Jan 20,2023 06:57

            కరోనా మహమ్మారి పర్యవసానంగా పిల్లల అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావితమైందని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (అసర్‌ నివేదిక) నిర్ధారించింది. ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ 2018 తరువాత 2022లో మూడు నుండి పదహారేళ్ల మధ్య వయసున్న బాల బాలికలను దేశవ్యాప్తంగా శాంపిల్‌ సర్వే నిర్వహించి ఆ నివేదికను బుధవారంనాడు వెల్లడించింది. దేశమంతటా 616 జిల్లాల్లోని 19 వేల గ్రామాల్లో ఏడు లక్షలమంది బాల బాలికల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. అంధ్రప్రదేశ్‌లో 390 గ్రామాల్లో 7760 కుటుంబాలకు చెందిన 12950 మందిని సర్వే చేశారు. పాఠశాల విద్యలో కీలకమైన తెలుగు (మాతృభాష), ఇంగ్లీషు, లెక్కలు ఈ మూడింటిలో విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాన్ని పరిశీలించారు. ఇంత భారీ శాంపిల్‌తో చేపట్టే ప్రథమ్‌ సర్వే, దాని ప్రాతిపదికగా వెల్లడించిన నివేదిక ఎంతో ప్రామాణికమైనవి. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూతపడడంవల్ల అభ్యసనంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. బాల బాలికల అభ్యసనా సామర్ధ్యం చదవడంలోనూ, లెక్కలు (కూడిక, తీసివేత, గుణించడం, భాగించడం)లోనూ 2012 స్థాయికి దిగజారింది. కచ్చితంగా ఒక దశాబ్ద కాలంపాటు వెనక్కు పోయామంటే కరోనా మహమ్మారి దెబ్బ తీవ్రత ఎంతలా ఉందో విశిదమవుతోంది. ట్యూషన్లకు వెళ్లే విద్యార్థుల శాతం ఈ కాలంలో 26.4 శాతం నుండి 30.5 శాతానికి పెరిగింది. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఇది ఒకేమాదిరిగా ఉందంటే పిల్లలు బడిలో నేర్చుకున్నది చాలడంలేదన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగిందన్నమాట. ఏమాత్రం స్తోమతున్నా ట్యూషన్లకు పంపుతున్నారు. అయితే ఆరు నుండి పధ్నాలుగేళ్ల మధ్య వయసున్న పిల్లలు పాఠశాలలో నమోదు శాతం 2018లో 97.2 నుండి 2022 నాటికి 98.4 శాతానికి పెరగడం ఊరట కలిగించే విషయం. అలాగే గడచిన నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం 65.6 నుండి 72.9కి పెరగడం మంచిదే! అయితే, ఆర్థిక భారం భరించలేక తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మార్చామని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. ఈ కాలంలో విద్యార్థుల హాజరు శాతం మార్పు లేకపోయినా ఉపాధ్యాయుల హాజరు 85.4 శాతం నుండి 87.1 శాతానికి పెరగడం గమనార్హం.
      మానవాభివృద్ధి సూచికల్లో ముందున్న కేరళ రాష్ట్రం అసర్‌ నివేదికలోనూ అనేక విషయాల్లో మెరుగైన స్థానంలో ఉంది. దేశమంతటా 60 మందికన్నా తక్కువ మంది విద్యార్థులుండే పాఠశాలల సంఖ్య పెరుగుతూ వస్తుంటే కేరళలో అది తగ్గుతోంది. దేశానికి అభివృద్ధి నమూనాగా ఊదరగొట్టిన గుజరాత్‌, విద్యారంగంలో మత విద్వేషాలను పెంచుతున్న కర్ణాటక పరిస్థితి అధ్వానంగా ఉంది. దేశమంతటా తాగు నీటి వసతి గల పాఠశాలల శాతం ఈ నాలుగేళ్లలో 58.1 శాతం నుండి 65.6 శాతానికి పెరగ్గా గుజరాత్‌లో 88 నుండి 71.8కి, కర్ణాటకలో 76.8 నుండి 67.8 కి దిగజారడడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే కొంత ఖేదం ఇంకొంత మోదం అన్నట్టుంది. నాడు-నేడు వంటి పథకంవల్ల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అయితే, వాటి వినియోగం విషయంలో కొన్ని లోపాలున్నాయి. అమ్మ ఒడి పథకంతో పిల్లల నమోదు శాతం పెరగడంతోపాటు హాజరు శాతంలోనూ మార్పుంది. అయితే, అభ్యసన సామర్ధ్యంలో అంత పెంపుదల లేదు. దేశవ్యాప్తంగా తగ్గినట్టే ఇక్కడా తగ్గుదలే నమోదయింది. ఇంగ్లీషు మీడియం గురించి ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా ఆచరణలో అంతగా లేదు. మూడు అక్షరాలున్న బస్‌, ఫ్యాన్‌ లాంటి పదాలను మూడో తరగతి విద్యార్థుల్లో 24.3 శాతం మంది చదవలేని పరిస్థితి నెలకొంది. ఒకటో తరగతి వాచకంలో ఉన్న తెలుగు వాక్యాన్ని ఐదో తరగతి విద్యార్థుల్లో 28 శాతం మంది చదవలేకపోవడం పరిస్థితికి దర్పణం పడుతోంది. 'దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న' కొఠారీ కమిషన్‌ వ్యాఖ్య అక్షర సత్యం. పాలకులు, విధాన రూపకర్తలూ ఈ విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. అసర్‌ నివేదికను హెచ్చరికగా పరిగణించి వివిధ స్థాయిల్లోని లోటుపాట్లను అధిగమించడానికి కృషి చేయాలి.