Oct 24,2022 16:38

ఇంటర్నెట్‌డెస్క్‌ : యాపిల్‌ వాచ్‌ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. యాపిల్‌ వాచ్‌ ప్రాణాల్ని కాపాడటమేంటి అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఇటీవల క్రేజీ లైఫ్‌ సేవింగ్‌ ఫీచర్లతో యాపిల్‌ వాచ్‌ మార్కెట్లోకి వచ్చింది. ఈ వాచ్‌ ధరించి వారికి.. వాచ్‌లో ఉన్న అప్‌డేట్‌ ఫీచర్లు.. వారికున్న అనారోగ్యాల్ని హెచ్చరిస్తుంది. ఇమాని మైల్స్‌ (12)కి యాపిల్‌ వాచ్‌ అంటే ఎంతో ఇష్టమట. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అప్‌డేట్‌ వర్షన్‌తో వచ్చిన యాపిల్‌ వాచ్‌ను కొనిఇచ్చారట. ఇక ఇష్టమైన వాచ్‌ని రోజూ ఇమాని చేతికి పెట్టుకుంటుందట. ఓరోజు.. యాపిల్‌ వాచ్‌ ఇమాని హార్ట్‌రేట్‌ పెరిగిందని పలుమార్లు హెచ్చరించిందట. ఇక వెంటనే ఇమాని తల్లి జెస్సికా కిచెన్‌.. కుమార్తె ఆరోగ్యంపై ఆందోళనకు గురై.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిందట. ఆసుపత్రిలో వెంటనే ఇమానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈ పరీక్షల్లో ఇమానికి అపెండిక్స్‌లో న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. ఈ ట్యూమర్‌ను కేన్సర్‌ ట్యూమర్‌గా వైద్యులు గుర్తించారు. ఈ ట్యూమర్‌ పెరుగుతూ.. ఇతర అవయవాలకూ విస్తరిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే బాలికకు శస్త్రచికిత్స చేసి కేన్సర్‌ కణతులను వైద్యులు తొలగించారు. ఇలా యాపిల్‌ వాచ్‌.. ఓ బాలిక ప్రాణాల్ని కాపాడింది. చికిత్స అనంతరం ఇమాని తల్లి జెస్సికా కిచెన్‌ మాట్లాడుతూ.. 'యాపిల్‌ వాచ్‌ నా కుమార్తె ప్రాణాల్ని కాపాడింది. ఈ వాచ్‌ హెచ్చరించకపోతే.. ఇంకా కొన్నిరోజులు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండేవాళ్లం. ఇమాని ఆరోగ్యం మరింత ప్రమాదంగా మారేది.' అని అన్నారు. గతంలో కూడా యాపిల్‌ వాచ్‌ లండన్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.