Sep 24,2023 08:22

మా అస్థిత్వం గురించి
మాకు బెంగేలేదు
సాటి మనిషిగా
మమ్ము చూడనందుకే
ఒక్కోసారి కలత చెందుతాం
ఊరికి దూరంగా
విసిరేసినట్టు మా గుడిసెలు
మట్టిబతుకులు మావి
అయితే మాత్రం
మేమూ మనుషులమే కదా
ఎందుకీ కుల వివక్ష
ఎందుకీ అంటరానితనం
అంటరానితనమని
మా వెంట రానోడే..
వాడూ మనిషేనా
ఏమో వాళ్ళకే తెలియాలి
ఎదిగే క్రమంలో
ఎన్ని అవమానాల ముళ్ల కంచెలను
దాటామో
మాకు అన్నీ గురుతే
మాకు దక్కవలసినవి బుక్కినోళ్ళు
పందికొక్కుల్లా బలిసినోళ్ళను చూసి
ఆక్రోశం స్థానే జాలి కలిగేది
హేళనల కొలిమిలో మంట గలిసిన
మా గౌరవ మర్యాదలను తలుసుకుని
కుంగి కుశించుకుపోము
పడిలేచే కెరటం మా ఆదర్శం
అంబేద్కర్‌, జాషువాలు
మా స్ఫూర్తి ప్రదాతలు
విద్యలో ఒక్కో మెట్టు ఎక్కుతాం
పీడిత అణగారిన వర్గాల
ఆత్మగౌరవం ప్రోది చేస్తాం
నవ్విన నాప చేను
పండించి చూపుతాం
అహంకారపు ధృతరాష్ట్రుల
కళ్ళు తెరిపిస్తాం
మేమూ సాటి మనుషులే అనిపిస్తాం
అందరూ సమానులేనని రుజువు చేస్తాం
ఆ భరతమాత సుతులేనని నిరూపిస్తాం
మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాం
మా అస్థిత్వం మాత్రం
మేమెప్పుడూ మరిచిపోం

- గాదిరాజు రంగరాజు
87901 22275