప్‌లో వాడుగానీ కనపడితే కబుర్లు చెప్పేవు. నోరుమూసుకుని క్యాబ్‌ లో పో!' చెప్పేసి, బయటకు వెళ్ళిపోయింది.
నిట్టూర్చింది.

'హారిక మేడం గారా?' అన్‌ నోన్‌ నంబర్‌ నుంచి ప్రశ్న.
'అవును, ఎవరు?'
'నేను రోహన్‌'
'రోహనా? ఎవరు? అర్థం కాలేదు'
'అదే మేడం, మొన్న బస్టాప్‌లో కనపడ్డాను కదా? అవైలబుల్‌గా ఉన్నాను అని..'
అదిరిపడింది. చెయ్యి వణికింది. నంబర్‌ ఎలా తెల్సింది? పేరు? అవన్నీ అడిగి లాభం లేదు. ఎవరైనా తెలుసుకోగలరు ఇవాళ. 'ఎందుకు ఫోన్‌ చేశారు?' కొంచెం కోపంగా అంది.
'అదే, మీరు వద్దన్నారు కదా, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సజెస్ట్‌ చేయండి. లాస్ట్‌వీక్‌ వర్క్‌ ఉండింది. కొంచెం డబ్బులు వచ్చాయి. ఊర్లో ఇల్లు కురుస్తోందని బాగు చేయిస్తున్నాం. సగంలో ఆగిపోయేలా ఉంది. అందుకే.'
ఏమనాలో తోచలేదు. ప్రమాదకరం కాదని తెలుస్తోందిగానీ, ఇలా డైరెక్ట్‌గా ఫోన్‌ చేయడం చిరాకుగా ఉంది.
'నాకలాంటి అవసరాలున్న స్నేహితులు ఎవరూ లేరండీ. నాకున్నదే కొద్దిమంది ఫ్రెండ్స్‌. బుక్స్‌, సినిమాలు, పాటలు ఇలాటివి తప్ప పర్సనల్స్‌ మాట్లాడను.'
'కిట్టీ గ్రూప్‌ లేదా మీకు? అక్కడైతే పర్సనల్‌ విషయాలు చెప్పుకుంటారు కదా!'
'నో, నేనే గ్రూపుల్లోనూ ఉండను.'
'ఓ....' అతని గొంతులో కొద్ది నిరాశ.
'మీరు కాకపోతే, ఎవరికైనా రిఫర్‌ చేస్తారనుకున్నా!'
'హలో.. మీరు చేసే పని మీకు మామూలు కావచ్చు. అందరికీ ఇది సామాన్యమైన విషయం కాదు. ఇదిగో, నా దగ్గర సినిమా టికెట్‌ ఉంది, నేను వెళ్ళట్లేదు,
నువ్వు తీసుకో.. అన్నట్టు ఈజీగా ఎవరికో రిఫర్‌ చెయ్యడానికి' గట్టిగానే అంది.
'కరెక్టే లెండి..'
'ఇంతకీ మీ ఉద్యోగం ఏంటి?'
'అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌. మీరు?'
'సీనియర్‌ ఆర్కిటెక్ట్‌' 'అబ్బ, జీతం చాలానే వస్తుందేమో కదూ!'
'ఎంతసేపూ జీతమేనా? ఇష్టమైన పనా కాదా చూడాలి.'
'ఇష్టమా కాదా అని చూసుకునే చాయిస్‌ అందరికీ ఉండదు. డబ్బు చాలా చెడ్డది. మీ దగ్గర చాలా ఉండుంటే దాని చెడ్డతనం మీకు తెలీదు.'
'ఎవరెవరు ఉంటారు ఇంట్లో?'.
అతను చెప్పడం మొదలుపెట్టాడు.

