
అధికారంలో ఉన్న శక్తులకు మోకరిల్లి గులాం గిరీ చేసే వ్యవస్థలా ఎన్నికల నిర్వహణా వ్యవస్థ ఉండరాదని, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకాలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటూ సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. సముచితమైనది. ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ తప్పనిసరి అని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ఉద్ఘాటించింది. భారత రాజ్యాంగంలో అధికరణ 324 నుంచి 329 వరకు విశదీకరించిన ఎన్నికల వ్యవస్థ నిర్మాణాంశాల్లో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకాల బాధ్యత రాష్ట్రపతికి దఖలు పర్చారు. స్వతంత్య్రయుత నియామాకాల ప్రక్రియ కోసం అవసరమైతే పార్లమెంటు తగిన చట్టం రూపొందించాలని రాజ్యాంగ కర్తలు నిర్దేశించినా అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. పార్లమెంటు అలాంటి ఒక చట్టం రూపొందించే వరకు.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, కమిషనర్లను ప్రధానమంత్రి, పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీయే ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంపిక తీరును రద్దు చేయాలని కూడా నిర్దేశించింది. వాస్తవానికి సిబిఐ డైరెక్టర్, లోక్‌పాల్ రాజ్యాంగ సంస్థల నియామకాలకు సంబంధించి ఇలాంటి ఎంపిక పద్ధతి ఇప్పటికే అమలులో ఉంది. ఎన్నికల సంఘానికి కూడా ఆ పద్ధతిని ఇప్పుడు సుప్రీంకోర్టు అన్వయిస్తూ తీర్పు వెలువరించడం ముదావహం.
దేశంలో ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాత వైఖరిని, పాదర్శకతను పాటిస్తోందని, స్వతంత్రంగా నడుచుకుంటోందనే ప్రజలు నమ్ముతూవచ్చారు. కానీ ఇటీవలి కాలంలో ఆ నమ్మకం నీరుగారిపోతోంది. ఎన్నికల కమిషనర్ల నియామకం వివాదస్పదం కావడం, అకారణంగా ఎన్నికల షెడ్యూళ్లలో మార్పులు, చేర్పులు జరగడం, అవి పాలకులకు అనుగుణంగా ఉండటం, అధికార పార్టీకి అనుచిత లబ్ది చేకూర్చే ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టడం..వంటి బిజెపి ప్రభుత్వంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ దేశ ఎన్నికల వ్యవస్థపైనే నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి.
గతేడాది భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులైన తర్వాత ఖాళీ అయిన ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్‌ను ఎంపిక చేయడం, అందుకు సంబంధించిన దస్త్రాలు శరవేగంగా కదిలిన తీరు యావత్ భారతావనినే విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. 2022 డిసెంబరు 31న పదవీ విరమణ చేయాల్సిన గోయల్ అదే ఏడాది నవంబరు 18న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం.. ఆ వెంటనే ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనరుగా నియమించడం ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. ఇంత మెరుపు వేగంతో చేసే నియామకాలు ఎవరి ప్రాపకం కోసమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగాల్సివుండగా హిమాచల్‌ప్రదేశ్‌కు ముందుగా షెడ్యూలు ప్రకటించి...గుజరాత్‌కు జాప్యం చేయడంతో ఎన్నికల సంఘం విశ్వసనీయతపై భ్రమలు తొలగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటి తీర్పునివ్వడం న్యాయ వ్యవస్థ తన విశ్వసనీయతను పెంచుకుందని చెప్పవచ్చు.
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా ఉండే రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని కీలుబొమ్మలుగా చేసుకుంటున్న ఉదంతాలు పెరిగిపోతున్న దశలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఉపశమనమనే చెప్పాలి. సుప్రీంకోర్టు కొలిజీయం వ్యవస్థపైనా చర్చలు జరగుతున్న ప్రస్తుత తరుణంలో ఏకపక్ష విధానాలు కాకుండా ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేసే విస్తృత ప్రాతిపదికనే సర్వామోద యోగ్యమైన పారద్శరకత, నిష్పక్షపాత నియామకాల ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు.