Oct 29,2023 07:50
  • కేంద్ర మాన్యువల్‌ ప్రకారం అక్టోబర్‌ 31 గడువు
  • అయినా కరువు ప్రకటనపై సర్కారు తాత్సారం
  • దుర్భిక్షంపై ఆది నుంచీ అంతే
  • ముందస్తు సంసిద్ధతపైనా నిర్లక్ష్యమే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కరువు ప్రాంతాల ప్రకటనకు సమయం ముంచుకొస్తోంది. కేంద్రం 2020లో నిర్దిష్టపరిచిన కరువు మాన్యువల్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీఫ్‌లో కరువును అక్టోబర్‌ 31 లోపు ప్రకటించాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితులుంటే అదనంగా గరిష్టంగా మూడు వారాల వ్యవధి ఉంటుంది. అందుకు కేంద్రానికి రాష్ట్ర సర్కారు సహేతుక కారణాలతో అభ్యర్థన పంపి ఆమోదం తీసుకోవాలి. లేకపోతే అక్టోబర్‌ 31 తర్వాత కరువు ప్రకటనకు ఆస్కారం లేదు. నిబంధనలు ఈ విధంగా ఘోషిస్తుండగా ఎపి ప్రభుత్వం మాత్రం అక్టోబర్‌ 31 సమీపిస్తున్నా కరువు ప్రకటనపై మీనమేషాలు లెక్కించడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైసిపి సర్కారు వచ్చాక మూడేళ్లలో కరువు మండలాలను ప్రకటించలేదు. వర్షాలు పుష్కలంగా కురిసినందున ఆ అవసరం రాలేదని చెబుతోంది. అయితే నిరుడు 300 పైగా మండలాలు కరువు ప్రకటనకు అర్హమైనవిగా జిల్లా యంత్రాంగాలు ప్రతిపాదించినా సగటు వర్షపాతం లెక్కల ఆధారంగా కరువును గుర్తించలేదు. ఈ తడవ కూడా అదే బాణీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
 

                                                                         వైఎస్‌నూ పట్టించుకోలేదు

ఖరీఫ్‌లో కరువు నివారణా చర్యలపై ప్రభుత్వంలో ఏ కొంచెం కూడా ముందస్తు సంసిద్ధత లేదు. 2005లో అప్పటి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టం తెచ్చాక, దాని అమలుకు 2007 నవంబర్‌ 14న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిఒఎంఎస్‌ నెం.1436 జారీ చేశారు. విపత్తులను ఎదుర్కొనేందుకు అప్పుడే సిఎం నేతృత్వంలో స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌డిఎంఎ) నెలకొల్పారు. రాష్ట్రస్థాయిలో చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఎస్‌ఇసి), జిల్లాల స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డిడిఎంఎ)లను ఏర్పాటు చేశారు. ప్రతి సీజన్‌లో ఈ కమిటీలు పరిస్థితులపై సమీక్షించి ముందస్తుగా అప్రమత్తమై నివారణా, సహాయక చర్యలను పర్యవేక్షించాలి. కరువు మాన్యువల్‌ ప్రకారం జూన్‌, జులై, ఆగస్టు మాసాల్లోనే వాతావరణ పరిస్థితులపై అంచనాకు రావాలి. కంటింజెన్సీ ప్లాన్లు రూపొందించి అమలు చేయాలి. వర్షాభావం, డ్రైస్పెల్స్‌, సాగునీటి కొరత, సేద్యం తగ్గుదల సంకేతాలు కనిపిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. మొక్కుబడి సమావేశాలకే యంత్రాంగం పరిమితమైంది. కొద్దిపాటిగా కంటింజెన్సీ సీడ్‌ ప్లాన్‌ తప్ప మరే చర్యా చేపట్టలేదు.
 

                                                                          ఇండికేటర్స్‌ ఊసే లేదు

కరువు మాన్యువల్‌ ప్రకారం కరువును రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ యూనిట్లుగా ప్రకటించవచ్చు. గెజిట్‌ పబ్లికేషన్‌ చేయాలి. వర్షాభావం, డ్రైస్పెల్‌, రిజర్వాయర్లు, చెరువులలో నీటి లభ్యత, సాగు తగ్గుదల, భూగర్భ జలాల తగ్గుదల, రిమోట్‌ సెన్సింగ్‌, భూమిలో తేమ శాతం తదితర సూచిలు పేర్కొన్నారు. వాటిలో కొన్ని సరిపడినా కరువు ప్రకటించాలి. మోస్తరు, మధ్యస్థ, తీవ్ర మూడు కేటగిరీల్లో కరువును ప్రకటించొచ్చు. పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు, పంట నష్టాలకు ఆర్థిక సాయం, బీమా, ఉపాధి కల్పన, తాగునీరు, పశువులకు తాగునీరు, గ్రాసం, బ్యాంకు అప్పుల వాయిదా వంటి ఎన్నో ఉపశమన చర్యలు ప్రతిపాదిం చారు. ఆర్థిక సంఘం విపత్తులకు కేటాయించిన నిధులే కాకుండా విపత్తు తీవ్రతను బట్టి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సహాయం కోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి వినతిపత్రం ఇవ్వాలి. అది కూడా విపత్తు ప్రకటన చేసిన వారంలోపు అందజేయాలి. ఖరీఫ్‌లో 25 లక్షల ఎకరాల్లో సాగు లేకపోయినా, వర్షాభావం, డ్రైస్పెల్స్‌, రిజర్వాయర్లలో సాగునీటి కొరత వలన లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా, దిగుబడి నష్టం భారీగా ఉన్నా రాష్ట్ర సర్కారు కరువు ప్రకటనపైనా, కేంద్రాన్ని సహాయం అడిగే విషయంలోనూ తాత్సారం చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.