Jul 29,2022 06:55

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి ప్రకటనల్లో స్పష్టత కొరవడడం బాధాకరం. సర్వస్వం కోల్పోతున్నవారికి ఎప్పుడు ఎంత పరిహారం ఎలా చెల్లిస్తారన్నది చెప్పకపోవడం దారుణం. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఆయన బుధవారం బాధితులతో మాట్లాడుతూ నిర్వాసితులకు 45.72 కాంటూరు పరిధి వరకూ ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలంటే రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించడం కష్టమన్నది నిజమే! కాని జాతీయ ప్రాజెక్టుగా చట్టం పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆ మొత్తాన్ని రాబట్టడానికి తాము పోరాడటం, కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలను, రాజకీయ పార్టీలనూ సమీకరించి ఢిల్లీ పాలకుల మెడలు వంచడానికి కృషి చేయవలసిన ముఖ్యమంత్రి కేంద్రం సాయం చేస్తేనే పరిహారం ఇవ్వగలం అని చెప్పడం తగదు. అది సాయం కాదు మన హక్కు. పోరాడైనా దాన్ని సాధించుకోవాలన్న పట్టుదలను ప్రదర్శించకపోవడం అన్యాయం. ఇప్పటి వరకూ జరిగిన పోలవరం పనులకు కేంద్రం నుంచి రూ.2,900 కోట్లు రావాల్సి ఉందని, ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం, బకాయి బిల్లుల కోసం రెండు, మూడుసార్లు ప్రధానిని కలిశానని, ప్రతి నెలా కేంద్ర మంత్రులను కలుస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో అనుకున్న స్థాయిలో కదలిక రావడం లేదని సిఎం అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం, కుస్తీ పడుతున్నాం అంటూనే 'బతిమాలుతున్నాం' అని కూడా ఆయన చెప్పారు. ఆచరణలో ఆ బతిమాలడమే జరుగుతోందన్నది ముమ్మాటికీ నిజం.
కేంద్రం నుంచి డబ్బు రావడం ఆలస్యమైనా 41.15 కాంటూరు వరకూ సెప్టెంబర్‌లోగా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారమిచ్చి నిర్వాసితులను తరలిస్తామనడం మంచిదే! కాని, రకరకాల సాకులు చూపి పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతులను ప్రభుత్వం అమలు చేయదని చెప్పలేం. గతంలో ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామస్తులను ఊళ్లు ఖాళీ చేయించడానికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పెట్టిన ఇబ్బందులు తెలియనిదెవరికి? నిత్యావసర సరుకులను సంత నుండి కొనుక్కొచ్చిన గిరిజనాన్ని చెక్‌పోస్టులు పెట్టి నిలిపివేసిన ఘటనలు మరువగలమా? అలాగే, వై.ఎస్‌ హయాంలో సేకరించిన భూములకు ఇచ్చిన రూ.1.15 లక్షలు, రూ.1.50 లక్షలకు మరో మూడున్నర లక్షలు చెల్లిస్తామని తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలుపుకుంటానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారే తప్ప ఆ చెల్లింపులెప్పుడో మాత్రం చెప్పకపోవడం ధర్మం కాదు.
ఈ సందర్భంగా స్థానికులు పలువురు ముంపు ప్రాంతాలను లెక్కించడంలో పలు అవకతవకలు జరిగాయని, నిర్వాసిత కాలనీలు సైతం ముంపు బారిన పడ్డాయని వాపోయారు. ఈ వినతులపై స్పందించిన సిఎం ముంపు లెక్కల్లో తప్పులు దొర్లి ఉంటే సరిదిద్దుతామంటూనే ప్రస్తుతం 28 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇంత భారీ స్థాయిలో వరదలు రావడం అసాధారణమైనందున ఈ ముంపును పరిగణలోకి తీసుకోలేమని చెప్పడం తగదు. సాధారణమైనా అసాధారణమైనా వరద వచ్చిన మాట నిజం. కాబట్టి ఆ గ్రామాలు ఎప్పుడైనా ముంపు బారిన పడడం ఖాయం. ఆ వాస్తవాన్ని గమనించకుండా రాడార్‌తో సర్వే నిర్వహించి కొత్త కాంటూరు లెక్కలు సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అన్యాయం. రాడార్‌ సర్వేతో సరిపెట్టుకోవడం కాకుండా తాజాగా హైడ్రాలిక్‌ మోడల్‌ స్టడీస్‌ చేపట్టాలి. అంటే డ్యాం నిర్మించాక ఎంత ఎత్తున నీరు నిలిపినపుడు ఎగువనుండి ఎంత నీరు (వరద) వస్తే నదీ పరీవాహ ప్రాంతంలో ఎంతమేర ముంపునకు గురవుతుందో శాస్త్రీయంగా లెక్క తేల్చాలి. ఆ రెండింటిని, ఇప్పటి ముంపును ప్రాతిపదికగా తీసుకొని ప్రభావిత ప్రజలందరికీ పరిహారం చెల్లించాలి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచించాలి. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా పరిహారం ఎక్కడివరకు ఇచ్చామో, అంతవరకే నీళ్లు నింపుతామని సిఎం ప్రకటించడం బాగానే వుంది. ఇలాంటి హామీలివ్వడం కాకుండా నిర్వాసితులందరికీ 2013 ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాక ప్రాజెక్టు పూర్తి చేస్తామని సిఎం చెబితే బాగుండేది. ఏ ప్రాజెక్టుకైనా తొలి లబ్ధిదారు నిర్వాసితులే కావాలన్న అంతర్జాతీయ నియమాన్ని పాటించాలి.