వారానికి రెండుసార్లైనా ఫోన్‌ చేస్తాడు. తన కంటే ఎనిమిదేళ్ళు చిన్నవాడని తెలిశాక కొంచెం ఫ్రీగా మాట్లాడటం మొదలు పెట్టింది. అప్పుడప్పుడు, తను ఎవరి దగ్గరకో వెళ్లి వచ్చిన సంగతి చెప్తాడు. మిగతా వివరాలన్నీ చెప్తాడేమో అని భయం వేస్తుంది. కానీ చెప్పడు.
ఎక్కువగా సినిమాలు, చుట్టూ ఉన్న మనుషులు ఇవే మాట్లాడతాడు. అతని మాటల్లో డెప్త్‌ చూస్తున్నపుడు 'ఈ పని చెయ్యకుండా ఉండుంటే ఎంత బాగుండు' అనిపిస్తుంది.
స్నేహితులమయ్యామా అని డౌట్‌ వస్తుంది ఆమెకి.
ఇంతలోనే 'ఏంటి మేడం? పిలవరా ఒక్కసారైనా?' అని నవ్వు తెప్పిస్తాడు. అతను అలా అడుగుతుంటే ఈ మధ్య భయమో జంకో కలగట్లేదు.
'ఏంటి? నిజంగానే ఒక్కసారైనా పిలవచ్చుగా'
'ఓరి దుర్మార్గుడా, మా షాప్‌లో ఒక్కసారైనా చీర కొనరా అని బట్టల షాప్‌ అబ్బాయి అడిగినట్టు అడుగుతున్నావే?'
'సీరియస్‌గానే అడుగుతున్నాను.'
'చాల్లే!' 'ఫలానా మేల్‌ సెక్స్‌వర్కర్‌ నా ఫ్రెండ్‌' అని ఆఫీస్‌లో చెప్తే? ఇంట్లో చెప్తే? వాళ్ళకి కాదు, లోకల్‌గా ఉన్న అత్తయ్యకి, పిన్నికి చెప్పాలి. ఒక్కతే మేడ మీద మూడు గదుల ఇంట్లో ఉంటూ స్వేచ్ఛగా బతుకుతోన్న తన మీద ఏదో ఒక రకంగా రాళ్ళేయాలని చూస్తోంది వాళ్ళే. 'మొగుడెలాగూ లేడు కదా, ఇహ దాన్నెవడు అడ్డుకుంటాడు? ఫ్లాట్‌ ఏదైనా తీసుకోమంటే ఒద్దంది. ఇంటికి ఎవరెవరు వచ్చి, పోతున్నారో ఫ్లాట్‌ అయితే తెలుస్తుంది. అందుకే ఒక ముసలి జంట ఉంటున్న ఇంటిని వెదికి పట్టుకుని పై వాటాలో ఉంటోంది' అని అత్తయ్య ఎవరితోనో అన్న సంగతి అమ్మకి తెల్సింది. తనకి చెప్పి ఏడుపు.
'పోనీ నువ్వు రామ్మా, నాతో ఉందువుగానీ' అంటే రాదు.
'అన్నయ్య వాళ్లని వదిలి.. వచ్చి నీ దగ్గరుంటే అందరూ ఏమనుకుంటారు?'
అలాగని బాధపడకుండా ఉండదు.
'అమ్మా, నా గురించి నువ్వు వర్రీ అవకు. నేను హాయిగా ఉన్నా. నాకు పెళ్ళి గురించి ఇప్పుడు ఆలోచన ఏదీ లేదు. ఎవరేమనుకున్నా నాకు పర్లేదు. నువ్వు కూడా వాళ్ల మాటలు పట్టించుకోకు' అంటే వింటుందా?
పిల్లలు ఎంత పెద్దయినా తన బాధ్యతే అనుకునేదే కదా అమ్మంటే.
రోహన్‌తో ఫోన్‌ కాల్స్‌ మామూలై పోయాయి. మొన్నా మధ్య చెప్పాడు. ఈ మధ్య కొంచెం పర్లేదట తన సంపాదన. కానీ ఇంకా ఎక్కువ సంపాదిస్తేగానీ ఇంటి కష్టాలు తీరవట.
