Jun 11,2023 13:20

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఎట్టకేలకు తన మొదటి ఆగ్మెంటెడ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ 'ఆపిల్‌ విజన్‌ ప్రో'ను ఇటీవల జరిగిన 2023 వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ సంస్థ సిఈవో టిమ్‌ కుక్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇది డబ్ల్యుడబ్ల్యుడిసిలో హైలైట్‌గా నిలిచింది. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (విఆర్‌) రెండింటినీ ఇది సపోర్ట్‌ చేస్తుంది. దీని కుడివైపున వుండే డయల్‌ ద్వారా ఏఆర్‌, విఆర్‌ మోడ్‌లకు మార్చుకోవచ్చు. ఈ ఏఆర్‌/విఆర్‌ ప్లాట్‌ఫామ్‌ వినియోగదార్లకు సరికొత్త అనుభూతినిస్తుందని యాపిల్‌ చెబుతోంది. ఈ హెడ్‌సెట్‌లో ప్రో మిక్స్‌డ్‌ రియాలిటీ హెడ్‌సెట్లో రెండు మైక్రో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలు ఉండనున్నాయి. దీన్ని కంటిచూపుతో కంట్రోల్‌ చేయవచ్చునని యాపిల్‌ చెబుతోంది. దీనిలోని ఐ సైట్‌ అనే ఫీచర్‌ ద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వినియోగదారులు తెలుసుకోవచ్చు. 23 మిలియన్‌ పిక్సెల్స్‌ను ఇది సపోర్ట్‌ చేయనుంది. కస్టం 3డీ లెన్స్‌ ద్వారా ఏఆర్‌ కంటెంట్‌ను పొందవచ్చు. హైస్పీడ్‌ ప్రధాన కెమెరాలు ఉన్న ఫుల్‌ సెన్సార్లు, హ్యాండ్‌ ట్రాకింగ్‌ కోసం కింద వైపు కెమెరాలు, ఐఆర్‌ ఇల్యూమినేటర్లు, సైడ్‌ కెమెరాలు ఇందులో అందించనున్నారు. హ్యాండ్‌ ట్రాకింగ్‌ కోసం, డివైస్‌ కింద స్పేస్‌ కోసం ప్రత్యేకంగా లిడార్‌ స్కానర్‌, ట్రూడెప్త్‌ కెమెరాలు ఉండనున్నాయి. రెండు ప్రత్యేకమైన యాంప్లిఫైడ్‌ డ్రైవర్స్‌ ద్వారా స్పేషియల్‌ ఆడియో అందించనున్నట్లు యాపిల్‌ తెలిపింది.