
మతతత్వాన్ని ప్రధాన అజెండాగా తెరమీదకు తెచ్చేందుకు, మత వైషమ్యాలను రగిల్చేందుకు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్-యుసిసి)ని కాషాయ పార్టీ ముందుకుతేవడం అవాంఛనీయం. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన ప్రకటన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మతపరంగా మైనారిటీ వ్యతిరేక భావాలను రగిలించడం ద్వారా మెజారిటీ ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో చేసిందే. రెండు నెలలుగా మంటల్లో మాడిపోతున్న మణిపూర్‌పై నోరుమెదపని ప్రధాని యుసిసిపై మాట్లాడటం పథకం ప్రకారం జరుగుతున్నదే. ఆర్‌ఎస్‌ఎస్ - బిజెపి అజెండాలో ప్రధాన అంశాలు రామజన్మభూమి, 370వ అధికరణ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి. 'ఉమ్మడి పౌరస్మృతి ఈ దశలో అవసరమూకాదు.. వాంఛనీయమూ కాదని' 2018 ఆగస్టులో 21వ లా కమిషన్ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. అయినప్పటికీ, తాజాగా 22వ లా కమిషన్ మళ్లీ దాన్ని తెరపైకి తెచ్చింది. మోడీ ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత కమిషన్ ఉమ్మడి సివిల్‌కోడ్‌పై అభిప్రాయ సేకరణ తంతు చేపట్టింది.
ఆదేశిక సూత్రాల్లోని ఉమ్మడి పౌరస్మృతి అమలుకు అడుగులు వేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని కాషాయ సమర్థకులు ప్రశ్నిస్తున్నారు. ఆదేశిక సూత్రాల్లోని సార్వత్రిక విద్య, పని, నిరుద్యోగ భృతి వంటి హక్కులను అమలులోకి తీసుకొస్తే కరోనా కాలంలో అనేక మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయే వారే కాదు. కర్ణాటకలో అధిక సంఖ్యాకులైన లింగాయతులు తమను ప్రత్యేక మతంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. శైవులు, వైష్ణవులతోపాటు కులాలవారీగా భిన్న ఆచారాలు, ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. ఆదివాసీలకు ప్రత్యేక సాంప్రదాయాలున్నాయి. పంజాబ్‌లో వారసత్వ హక్కులు సిక్కులకు ఒక విధంగా, హిందువులకు మరో విధంగా ఉన్నాయి. వాటన్నింటిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా? యుసిసిని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లిముల మీద విద్వేషాలను, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటుబ్యాంకును సంస్థాగతం చేసుకోవడమే లక్ష్యంగా బిజెపి ముందుకెళ్తోంది. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి పేరుతో దేశంలో బహుళత్వాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఓటమి, మణిపూర్ హింసాకాండ, రెజ్లర్ల నిరసన, విపరీతంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతుల ఆందోళనలు... బిజెపి సర్కారుపై కొన్ని సెక్షన్లలో ఉన్న భ్రమలను దూరం చేశాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం తర్వాత మోడీ సర్కారుకు బెంగపెరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ సంస్కృతి. అనేక సంఘాలు, సంస్కతుల మిశ్రమంగా ఉన్న దేశంలో, వివిధ వర్గాల వ్యక్తులు వారి స్వంత ఆచారాలు, మతపరమైన నియమాలను అనుసరిస్తారు. దీన్ని మార్చి ఒకే సివిల్ కోడ్ అమలు చేయాలన్న ఎత్తుగడ రాజ్యాంగ సారాంశానికి విరుద్ధం. ప్రత్యేక వ్యక్తిగత చట్టం ముస్లిములకే పరిమితం కాదు. మిగిలిన మతాల్లోనూ అనేక ప్రత్యేక అంశాలున్నాయి. గిరిజన తెగల్లోనూ రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఏకరూపత పేరుతో సాంస్కృతిక వైవిద్యాన్ని నాశనం చేయడం జాతి సమైక్యతకే ప్రమాదం. రాజ్యాంగ విరుద్ధం. హిందూ మతానికి వస్తే నిచ్చెనమెట్ల కులవ్యవస్త, దుర్మార్గమైన కులవివక్ష నెలకొన్నాయి. భారతీయ సమాజంలో లింగవివక్ష మరో ప్రధానమైన సమస్య.
మహిళా రిజర్వేషన్ల బిల్లును పాలకులు దశాబ్దాల తరబడి కోల్డ్ స్టోరేజిలో పెట్టారు. విధానపరంగా ప్రధాన పార్టీలు దాన్ని వ్యతిరేకించడం లేదు కాని బిల్లు మాత్రం ఆమోదం పొందదు. మోడీ సర్కారుకు ఏమాత్రం ఇంగితం ఉన్నా రానున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదింపజేయాలి. మోడీ సర్కారు ముందుకుతెస్తున్న ఏకరూపత అంటే సమానత్వం కాదు. అన్ని కమ్యూనిటీలకు చెందిన మహిళలకు సమాన హక్కు ముందుగా కల్పించాలి. అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన పర్సనల్ చట్టాలు లేదా సాంప్రదాయ చట్టాలను సంస్కరించడం ద్వారానే అది సాధ్యం. ముందుగా అందరితో చర్చించి, ఏకాభిప్రాయానికి రావాలి. అన్ని కమ్యూనిటీల్లో స్త్రీ, పురుషులందరి ప్రజాస్వామిక భాగస్వామ్యంతో ముందుకు సాగాలి.