
సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున, సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని త్వరితంగా నివారించాలని, నివారించకపోతే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా మన దేశంలో పాలకులకు మాత్రం ాది ఏమాత్రం పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్ 2047ని ప్రకటించింది. మిషన్ మోడ్‌ను ప్రకటిస్తే చాలదు. దానిని అమలు చేసే చిత్తశుద్ధి కావాలి.
సికిల్ సెల్ వ్యాధిని ప్రజా ఆరోగ్య సమస్యగా గుర్తించాలని 2008 డిసెంబర్ 22న జరిగిన ఐక్య రాజ్య సమితి 63వ జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశం ప్రత్యేకంగా తీర్మానించింది. సికిల్ సెల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి తన సభ్య దేశాలన్నిటినీ కోరింది. 2009 నుండి ప్రపంచ దేశాలన్నీ జూన్ 19న అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యతిరేక దినంగా పాటిస్తున్నాయి. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కషి చేస్తున్నాయి ాది మొదటి సారిగా వెస్టిండీస్లోని గ్రెనిడా ద్వీపానికి చెందిన ఒక్క దంత వైద్య విద్యార్థిలో గుర్తించడం జరిగింది. ప్రారంభంలో ఆఫ్రికన్ ప్రాంతంలో వ్యాధి లక్షణాలు కనిపించినా, తరువాతి కాలంలో భారత దేశంలో అనేక ప్రాంతాల్లో వేగంగా విస్తరించింది. ముఖ్యంగా మన దేశంలో గిరిజన ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.
2020 నాటికి సికిల్ సెల్ అనీమియా అనే జన్యు పరమైన వ్యాధిని కలిగిన వారిలో ఉన్న రక్తహీనత నిర్మూలించడానికి 2018 లో కేంద్ర ప్రభుత్వం ''అనీమియా ముక్త్త భారత్'' కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఆ లక్ష్యాన్ని 2023 నాటికి కూడా చేరుకోలేదు. 2023-24 బడ్జెట్లో మిషన్ మోడ్ 2047 పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సికిల్ సెల్ అనీమియాతో పాటు రక్త రుగ్మతలు, రక్తాన్ని ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులను నివారించడానికి కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను కేరళ వంటి రాష్ట్రాలు మినహా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు.
సికిల్ సెల్ వ్యాధి లేదా సికిల్ సెల్ అనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అనేది వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న రక్త రుగ్మత. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుండ్రంగా పెప్పెర్‌మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే కొంతమందిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి (సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్ సెల్ ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్ సెల్‌గానూ, ఒకటి మామాలుగానూ ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులకు ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పుట్టిన పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే సికిల్ సెల్ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. సికిల్ సెల్ రక్త కణాల జీవిత కాలం తక్కువగా ఉండడం వలన, వేగంగా కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి కలిగిన వారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్ సెల్ రక్తకణాలు వంపుతిరిగి ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తం సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే చిన్న తనంలోనే చనిపోతారు. ఈ వ్యాధి కలిగిన వారి సగటు జీవిత కాలం 42-48సవత్సరాలు. జన్యుపరమైన మార్పుల వలన ఏర్పడుతున్న ఈ రక్తహీనత జబ్బుకు సరైన మందులు లేవు.
భారత దేశంలో 17 రాష్ట్రాల్లో సికిల్ సెల్ వ్యాధి సుమారు 20 లక్షల మంది కలిగి ఉన్నారని ఒక అంచనా. కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్ 2047 పేరుతో సికిల్ సెల్ డిసీజ్‌ను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా 200 జిల్లాలో 40 ఎండ్ల లోపు వయస్సు కలిగిన 7 కోట్ల మంది గిరిజనులకు 2025-26 నాటికి ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణ కోసం స్క్రీని%శీ%గ్ చేయాలని నిర్ణయించింది. కానీ 2022-23 సంవత్సరంలో కోటి మందికి స్క్రీనింగ్ చేయాలని లక్ష్యం ఉంటే కేవలం 1,05,954 మందికి చేస్తే 5,959మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 2016-18 సంవత్సరంలో 1,13,83,664 మందికి స్క్రీనింగ్ చేస్తే 9,96,368 మందికి పాజిటివ్ వస్తే 9,49,057 మందికి వ్యాధి లక్షణాలుంటే 47311మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ప్రపంచలోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో మన దేశంలో రెండో స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 40వేల మంది పిల్లలు ఈ వ్యాధితో పుడుతున్నారని అంచనా. ప్రతి ఏటా 50శాతం మంది పిల్లలు 5 సంవత్సరాల కంటే ముందే చనిపోతున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచన మేరకు సికిల్ సెల్ వ్యాధి పై అవగాహన , నివారణ కోసం విశ్వ విద్యాలయాల గ్రాంట్స్ కమీషన్ ఉన్నత విద్య సంస్థలకు సంబంధిత పాఠ్యాంశాల్లో సికిల్ సెల్ వ్యాధికి సంబంధించిన అధ్యాయాన్ని చేర్చి వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలు, కొడవలి కణం, దాని కారణాలు, చికిత్స, వారసత్వ నమూనా, పరీక్షించే విధానాలు, నివారణపై పాఠ్యాంశాల్లో భాగంగా బోధించాలని నిర్ణయించింది.
