
మహిళా రెజ్లర్లపై రాజధాని ఢిల్లీ వీధుల్లో పోలీసుల కిరాతకం బిజెపి ప్రభుత్వ నిరంకుశానికి పరాకాష్ట. మన ప్రజాస్వామ్యానికి దేవాలయంగా అభివర్ణించే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లకు సర్కారీ అణచివేత సంప్రాప్తించింది. తమను లైంగికంగా, మానసికంగా వేధించిన బిజెపి పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోమనడమే రెజ్లర్లు చేసిన నేరం. బ్రిజ్ భూషణ్‌పై చర్యల కోసం ఐదు వారాలుగా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. మోడీ సర్కారు స్పందించకపోవడంతో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంనాడు 'మహిళా మహా పంచాయత్'కు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌కు మార్చ్‌గా వెళుతున్న రెజ్లర్లను పోలీసులు బలవంతంగా అడ్డుకొని మహిళలని కూడా చూడకుండా రోడ్లపై ఈడ్చిపారేశారు. ఎక్కడికక్కడ బస్సుల్లోకి ఎత్తిపడేసి వాహనాల్లో కుక్కి పోలీస్‌స్టేషన్లకు తిప్పారు. అరెస్టులు చేశారు. ఆనక అక్రమ కేసులు బనాయించారు. బిజెపి ప్రభుత్వ పైశాచికంపై వినేశ్ ఫొగాట్ వంటి వారు కన్నీరు పెట్టుకున్నారు. రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలకు చెందిన మహిళా నేతలను, రైతు నాయకులను ఢిల్లీ సరిహద్దులు మూసేసి మరీ అడ్డుకున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షునిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్నది అభియోగం. అటువంటి ఆరోపణలొచ్చిన వెంటనే బాధ్యత గల ప్రభుత్వమేదైనా దర్యాప్తు చేసి నిందితుడిని శిక్షించాలి. తమకు న్యాయం చేయాలని ఏప్రిల్ 23 నుంచి రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. దోషి బ్రిజ్ భూషణ్ పార్లమెంట్‌లో ఎంచక్కా ఎం.పి. హోదాలో అధికార దర్పం వెలగబెడుతుండగా, దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులు రోడ్డున పడ్డారు. రెజ్లర్ల పోరాటానికి వివిధ వర్గాల నుంచి క్రమేపి మద్దతు పెరుగుతోంది. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ 1,150 మందికిపైగా మేధావులు ప్రధానికి లేఖ రాశారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా రైతులు నిర్వహించిన వీరోచిత పోరాటం మాదిరి రెజ్లర్ల ఆందోళన రూపుదిద్దుకుంటుండటంతో మోడీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఫలితమే ఆదివారంనాటి ఉక్కుపాదం. జంతర్‌మంతర్ వద్ద దీక్షా శిబిరాన్ని పోలీసులు కూల్చేశారు. కాగా ఎంతగా నిర్బంధం అమలు చేసినా తమ పోరాటం ఆగదని రెజ్లర్లు ప్రకటించి మొక్కవోని దీక్ష కనబర్చడం అభినందనీయం.
పార్లమెంట్ ప్రజల ఆకాంక్షలకు, కలలకు ప్రతిబింబంగా పేర్కొన్నారు ప్రధాని. అదే పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోనే మహిళా రెజ్లర్లపై పోలీస్ దౌర్జన్యకాండ సాగడం ప్రజల ఆకాంక్ష అవుతుందా? ప్రజాస్వామ్యంలో నిరసనలు, ప్రజలు ప్రభుత్వంపై తమ అభిప్రాయం తెలిపే ఒకానొక రూపం. మన రాజ్యాంగం పౌరులకు నిరసన తెలిపే హక్కు కల్పించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చింది. మహిళా రెజ్లర్లు తమను వేధించిన ఎం.పి.ని అరెస్టు చేయమంటుండగా, నిందితుడిని పార్లమెంట్‌లో మోడీ తన పక్కన కూర్చోబెట్టుకొని, న్యాయం అడిగిన వారిపై పోలీసులను ఉసిగొల్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ భవనాన్ని సనాతన హిందూ సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. మోడీ గణం ఆచరించే మనుధర్మం పురుషులకు స్త్రీలు బానిసలంటుంది. ఆ కోవలోనే రెజ్లర్లను లైంగికంగా వేధించే హక్కు బ్రిజ్ భూషణ్‌కు దఖలు పర్చినట్లుంది. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం చెల్లదు. రెజ్లర్ల ఆందోళనపై పోలీస్ దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. రెజ్లర్లకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ పని చేయకపోతే ప్రజాస్వామ్యం గురించి మోడీ సర్కారు చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లుగానే భావిస్తారు.