- గండికోట రిజర్వాయర్ పరిశీలన
ప్రజాశక్తి-కడప : నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని సీఎం జగన్.. కొత్త ప్రాజెక్టుల పేరుతో మరో దోపిడీకి తెరలేపారని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొత్తగా 10 ప్రాజెక్టులంటూ రూ.12వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారన్నారు. ఇవాళ గండికోట రిజర్వాయర్‌ను చంద్రబాబు సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద ఆగిన పనులను కొండలపైకి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధ భేరి మోగించామన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేసిందన్నారు. కడప జిల్లాకు గండికోట ఒక టూరిస్ట్ హబ్ అని ప్రపంచంలో గుర్తింపు పొందిన గ్రాండ్ కెన్యాన్‌ని పోలి ఉండే గండికోటని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు లకు 68,293 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైసిపీ 22,165 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నదుల అనుసంధానం చేయాలని గత టీడీపీ కంకణం కట్టుకుందన్నారు. నదుల అనుసంధానం జరిగితే నీటి కి కొరత ఉండదని తెలిపారు. పోలవరం పూర్తి అయితే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని తెలిపారు. పోలవరం ఏపీకి వరం లాంటిదన్నారు. గోదావరి, కష్ణ, పెన్నా నదుల అనుసంధానం నా జీవిత ఆశయమని తెలిపారు. హంద్రీ నీవా ప్రాజెక్టు దివంగత నేత ఎన్టీఆర్ ప్రారంభిస్తే నా హయాంలో పూర్తి చేశానన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేయాలన్నదే టీడీపీ ద్యేయమన్నారు. రాయలసీమ లో నీటి ఎద్దడి లేకుండా చేయడం లో జగన్ విఫలం అయ్యారన్నారు. రాయలసీమలో పుట్టి రాయలసీమ కు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. రాయలసీమలో 5 ఏళ్లలో 12,441 కోట్లు టీడీపీ ఖర్చు చేసిందని తెలిపారు. వైసిపీ నాలుగు ఏళ్లలో 2011 కోట్లు మాత్రమే ప్రాజెక్టు లకు ఖర్చు చేసిందన్నారు. ప్రాజెక్టుల గురుంచి మాట్లాడమంటే వైసిపీ మంత్రులు బ్రో సినిమా గురుంచి మాట్లాడతారని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూనే.. మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ. 600 కోట్ల బిల్లులను సెటిల్ చేశారన్నారు. . ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందోనని పెండింగ్ ప్రాజెక్టులను వదిలేశారు. ఉన్న ప్రాజెక్టులు రద్దుచేసి.. 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారు. సొంత కంపెనీలకు డబ్బులు దోచిపెట్టేందుకు మంత్రులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఆగస్టు 2వ తేదీ వచ్చినా శ్రీశైలం మోటార్లు ఇంకా ఆన్ కాలేదు. పోలవరం పూర్తి చేసి ఆ నీటిని బనకచర్లకు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. పోలవరం పనులకు నాడు గిన్నిస్ రికార్డులు వస్తే.. నేడు అన్నీ విమర్శలే. పోలవరం నిర్వాసితులు వరద ముంపునకు గురైతే కనీసం తిండి కూడా పెట్టట్లేదు. వారు వలసపోయే దుస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.










