May 06,2023 07:32

పుతిన్‌ బతికి ఉన్నంత వరకు చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్‌ గతేడాది ఒక తీర్మానం చేసుకుంది. సీ జిన్‌పింగ్‌ ప్రారంభించిన శాంతి చర్చలను మొగ్గలోనే తుంచేందుకు జరిగిన కుట్రలో భాగంగా కూడా తాజా డ్రోన్‌ దాడి జరిగి ఉండవచ్చు. ఇలాంటి కుట్రలను లోకానికి వెల్లడిస్తూనే రాజకీయ పరిష్కారం కోసం పుతిన్‌ యంత్రాంగం రెచ్చిపోకుండా వ్యవహరించాల్సి ఉంది.

         ఉక్రెయిన్‌ సంక్షోభంలో మరో మలుపు ఏమిటి? కొద్ది రోజుల క్రితం చైనా అధినేత సీ జిన్‌పింగ్‌ ఫోన్‌ ద్వారా జెలెన్‌స్కీకి చేసిన శాంతి ప్రతిపాదనలను ముందుకు పోకుండా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందా? తన చేజారిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు పశ్చిమ దేశాల మద్దతుతో అటు ఉక్రెయిన్‌ సిద్ధం అవుతోంది. స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌ బోస్‌ రిపబ్లిక్‌లను కాపాడేందుకు, గత ఏడాది కాలంలో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటూ భారీ ఎత్తున కొత్తగా దాడులు చేసేందుకు ఇటు రష్యా సన్నద్ధం అవుతోందన్న వార్తల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారు ఝామున మాస్కోలోని అధికార కేంద్రమైన క్రెమ్లిన్‌ సమీపంలో రెండు ఆధునిక డ్రోన్ల (పైలెట్లు లేని చిన్న విమానాలు)ను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. తమ నేత పుతిన్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్‌ జరిపిన ఉగ్రదాడి ఇది అని పేర్కొన్నది. వాటితో తమకు సంబంధం లేదని జెలెన్‌స్కీ, దాని గురించి మాస్కో చెప్పే మాటలను నమ్మటం లేదని అమెరికా ప్రకటించింది. గతంలో ఇలాంటి ఉగ్రదాడులు జరిపినప్పుడల్లా ఇలాగే ఠలాయించారు.
          ఉక్రెయిన్‌లో వున్నది పేరుకు పౌర ప్రభుత్వం తప్ప దాని ఆచరణ, చర్యలన్నీ ఉగ్రవాద శక్తుల స్వభావాన్నే కలిగి ఉన్నట్లు ఎప్పటి నుంచో అనేక మంది చెబుతున్నారు.గత ఏడాది కాలంలో రష్యా నుంచి ఐరోపాకు వెళ్లే ఇంధన పైప్‌లైన్‌ విధ్వంసం, క్రిమియాలో ఒక వంతెన పేల్చివేత ఉదంతం, రష్యా మిలిటరీ స్థావరాల మీద జరిగిన దాడులన్నీ ఉగ్రవాదులు జరిపే వాటి స్వభావం కలిగినవే. వీటిలో ఏ ఒక్కదానినీ జెలెన్‌స్కీ లేదా అతగాడికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలేవీ ఖండించలేదు. నాటో, అమెరికా ఇచ్చిన పాత అస్త్రాలన్నింటినీ జెలెన్‌స్కీ సేనలు అవగొట్టాయి. ఆధునిక ఆయుధాలను ఇస్తే వాటిని సక్రమంగా వినియోగించే సత్తా వాటికి ఉందా లేదా అన్న అనుమానాలు పశ్చిమ దేశాలకు ఉన్నాయి. పరిమితంగా దాడులు చేస్తూ భారీ ఎత్తున విరుచుకుపడేందుకు పుతిన్‌ సేనలు సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెప్పటం తప్ప అది ఎలా ఉంటుందన్నది ఇంతవరకు నాటో వేగులు తేల్చుకోలేకపోయారు. ప్రాణ నష్టం కలగకుండా ఉక్రెయిన్‌ మిలిటరీ, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తూ రష్యా మిలిటరీ చర్యలను కొనసాగిస్తున్నది. అందుకే పుతిన్‌ను రెచ్చగొట్టి సంక్షోభ తీవ్రతను పెంచాలని పశ్చిమ దేశాలూ, ఉక్రెయిన్‌ చూస్తున్నది. తాజా డ్రోన్ల ఉదంతం వాటిలో భాగమే అన్నది స్పష్టం. క్రెమ్లిన్‌ మీద డ్రోన్లు ఎగిరిన రోజే ఓల్నా అనే రష్యా చమురు నిల్వకేంద్రంపై జరిపిన డ్రోన్‌ దాడిలో అది దగ్ధమైనట్లు టాస్‌ వార్తా సంస్థ తెలిపింది. అది ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలో ఉంది.
           ఈ పరిణామం ప్రపంచ దేశాలకు సరికొత్త ఉగ్రవాద ముప్పును సూచిస్తున్నది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఏడు గంటల పాటు ఎగురుతూ 25 నుంచి 95 కిలోల బరువును మోసుకుపోగల మానవ రహిత డ్రోన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కూడా పది నుంచి ఇరవై వేల డాలర్లలోపే ఉంటుంది. వాటి కొనుగోలుతో పోలిస్తే కూల్చివేసేందుకు లక్షా నలభై నుంచి ఐదు లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని టైమ్‌ పత్రిక పేర్కొన్నది. వీటిని బాంబులతో నింపి నిర్ణీత లక్ష్యంపై పేలే విధంగా చేయవచ్చు. క్రెమ్లిన్‌ కూల్చివేసిన రెండు డ్రోన్లు ఇలాంటివే. పుతిన్‌ను లేదా మరే దేశ నేతనైనా ఇలాంటి వాటితో హతమార్చటం అంత తేలిక కాదు. అందుకే జనంలో దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు జెలెన్‌స్కీ ఇలాంటి వాటితో పబ్బం గడుపుకొనే ప్రచార ఎత్తుగడగా కొందరు వర్ణిస్తున్నారు. తాము కూడా రష్యన్‌ భూభాగంపై దాడులు జరపగలమనే సంకేతాలను పంపటం తప్ప ఇది మరొకటి కాదు. నిజానికి ఇలాంటి డ్రోన్లను ఒక్క క్రెమ్లిన్‌ మీదనే కాదు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ మీదకూ పంపవచ్చు.
           డ్రోన్ల ఉదంతంపై అమెరికా, ఇతర ప్రధాన దేశాల స్పందన వెల్లడి కావాల్సి ఉంది. తమ దాడులు తమ గడ్డ మీద తప్ప రష్యా మీద జరపటం లేదని జెలెన్‌స్కీ చేతులు దులుపుకుంటే కుదరదు. వీటిని తాము నమ్మటం లేదని అమెరికా అన్నా చెల్లదు. దీనికి ప్రతిగా జెలెన్‌స్కీనే లేపేయాలని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ పిలుపునివ్వటం పశ్చిమ దేశాల వలలో పడటమే. రేపు పశ్చిమ దేశాలే ఆ పని చేసి దాన్ని రష్యా మీద నెట్టగల సమర్ధులున్నారు. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఇలాంటి గిల్లి కజ్జాలు, కుట్రలతోనే ప్రారంభమయ్యాయి. పుతిన్‌ బతికి ఉన్నంత వరకు చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్‌ గతేడాది ఒక తీర్మానం చేసుకుంది. సీ జిన్‌పింగ్‌ ప్రారంభించిన శాంతి చర్చలను మొగ్గలోనే తుంచేందుకు జరిగిన కుట్రలో భాగంగా కూడా తాజా డ్రోన్‌ దాడి జరిగి ఉండవచ్చు. ఇలాంటి కుట్రలను లోకానికి వెల్లడిస్తూనే రాజకీయ పరిష్కారం కోసం పుతిన్‌ యంత్రాంగం రెచ్చిపోకుండా వ్యవహరించాల్సి ఉంది.

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