
కథలన్నీ కంచికే చేరువ అవుతాయా..! మన జీవితంలోని కథలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నట్టు..! నిజమే కదా..! కథ అంటే ఊపిరి, ఆశ, మార్పు, కదలిక, జీవనం, నడత, ఆ తర్వాత అన్ని కథలూ కంచికి చేరాల్సిందే..! అయితే పుట్టుకకు - చావుకు మధ్య సాగిన వాస్తవ కథనాలే ఈ 'మంచు కింద ఉక్కపోత' కథా సంపుటి పుస్తకం. మనిషికో కథ, మనసుకో వ్యథ అంటాడు మహాకవి. రచయిత డా|| జడా సుబ్బారావు ఎంచుకున్న కథా వస్తువులన్నీ ఆనాటి నుండీ ఈనాటి వరకూ రకరకాలుగా పట్టి పీడిస్తున్న తీరని వెతలే. సమాజంలో మన చూట్టూ సాగే కథనాల్ని ఎంచుకొని, వాటిని పాఠకుల దృష్టిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నం సఫలం అనే చెప్పవచ్చు. మనిషిలో బలహీనతల్ని మార్చుకోవచ్చు. కానీ ఆలోచనల్లో తలెత్తే బలహీనతల్లో మార్పు చేసుకోకపోతే, అందుకు కనీసంగా కూడా ప్రయత్నించకపోతే జరిగే దారుణ పరిణామాలు అంతా ఇంతా కావు అని ఈ పుస్తకంలోని కథల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
రాకెట్ స్పీడ్‌లో ఒకపక్క శాస్త్ర, సాంకేతికత దూసుకుపోతున్న కాలంలోనూ 'దేవుడి భార్య' కథలో ప్రభుత్వ అధికారి అయిన అరుణాచలంలో దేవమ్మ చేసే ఒక్కో సంభాషణ.. సమాధానంగా దేవమ్మ అధికారితో చెప్పిన ప్రతి మాట వాస్తవం, అత్యంత దయనీయం. నేటికీ అనేక ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిస్థితులు ఇలానే ఉన్నాయనడం ఎంతో బాధాకరం. ఈ కథలో నేటి మన సమాజం ఎంత వెనుకబడి ఉందో చెప్పకనే చెప్పారు రచయిత. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా నేటికీ మంచినీళ్లు తాగేందుకు స్వేచ్ఛలేని పరిస్థితుల్ని, కరుణ, జాలి వంటివి మచ్చుకయినా కనపడని ఆ ముసుగు రాజకీయ స్థితిగతులు 'దాహం' కథలో పాఠకులను కలచివేస్తాయి. సమస్య చూపడమే కాదు, అందుకు పరిష్కారం ఉంటే ఏవిధంగా ఉండాలో కూడా తమదైన శైలిలో మలచినదే 'రసం పీల్చే పురుగులు' కథ. ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడాలనేది ఈ కథలో ఎదురైన అంశాల చుట్టూ ఆ కథనాన్ని మలచిన తీరు బాగుంది. కథా సంపుటి కావడం వల్ల కాబోలు రకరకాల మాండలికాల్లో రాసిన కథలు ఇందులో చదవొచ్చు. ప్రకృతి సహకరిస్తే ఎన్ని ఉపయోగాలున్నాయో మనిషికి మనిషి సహకరించుకోకపోతే వచ్చే భయంకర అనర్థాలూ అంతే..! అలాగే, వయసులో ఉన్నప్పుడు వాస్తవాలకూ, ఊహలకూ మధ్య జరిగే సంఘర్షణలు.. అందుకు దారితీసే తీరు తెన్నులు 'భ్రాంతిమదం' నొప్పించకుండా చెప్పిన తీరు పరిశీలించ తగినదే.
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభించిన తీరు 'వలస కూలీలు' కథలో.. తమ వారికి ఏవిధంగా దూరమయ్యారో, ఆ సమయంలో తమవారి కోసం ఎదురుచూపులు చివరకు నిశ్శబ్దం అలముకొన్న తీరుతెన్నులు, అచేతనంలో మనిషి కూరుకుపోయిన ఆ పరిస్థితుల్ని చూడవచ్చు. 'మంచుకింద ఉక్కపోత', 'బతుకు వేట', 'గుండెలో తడి' 'వెలి' వంటి కథలే కాదు.. ఏ ఒక్క కథా మొక్కుబడిగా అనిపించదు. సమాజం పట్ల బాధ్యత, కఠినమైన వాటిని సైతం సున్నితంగా చెప్పేందుకు రచయిత పడ్డ కృషి ప్రతి కథలోనూ తారసపడుతుంది.
బేతాళ కథల్లో సమాధానం తెలిసీ చెప్పకపోతే బుర్ర వెయ్యిచెక్కలు అయిపోతుందని చదువుకున్నాం. ఆ చందంగా.. సమాజంలో నిలిచే వివక్షాపూరిత ధోరణులు తలెత్తినప్పుడు ఎదురైన కథలకు పరిష్కారమార్గాన్ని కూడా రచయిత స్వీయాక్షరాలతో తెలిపి ఉంటే బాగుండునని అనిపించింది. రచయిత రాసిన కథల్లో.. కళ్లు చెమ్మగిల్లడం, గుండె తరుక్కుపోవడం, చీకటిలోకి కూరుకుపోవడం, అగాథంలోకి నెట్టిన, నెట్టబడిన దురాచారాల దుస్థితిని మానవీయ కోణంతో చూడవచ్చు.
ఇందులో కూర్చిన కథల వరకూ ఆలోచింపజేసేవిగా, చదివింపజేసేవిగానే ఉన్నాయి. నేటి రాజకీయ, సామాజిక, జీవన స్థితిగతులు మరింత దారుణంగా దిగజారిపోతున్న క్రమం ఒకపక్క అయితే, మరోపక్క యువతను రకరకాల మత్తులోపడి, పక్కతోవ పట్టించే, అనేక అంశాలు మరోవైపు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, భయబ్రాంతులకు గురిచేసే సమస్యలను మరిన్ని అంశాలుగా ఎత్తుకొని.. ప్రధానంగా యువతను ఆలోచింపజేసే కథా వస్తువులు రచయిత కలం నుండి మరిన్ని జాలువారాలని కోరుకుందాం.
- వర్థని
9490099006
టైటిల్ : మంచు కింద ఉక్కపోత
రచన : డాక్టర్ జడా సుబ్బారావు
వెల : 200
ప్రతులకు : అసిస్టెంట్ ప్రొఫెసర్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలుగు,
ఆర్‌జియుకెటి, ఏపీ ట్రిపుల్ ఐటీ
నూజివీడు, ఏలూరు జిల్లా -521202
ఫోన్ : 9849031587