Mar 26,2023 08:16

ఉగాది అనగానే వేపపువ్వు పూసే కాలం. వేపపువ్వును మనం ఉగాదిరోజు పచ్చడి చేసుకోవడానికి మినహా ఇంకేమీ చేయం. కానీ ఈ వేపపువ్వులో ఎన్నో పోషకాలున్నాయి. అయితే ఈ కాలంలో పూసే పువ్వును సేకరించి పెట్టుకుంటే ఎన్నో వెరైటీ రుచులను ఆస్వాదించవచ్చు. చేదుగా ఉందనుకోవద్దు.. కానీ కాకరకాయలు చేదుగున్నా మనం తినడం లేదు. అలాగే.. మరి వేపపువ్వుతో వెరైటీగా ఏమేమి చేయొచ్చో, ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

  • కూర

కావల్సినవి : వేపపువ్వు - కప్పు (తాజా/ఎండబెట్టినది), నెయ్యి, నూనె - రెండు స్పూన్స్‌, ఉప్పు, కారం, పసుపు - తగినంత, పచ్చిమామిడికాయ ముక్కలు కప్పు, టమాటా - ఒకటి, ఉల్లిపాయ ముక్కలు - కప్పు, పచ్చిమిర్చి -రెండు, ఎండుమిర్చి -రెండు. ఇంగువ -తగినంత, వెల్లుల్లి రెబ్బలు -4, కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా, తాలింపు గింజలు - స్పూన్‌.
తయారీ: ముందుగా స్టౌవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి, వేడెక్కాక నెయ్యి, నూనె వేయాలి. వేడెక్కాక తాలింపు గింజలు వేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, వేపపువ్వు, ఇంగువ, పసుపు, ఉప్పు, కారం ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఇవి కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసి బాగా కలిపి, మగ్గనివ్వాలి. చివరిలో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి. అవి మగ్గాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని కలిపి, దింపేసుకోవాలి. అంతే మామిడికాయ వేపపువ్వు కూర రెడీ. వేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతుంది.
గమనిక : మామిడికాయ బదులు, వంకాయ, బంగాళదుంప తదితర కూరగాయలతో కలగలిపి వండుకోవచ్చు.
మీకోసం : ఈ కాలంలో వచ్చే పువ్వును సేకరించి, పువ్వంత వలుచుకుని, చిల్లుల గిన్నెలో వేసి శుభ్రం చేసుకుని ఒక పొడి వస్త్రంపై నీడలోనే ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయాక ఒక గాజు సీసాలో భద్రపరచుకుని, ఏడాదంతా వాడుకోవచ్చు.

  • పొడి..
podi

కావల్సినవి : వేపపువ్వు - కప్పు (ఎండబెట్టినది), పొట్టు పెసరపప్పు - కప్పు, ఉప్పు, కారం - తగినంత, జీలకర్ర - స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - కప్పు, ధనియాలు - స్పూన్‌.
తయారీ: ముందుగా స్టౌవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి, వేడెక్కాక పొట్టు పెసరపప్పు వేసి దోరగా, కమ్మటి వాసన వచ్చేలా వేపుకోవాలి. దానిలోనే జీలకర్ర, ధనియాలు వేసి మరికాసేపు వేపుకోవాలి. ఇది చల్లారక, మిక్సీ జార్‌లో వేసి, తగినంత ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఒక గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అంతే వేపపువ్వు పెసరపొడి రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని కలిపి తింటే భలే ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.

  • వేపుడు
vepa

కావల్సినవి : వేపపువ్వు - కప్పు (తాజా/ఎండబెట్టినది), నెయ్యి - స్పూన్‌, ఉప్పు - తగినంత
తయారీ: ముందుగా స్టౌవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి, వేడెక్కాక నెయ్యి వేసి దానిలో వేపపువ్వు వేసి కొద్దిగా వేపుకోవాలి. దానిలో ఉప్పు వేసి మరికాసేపు వేపాలి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

  • చారు
vepa

కావల్సినవి : వేపపువ్వు - రెండు స్పూన్లు (తాజా/ఎండబెట్టినది), నెయ్యి, నూనె - రెండు స్పూన్‌, ఉప్పు, పసుపు - తగినంత, చింతపండు గుజ్జు - స్పూన్‌, నీళ్లు - రెండు గ్లాసులు, బెల్లం - తగినంత. తాలింపు గింజలు - అర స్పూన్‌, ఎండుమిర్చి - రెండు లేదా మూడు, ఇంగువ - తగినంత. కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ: ముందుగా స్టౌవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి, వేడెక్కాక నెయ్యి, నూనె వేయాలి. అది కాగేలోపు ఒక గిన్నె తీసుకుని, అందులో నీళ్లు, చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం వేసి కలుపుకోవాలి. నూనె కాగాక, తాలింపు గింజలు వేసి, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేయాలి. దీనిలో కలిపి పెట్టుకున్న చారు మిశ్రమాన్ని పోయాలి. దీనిలో పసుపు, ఉప్పు కూడా వేసి కొద్దిగా మరగనివ్వాలి. ఈ లోపు మరో చిన్న గిన్నె తీసుకుని అందులో స్పూన్‌ నెయ్యి వేసి దానిలో వేపపువ్వు వేసి, సన్న సెగ మీద వేగనివ్వాలి. రసం కట్టేస్తామనుకున్నప్పుడు ఈ వేగిన వేపపువ్వు వేసి కలపి, మూతపెట్టి, స్టవ్‌ ఆపేయాలి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కూడా.