'వాళ్లతో నువ్వెలా ఉంటావు? ఇష్టంగా ఉంటావా?' అని అడగాలనిపించింది ఒకసారి.
కానీ ఇలాటి ప్రశ్నలు వేస్తే అది ఏ చనువుకి దారితీస్తుందో అని ఎక్కడో పీకింది. నిజంగా అతను ఎప్పుడో ఒకసారి తను పిలుస్తుందనే అనుకుంటున్నాడా? తల విదిల్చింది.

రాత్రి పదవుతోంది. వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు.
జ్వరం నూట నాలుగు. గొంతు తడారిపోతోంది. కళ్ళలో నిప్పులు మండుతున్నట్టు వేడి, మంట. ఒళ్ళంతా కాలిపోతూ ఆవిర్లు లేస్తోంది. అప్పటికి మూడు వాంతులయ్యాయి. కళ్ళు తిరిగి పోతున్నాయి. ఆంటీ వాళ్ళు కూతురు ఇంటికి చెన్నై వెళ్ళారు. మంచం మీద నుంచి లేవాలంటే వీలు కావడం లేదు. కాళ్ళు వణికి పోతున్నాయి. మంచం పక్కనే ఉన్న వాటర్‌ బాటిల్‌ ఖాళీ అయిపోయింది గానీ లేచి వెళ్ళి తెచ్చుకోవాలంటే కూడా ఓపిక లేదు. కళ్ళ ముందు చుక్కలు, గీతలు కనిపిస్తున్నాయి.
దీప ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. ఫోన్‌లో ఛార్జింగ్‌ 20% మాత్రమే ఉంది. కరెంట్‌ లేదు. 108 కి కాల్‌ చేస్తే? ఎవరు వస్తారు తనతో పాటు? తల తిరిగిపోతోంది. అమ్మకి ఫోన్‌ చేస్తే? కంగారు పడిపోతుంది. పిన్నికో, అత్తయ్యకో ఫోన్‌ చేసి, పంపిస్తుంది. వాళ్ళ నీడ కూడా తన మీద పడకూడదు. దిక్కు లేని చావు చచ్చినా పర్లేదు. గుండెలో ఏదో అయిపోతోంది. మళ్ళీ వాంతయ్యేలా ఉంది. కడుపులో నొప్పి. ఫోన్‌ తీసి రీసెంట్‌ డయల్డ్‌ నంబర్స్‌ చూస్తూ రోహన్‌ పేరు దగ్గర ఆగిపోయింది చూపు. ఫోన్‌ చేస్తే? ఏమనుకుంటాడు? మెదడులో ఏదేదో జరుగుతోంది. ఆలోచనలు ప్రాసెస్‌ కావడం లేదు. కళ్ళ ముందు వలయాలు తిరుగుతున్నాయి. కాసేపట్లో తను స్పృహ తప్పుతుంది. లేక.. చచ్చిపోతుందా? ఏం చెయ్యాలి? అయ్యో, వాట్సప్‌ కాల్స్‌ చూస్తోంది తను. ఎలా?
రోహన్‌ ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసింది. కష్టం మీద లొకేషన్‌ షేర్‌ చేసింది. 'కెన్‌ యూ ప్లీజ్‌ కమ్‌, ఐ యాం నాట్‌ వెల్‌. ఇట్స్‌ అర్జెంట్‌..' ఇదంతా టైప్‌ చేయాలనుకుంటోంది. చేతులు వణికిపోతున్నాయి. వేళ్లు సహకరించడం లేదు.
'కమ్‌ ప్లీజ్‌' అని మాత్రం టైప్‌ చేయగలిగింది. అది కూడా తప్పులతో. టైప్‌ చేస్తుండగానే భళ్ళున వాంతి తోసుకు వచ్చింది. ఫోన్‌ చేతిలోంచి జారిపోయింది.