18 నుంచి 34 శాతం మంది ఆదివాసీలు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న రాష్ట్రాల్లో కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ జనాభాలో 15 నుండి 33 శాతం ఉన్నట్లు ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ అధ్యయనం పేర్కొంది. ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్, గుర్తించబడకపోతే పేరెంట్ క్యారియర్‌ల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది.
''తల్లిదండ్రులిద్దరిలో సికిల్ సెల్ హిమోగ్లోబిన్ లక్షణాలు ఉంటే ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్,మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లోని గిరిజనులు, ఆదివాసీల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రాణాంతకమైన మలేరియా లక్షణం అయిన ప్లాస్మొడియం ఫల్సిఫరమ్ నుండి నుండి గిరిజనుల ప్రాణాలను కాపాడడంలో సికిల్ సెల్ డిసీజ్ దోహదపడుతుందని జబల్‌పూర్‌లోని ట్రైబల్ హెల్త్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అధ్యయనం వెల్లడించింది.
మలేరియాకు పాజిటివ్‌గా పరీక్షించబడిన 78 శాతం ఆదివాసీలు ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల సికిల్ సెల్ అనీమియా ఎక్కువగా ఉన్నా గిరిజనుల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. ''సికిల్ సెల్ అనీమియాతో ప్రజలు ఎక్కువగా బాధపడుతున్న ప్రదేశాలలో మలేరియా ప్రాబల్యం తక్కువగా ఉంటుంది సికిల్ సెల్ అనీమియా రోగులలో కూడా మలేరియా వైరస్ లక్షణాలు తక్కువగా ఉంటాయి'' అని జబల్‌పూర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు డాక్టర్ జ్ఞాన్‌చంద్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం,విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దాదాపు 10 లక్షల గిరిజన జనాభాలో కనీసం పది శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ లెక్కన లక్ష మందికి సికిల్ సెల్ అనీమియా లక్షణాలు ఉండవచ్చని వివిధ సంస్థల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. విశ్వవిద్యాలయ స్థాయిలో ఆంధ్రా యూనివర్సిటీ ''హ్యూమన్ జెనెటిక్స్'' విభాగం వారు జరిపిన పలు శాంపిల్ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనేతరుల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నావి.
సికిల్ సెల్ అనీమియా వ్యాధి కలిగిన వారు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగ పడే పోషక ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు రోజు వారి ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పోషక విలువలు కలిగిన బియ్యాన్ని సరఫరా చేయాలి.2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీలకు నిధుల కేటాయింపులు భారీగా తగ్గించారు.
భారతదేశంలోని అధిక రాష్ట్రాలలో ఈ వ్యాదిని అరికట్టేందుకు ప్రత్యేక నివారణ ప్రాజెక్టులను చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యేక పరిశోధనాలయం కూడా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ వ్యాధి నివారణకు దీనిపై పరిశోధనకు రారుపూర్‌లో ప్రత్యేకంగా సికిల్ సెల్ ఇన్‌స్టిట్యూట్‌నే నెలకొల్పి 12.43 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపారు. దీర్ఘకాలం కామెర్లు ఉండటం, రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతుల వేళ్లు వాపుతో వంపు తిరిగి ఉండటం, ప్లీహం వాచిపోయి ఉండటం ఈ సికిల్ సెల్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలుగా ఉంటున్నవి.ఈ వ్యాధి నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు చాలా తక్కువలోనే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్‌లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు గుండ్రంగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా? అని తెలుసుకోవడం ద్వారా వ్యాధి ఉందా, లేదా అని నిర్ధారించుకోవచ్చు. ఈ వ్యాధి నిర్ధారణ ప్రాథమిక పరీక్షను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే జరపవచ్చు.
సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున, సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని త్వరితంగా నివారించాలని, నివారించకపోతే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా మన దేశంలో పాలకులకు మాత్రం ాది ఏమాత్రం పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్ 2047ని ప్రకటించింది. మిషన్ మోడ్‌ను ప్రకటిస్తే చాలదు. దానిని అమలు చేసే చిత్తశుద్ధి కావాలి.
జూన్ 19 అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధి దినం సందర్భంగా (రచయిత ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు) 9490098713
ఎం అడివయ్య