
ఈ రష్యన్ నవలా రచయిత 'బోరిస్ వసీల్యెవ్' మిలటరీ ఆఫీసర్ల కుటుంబ నేపథ్యం నుండి వచ్చినవాడు. అతని తండ్రి 'విల్ వాసిల్యివ్' మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని, రెడ్ ఆర్మీలో కమేండర్‌గా చేశాడు.
'బోరిస్ వసిల్యేవ్' రెండో ప్రపంచ యుద్ధంలో రెడ్‌ఆర్మీ తరపున యుద్ధంలో పాల్గొని గాయపడ్డాడు. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓ అజ్ఞాత యువ లెఫ్టినెంట్ అత్యంత సాహసోపేతంగా జర్మన్ నాజీ సైన్యంతో ఒంటరి పోరాటం చేస్తాడు. ఆ క్రమంలో ఎందరినో మట్టుబెట్టి, చివరికి ఆ నాజీల చేతికి చిక్కుతాడు. కానీ వారి చేతుల్లో కాకుండా తనకు తానే స్వచ్ఛందంగా మత్యువును వరించి, అమరుడయ్యాడు. ఆ కల్నల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్న 'వసీల్యెవ్' తన స్వీయ యుద్ధ అనుభవాలను, రచనా సామర్థ్యాన్ని జోడించి, తన యాభయ్యవ ఏట (1974లో) ఈ అద్భుతమైన నవల రాశాడు. ఆ తర్వాత ఏడేళ్లకు (1981లో) అది తెలుగులోకి అనువదించారు. మరల నలభై ఏళ్ళకు తిరిగి 'సాహితీ ప్రచురణలు' విజయవాడ వారు పునర్ముద్రించి, తెలుగు పాఠకలోకానికి అందించారు. ఈ పనిలో వారికి 'రష్యన్ సాహిత్య అభిమానుల వేదిక' తరపున శ్రీ కుమార్ కూనపరాజు, వారి మిత్రబందం తమ ఇతోధిక సహాయ సహకారాలు అందించారు. అందుకే పాఠకులుగా మన మంతా ఈ నవల కొని, చదివి, తోటి వారితో చర్చించడం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సి వుంది.
ఇక నవలాంశానికి వస్తే...
నవలా నాయకుడైన ప్లూజ్నికోవ్ రెడ్ ఆర్మీ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ హోదాతో నాజీల ఆక్రమిత ప్రాంతమైన బ్రెస్ట్ దుర్గం పరిరక్షణకు వెళతాడు. అతను డ్యూటీలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకముందే ఆ కోట మీద జర్మన్ల దాడి మొదలవుతుంది. దాంతో అతను అధికారికంగా బాధ్యతలు చేపట్టకుండానే యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. జర్మన్ల దాడికి రెడ్ ఆర్మీ కకావికలం అవుతుంది. అనేకమంది చనిపోతారు. కొంతమంది ఆ దుర్గం నేలమాళిగల్లోకి (కందకాలు) వెళ్ళి, తల దాచుకుంటారు. వారిలో ప్లూజ్నికోవ్ ఒకడు. జర్మన్లు ఫిరంగులు, వివిధరకాల ఆయుధాలతో దుర్గం మీద దాడి చేస్తారు. దుర్గమంతా శిథిలమైపోయి రాళ్ళు, రప్పలు, ఇటుకలతో ఓ మట్టి దిబ్బలా మారిపోతుంది. అందులో చిక్కుబడిన రెడ్‌ఆర్మీ ఎలుకలతో, చీకటితో సహజీవనం చేయాల్సి వస్తుంది. సిపాయిల కోసం క్యాంటీన్లో నిలువ వుంచిన రస్కుల్లాంటి వాటితో కడుపు నింపుకుని, జర్మన్లపై యుద్ధం చేస్తుంటారు. ఆ క్యాంటీన్లో పనిచేసే 'క్రిస్తా' అనే ఓ ముసలమ్మ, 'మిర్రా' అనే ఓ వికలాంగ యువతి శిథిల దుర్గంలోనే చిక్కుబడిపోతారు. జర్మన్ సైన్యం వేనవేలమంది ఉంటే రెడ్‌ఆర్మీది వేళ్ళ మీద లెక్కించగల సంఖ్య. అయినా దుర్గాన్ని కాపాడాలనే పట్టుదలతో గెరిల్లా పద్ధతిలో ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి కంకణం కట్టుకుంది రెడ్‌ఆర్మీ సైన్యం. రోజులు గడిచేకొద్దీ ఒక్కొక్కరే చనిపోతూ ఆఖరికి ప్లూజ్నికోవ్, మిర్రా ఇద్దరే మిగులుతారు. ఆ పరిస్థితిలో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఫలితంగా మిర్రా గర్భవతి అవుతుంది. ఆ స్థితిలో ఆమె నేలమాళిగలో ఉండడం సరికాదని, ఏదోవిధంగా బయటకు పంపాలనే ఆలోచనలో ఉంటాడు ప్లూజ్నికోవ్. అనుకోకుండా ఓరోజు జర్మన్ సైనికులు నేలమాళిగల ప్రాంతంలో శిథిలాలను తొలగించడానికి బయటి నుండి కొంతమంది స్త్రీలను తీసుకొస్తారు. ప్లూజ్నికోవ్ తెలివిగా మిర్రాను వారిలోకి జొప్పిస్తాడు. కానీ, జర్మన్లు మిర్రాను గుర్తించి, చంపి శవాన్ని పూడ్చివేస్తారు. పాపం! ఆ విషయం ప్లూజ్నికోవ్‌కి చివరి వరకూ తెలియదు. ప్లూజ్నికోవ్ మరికొంతకాలం ఒంటరిగానే జర్మన్లతో తలపడి, చివరికి దొరికిపోతాడు. శత్రువుల చేతుల్లో చనిపోగూడదన్న సంకల్పంతో ఉన్న అతను తనకు తానే శత్రువుల ముందే వీర మరణం పొందుతాడు. సంక్షిప్తంగా ఇదీ కథ. రచయిత వసీల్యేవ్ స్వయంగా యుద్ధంలో పాల్గొన్న వాడవడంతో యుద్ధ సమయ భీభత్సాన్ని పాఠకులకు విపులంగా వివరించగలిగాడు. అసలు సిసలు సిపాయికి చావు ఉంటుందేమో కానీ పరాజయం ఉండకూడదన్న యుద్ధ నియమాన్ని దష్టిలో వుంచుకొని రచయిత ప్లూజ్నికోవ్ పాత్రను మలచిన తీరు అద్భుతంగా వుంది. ఇది నాజీల కర్కశత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన నవల.
ప్లూజ్నికోవ్‌కి బయట నుండి వీసమెత్తు సహాయం అందకున్నా, తిండి, తీర్థం లేకపోయినా, బండ లోపలి కప్ప మాదిరిగా ఎండిపోయినా శత్రువులకు లొంగకుండా ఒక్కడే సుమారు ఏడాది పాటు జర్మన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు. ఇప్పటికీ ప్రతి ఏటా జూన్ 22 తెల్లవారుజామున ఓ వద్ధ స్త్రీ, సజీవులై మిగిలి వున్న ఆనాటి సిపాయిలు బ్రెస్ట్ దుర్గం దగ్గరికొచ్చి, అక్కడ మరణించిన ప్లూజ్నికోవ్‌లాంటి అమరవీరుల స్మత్యర్ధం పుష్పగుచ్ఛాలు ఉంచుతారు. ఆనాటి స్మతి శకలాలను దర్శించి, వారి కృతజ్ఞతను చాటుకుంటారు.
అజేయ సైనికుడు
పేజీలు : 264
ధర : రూ. 175
ఫోన్ నెం : 9849992890
పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ.
- శిరంశెట్టి కాంతారావు
98498 90322