మరో నిమిషంలో ఫోన్‌ మోగింది. మోగుతున్న ఫోన్‌ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుండగా, కళ్ళ ముందు చీకట్ల్లు కమ్మాయి. స్పృహ తప్పింది.

'రాత్రి పదింటికి, అదీ చల్లగా వర్షం పడుతున్న వేళ మీ నుంచి ''కమ్‌ ప్లీజ్‌'' అనే మెసేజ్‌ చూసి, ''అబ్బ, ఇన్నాళ్లకి మేడమ్‌ పిలిచింది'' అని గబ గబా తయారై వచ్చానా? వాంతులు చేసుకొని, అందులో పడిపోయి ఉన్నారు మీరు. చాలా భయం వేసింది. ఏదైనా మింగారా ఏంటి అనుకున్నాను ముందు. కేసవుతుందా అని కూడా ఆలోచించాను'
రోహన్‌ మాటలు వింటుంటే నవ్వొచ్చింది. నవ్వబోతే దగ్గు తెర అడ్డుపడింది.
'దుర్మార్గుడా' అంది దగ్గును తప్పించుకుంటూ అంది.
'నిజంగానే.. తెల్సా? బైటికిపోతే ఆటోలు లేవు, ఎలాగో ఒకడిని పట్టుకుని ఆస్పత్రికి రమ్మంటే వంద ప్రశ్నలు వేశాడు. ఏమవుద్ది ఈమె మీకు? ఏం చేశారు? కొట్టారా? కేసవుద్దా? నేన్రాను.. అంటాడే. మీరేమో తొందరగా ఆస్పత్రికి తీసుకుపోకపోతే పైకి పోయేలా ఉన్నారు. ష్ష్‌.. అబ్బ తల ప్రాణం తోకకి రావడమంటే ఇదే. మేడం రమ్మంది ఇంతే చాలు, ఇవాళ ఐదు వేలైనా జేబులో పడ్డట్టే అని పరిగెత్తుకు వస్తే.. అబ్బ, ఎంత టెన్షన్‌ పెట్టారో! నవ్వూ ఏడుపూ రెండూ వచ్చాయి. ఎలా ఉంది ఇప్పుడు? ఈ టాబ్లెట్‌ ఇపుడు టిఫిన్‌ తిన్నాక వేసుకోమన్నారు డాక్టర్‌' రేపర్‌ తీసి ఇచ్చాడు.
'బిల్లు కట్టేసాక, డెబిట్‌ కార్డు జాగర్తగా పెట్టారా?' అంటున్నాడు తలగడ సర్దుతూ.
కళ్లలో నీళ్ళు వస్తున్నాయి. తుడుచుకోవాలనిపించలేదు.
పర్సులోంచి డెబిట్‌ కార్డ్‌ తీసి అక్కడ పెట్టింది.
'చాలా థాంక్స్‌ రోహన్‌. నువ్వు రాకపోతే చచ్చిపోయి ఉండేదాన్నేమో తెలీదు. సెలవు పెట్టి మరీ ఈ మూడురోజులూ నాతో ఉన్నావు. ఏమనుకోకుండా, డబ్బు తీసుకో' మాటలు కష్టపడి, కూడబలుక్కుని పేర్చింది.
నవ్వాడు. 'అవసరంలో మీరున్నారని సాయం చేశాను గానీ, ఆదుకున్న సాయానికి డబ్బు ఛార్జ్‌ చేసే మనిషిని కాదు. సమయానికి నేను విలువ కట్టే క్షణాలు వేరే ఉంటాయి. బహుశా అవి మన మధ్య రావు.' కార్డు తీసి పర్సులో పెట్టేసి, మంచినీళ్ళు తేవడానికి లేచాడు.

సుజాత వేల్పూరి
Svelpuri28@gmail.com