Aug 17,2022 06:58

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోట బురుజు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఓ వైరుధ్యాల పుట్ట. దాదాపు 82 నిమిషాల సేపు సాగిన ఆయన ప్రసంగంలో 'అమృత్‌ కాల్‌', 'పంచ ప్రాణ్‌', 'వికసిత భారత్‌' అంటూ మాటల గారడీతో దేశ వాస్తవిక పరిస్థితిని మరుగుపరిచే ప్రయత్నం చేశారు. వచ్చే పాతికేళ్లలో సంపన్న భారత్‌ అవతరిస్తుందని ప్రధాని గొప్పగా ప్రకటించారు. రాజ్యాంగంపైన, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిపైన జరుగుతున్న దాడుల గురించి కానీ, అధిక ధరలు, నిరుద్యోగం, భారంగా మారుతున్న విద్య, వైద్యం వంటి ప్రజా సమస్యల గురించి కానీ ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. అందుకు నిర్దిష్ట ప్రణాళికలను నిర్దేశించకుండా అయిదు ప్రతిజ్ఞలు గురించి అతిశయంగా చెప్పారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ఉద్ఘాటనలు, ఇచ్చిన హామీల అమలు గురించి ఈ ప్రసంగంలో మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా, వచ్చే 25 ఏళ్లలో భారత్‌ రూపురేఖలు మార్చేస్తామని చెప్పడం ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందన్న సామెతను గుర్తుకు తెస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారత్‌ ఇప్పటికీ మానవాభివృద్ధి సూచిలో 131వ స్థానంలో (188 దేశాల్లో) ఉంది. మన కన్నా రెండు సంవత్సరాలు ఆలస్యంగా స్వాతంత్య్రం సాధించిన చైనా 2020 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ముందుకు సాగుతున్నది. పేదరికంపై పోరులో మనం ఎక్కడున్నాం? అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యల్ప తలసరి జిడిపి కలిగిన ఇటలీ (32,000 డాలర్లు) స్థాయికి చేరుకోవాలంటే భారత్‌ (1900 డాలర్లు) ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంటుంది.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, దేశంలో ప్రతిఒక్కరికీ ఇల్లు కల్పిస్తామని 2017లో ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేసిన మోడీ మరో రెండేళ్లలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసిన రాజకీయ ప్రసంగంలా ఉందే తప్ప దేశానికి మార్గ నిర్దేశం చేసేదిగా ఎంతమాత్రం లేదు. పేదరికాన్ని 25 శాతానికి తగ్గించామని చెప్పిన ప్రధాని, అదే నోటితో కోవిడ్‌ సంక్షోభ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇచ్చానని ఘనంగా ప్రకటించారు. అంటే దేశ జనాభాలో 61 శాతం మంది అన్నార్తులు ఉన్నారని ప్రధాని చెప్పకనే చెప్పారు.
   స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే సందర్భంలో ప్రధాని అస్మదీయుల పట్ల ఒక విధంగా, తస్మదీయుల పట్ల మరో విధంగా వ్యవహరించడం చాలా శోచనీయం. జాతిపితను మామూలు స్వాతంత్య్ర సమరయోధులు జాబితాలో చేర్చిన ఆయన, స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను పూర్తిగా విస్మరించడం మరీ దారుణం. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బ్రిటిష్‌ పాలకులకు క్షమాపణ లేఖలు రాసి జైలునుంచి బయటపడిన సావర్కర్‌ గురించి ప్రత్యేకంగా పొగడడం. జాతీయోద్యమంలో ఎలాంటి పాత్ర లేని ఆరెస్సెస్‌ మాజీ ప్రచారక్‌ నుంచి ఇంతకంటె ఏం ఆశించగలం ?
      అవినీతి, బంధుప్రీతి, కుటుంబ వారసత్వ రాజకీయాలపై పోరు తుది అంకానికి చేరుకుందంటూ ప్రధాని ఆర్భాటంగా ప్రకటించడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌. సకల అవినీతికి మూలమైన రాజకీయ అవినీతికి తలుపులు బార్లా తెరుస్తూ ఎలక్టోరల్‌ బాండ్ల విధానాన్ని తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం అవినీతిపై పోరాడతానని చెప్పడం ఎవరిని మభ్యపుచ్చడానికి? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎలక్టోరల్‌ బాండ్ల విధానాన్ని తక్షణమే రద్దుచేయాలి. ఆ పని చేయకుండా అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగానే ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యత, నారీశక్తి గురించి ప్రధాని చెప్పే మాటలకు, ఆచరణకు అసలు పొంతనే కుదరడం లేదు. హిందుత్వ మూకలు మత విద్వేషాలను రెచ్చగొడుత్తూ దేశంలో యథేచ్ఛగా చెలరేగుతుంటే ఎన్నడూ నోరు మెదపని వ్యక్తి బహుళత్వం గురించి హితోక్తులు వల్లించడాన్ని ఏమనుకోవాలి? భారతదేశ విదేశాంగ విధానాన్ని సామ్రాజ్యవాద అనుకూల విధానంగా మార్చేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఇతర దేశాలు ఇచ్చే సర్టిఫికెట్‌పై భారత్‌ ఆధారపడాలా అని ప్రశ్నించడం విచిత్రంగా ఉంది. మహిళల భద్రత గురించి ఎర్రకోట నుంచి ఆయన ఉద్ఘాటించిన కొద్ది సేపటికే తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో బిల్కిస్‌ బానో సామూహిక హత్యాచార కేసులో జీవిత ఖైదు పడి జైలులో ఉన్న 11 మందికి ఆ రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడాన్ని దేశం యావత్తూ గమనించింది. స్వాతంత్య్ర సమర యోధుల కలలను సాకారం చేసేందుకు కావాల్సింది ఇటువంటి మోసపూరిత ప్రకటనలు కాదు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించే దృఢ సంకల్పం. అదే ఈ ప్రభుత్వానికి కొరవడింది.