Apr 09,2023 07:48

ఆకస్మికంగా వీచిన
తుఫాను గాలులకు
నువ్వెళ్ళిపోయిన బాధ
మరలా తిరిగిరాని గాథ
ఇంకా ఈ లోకం యొక్క వ్యధ..
నను పరిపరివిధాల
నిర్లిప్తతకు గురిచేస్తుంటే
నేనేమీ చేయలేని నిస్సహాయత..?

రాత్రంతా మేల్కొని
నువొచ్చే రహదారిపై
ఎదురుచూపుల్ని పరచి
నీ కోసం అంతులేని నిరీక్షణ
కానీ కనుచూపుమేరలో
నీ జాడ కానరాలేదు..

అడుగడుగునా ప్రతి క్షణాన
నీ జ్ఞాపకాలే శూలాలై
నీ మాటలు స్మృతి తూటాలై
నను నిలువునా కాల్చేస్తుంటే
నువ్వు లేని లోటు పిడిబాకుయై
ఈ చిట్టిహృదయాన్ని
ఛిద్రం చేస్తోంది..
జ్ఞాపకాల పరంపర వస్తూనే ఉంది
కానీ ఈ సారి నువ్వే రావాలి
నా పొదరిల్లు వాకిలిని స్పృశిస్తూ
వసంతం వెళ్లిపోతుంటే
కన్నీటివర్షం ఏరులై పారుతోంది
ఇపుడు వేడేమిటి..? చలేమిటి..?
ప్రస్తుతం వ్యధ
వడగాడ్పుయై వీస్తోంది..
గతం ఎలాగో అలాగా నీ
సాహచర్యంలో సాఫీగా సాగిపోతే
వర్తమానం నా హృదయంపై
నీ జ్ఞాపకాలతో కరాళనృత్యం చేస్తూ
తన పగ తీర్చుకుంటోంది
ఊహించుకున్న సువర్ణభవితవ్యం
అంధకార బంధురమై
నను భయభ్రాంతుల్ని చేస్తోంది.

సర్ఫరాజ్‌ అన్వర్‌
9440981198