
జైపూర్ : వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 33 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ సర్దార్‌పురా నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోనక్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి జోషి నాథద్వారా అసెంబ్లీ నియోజకవర్గం, ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా.. లచ్మాన్‌గఢ్ నుంచి పోటీకి దిగారు.
కాగా, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కి, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్‌కి మధ్య విబేధాలు ఉన్నాయి. అయితే ఈ విబేధాలు ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని ఆ పార్టీ శ్రేణులతోపాటు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడతామని, గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రిని ఎంచుకోవడం జరుగుతుందని గత నెల్లో సచిన్ పైలట్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడనున్నాయి.