Oct 08,2023 11:30

ఈ కాలంలో బాగా పెరిగే మొక్కల్లో తుమ్మికూర ఒకటి. తుమ్మి ఆకు నుంచి వేరు వరకూ అన్నీ ఔషధ గుణాలే. అందుకే దీన్ని ఆయుర్వేద మందుల్లో వాడతారు. వీటి ఆకులను కూరగా వండుకొని తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తుమ్మి మొక్కలకు చివర్లలో బంతిలా ఉండి అందులో నుంచి తెల్లని శంకు ఆకారంలో పువ్వులు పూస్తాయి. ఇవి చాలా సువాసనతో, వగరుగా ఉంటాయి. వీటన్నింటితో దీన్ని తేలికగా గుర్తించవచ్చు. ఇవి జలుబు నుంచి స్త్రీలలో గర్భాశయ సమస్యలను తగ్గించే సుగుణం గల మొక్క. తుమ్మ పూలరసం 15 చుక్కలు, తేనె 15 చుక్కలు కలిపి తీసుకుంటే దాహార్తి, నీరసం, అలసట తగ్గుతాయి. గుప్పెడు పూలను సగం గ్లాసు పాలలో వేసి, గంట నానబెట్టి తీసుకుంటే గొంతునొప్పి, ఇన్ఫెక్షన్ల సమస్యలు తగ్గుతాయి. తుమ్మి ఆకుల రసాన్ని స్పూన్‌ తీసుకుంటే మైగ్రేన్‌ తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంత మంచి తుమ్మిని మన ఆహారంగానూ వాడుకోవచ్చు. తుమ్మితో ఏమేమి చేయొచ్చో, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

పప్పు..

1

కావలసినవి : తుమ్మి ఆకుకూర -కప్పు, చిన్న చింతకాయలు - గుప్పెడు, కందిపప్పు -కప్పు, పచ్చిమిర్చి - పది కాయలు, వెల్లుల్లి -10 రెబ్బలు, పసుపు- స్పూన్‌, ఉప్పు- తగినంత, నూనె- రెండు స్పూన్ల్‌, తాలింపు గింజలు (జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు)- స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు.
తయారీ : కుక్కర్లో కందిపప్పు, తుమ్మికూర, పసుపు, కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చి వేసి పొయ్యి మీద పెట్టాలి. రెండు విజిల్స్‌ వచ్చాక దించాలి. అందులో దంచిన చింతకాయల పేస్ట్‌, ఉప్పు వేసి కలపాలి. బాండీలో నూనె పోసి, వేడి చేయాలి. తాలింపు గింజలు, చిన్న ఉల్లి రెమ్మలు, కరివేపాకు వేసి వేయించాలి. వెంటనే పప్పు వేసి, కాసేపు ఉడకనివ్వాలి. అంతే తుమ్మికూర పప్పు రెడీ.

కూర..

1

కావలసినవి : తుమ్మికూర -కప్పు, పచ్చి చింతకాయలు - గుప్పెడు (లేదా) టమాటాలు - రెండు, ఉల్లిపాయ- ఒకటి, ఆవాలు, జీలకర్ర- స్పూన్‌, కారం- స్పూన్‌, ఉప్పు- తగినంత, పసుపు- స్పూన్‌, నూనె- మూడు స్పూన్లు.
తయారీ : కళాయి పొయ్యి మీద పెట్టి, నూనె పోసి వేడి చెయ్యాలి. ఆవాలు, జీలకర్ర వెయ్యాలి. చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు (కొంచెం పెద్దగా కట్‌ చేసుకుని) వెయ్యాలి. నిమిషం పాటు వేయించి, టమాటా ముక్కలు వేయాలి. అవి మగ్గాక తుమ్మికూర వేసి కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. దీని కలుపుతూ నీరంతా ఇగిరే వరకూ, పది నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే తుమ్మి కూర రెడీ.

పచ్చడి..

1

కావలసినవి : తుమ్మికూర -కప్పు, చింతకాయ ముక్కలు- కప్పు, పచ్చిమిర్చి ముక్కలు- అర కప్పు, ఎండుమిర్చి- ఐదు, వెల్లుల్లి - 10 రెబ్బలు, జీలకర్ర- స్పూన్‌, మెంతులు- స్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు-తగినంత, పసుపు- అర స్పూన్‌, నూనె- మూడు స్పూన్లు,
తయారీ : బాండీ పొయ్యి మీద పెట్టి, నూనె పోయాలి. వేడయ్యాక మిర్చిముక్కలు వేసి వేయించాలి. అందులోనే చింతకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. వీటిని ప్లేట్లోకి తీసి, అదే నూనెలో తుమ్మికూర, ఇంగువ వేసి వేయించాలి. మరొక బాండీలో ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు విడివిడిగా వేసి, వేయించాలి. ఈ మిశ్రమంలో పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత మిర్చి, చింతకాయ ముక్కలు, తుమ్మికూర, వెల్లుల్లి రెబ్బలు వేసి, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే పుల్ల పుల్లగా తుమ్మికూర పచ్చడి రెడీ.