May 07,2023 09:31

'హలో సురేంద్ర గారూ! ఈ రోజు పేపర్‌ చూశారా? ప్రజాశక్తి పేపర్తో సహా, చూడండి. మీ దంపతులు నిన్న సరస్వతమ్మ అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన ఫోటో వచ్చింది. నేను ఫోటోలు ఇచ్చి విలేకర్లకు చెప్పి మరీ వేయించాను. మంచి పనులకు సంబంధించిన విషయాలను వాళ్లు తప్పకుండా వేస్తారు. ఆ ఫోటో పేపర్లో చూసుకుంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది.'
'అలాగా రమేష్‌ గారు! ఈ రోజు ఇంకా పేపరు చూడలేదు. ఇప్పుడే చూస్తాను. చాలా థాంక్స్‌ రమేష్‌ గారు! నిన్నటి రోజున మంచిపని చేయించారు. పైగా దానిని నలుగురికి తెలిసేటట్లు చేశారు. ఒక్క మాట. ఆ వృద్ధాశ్రమము వారు నేను ఇచ్చిన డబ్బుకు రశీదు లాంటిదేమీ ఇవ్వలేదు. రశీదు ఇస్తారని మీరు చెప్పారుగా.'
'రశీదు ఇవ్వలేదా? నిన్న అక్కడి గుమస్తా గారు మనం వెళ్ళిన సమయానికి లేరనుకుంటాను. ఆశ్రమం చూసుకునే పెద్దాయనే ఉన్నారుగా. వారంతా చూశారు. రశీదు ఇస్తారులేండి. దానికోసం అక్కడికి మీరేం వెళ్తారు? నేను ఏదో ఒక పనిమీద, అటువైపుకు వెళుతూనే ఉంటాను. వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తెచ్చిస్తాను లెండి. మీ శ్రీమతి గారికి కూడా నా నమస్కారాలు చెప్పండి.. వుంటాను.'
'సరోజా! ఓ సరోజా! ఇలా హాల్లోకి రా. కళ్ళజోడు కూడా పెట్టుకో.'
'ఏంటండీ ఆ గావు కేకలు. ఇంకా 7:30 అయినా కాలేదు. అప్పుడే టిఫిన్‌ కోసమేనా అలా కేకలు పెడుతున్నారు? ఇలా వంటింట్లోకి వచ్చి టిఫిన్‌ ప్లేట్‌ తీసుకెళ్లండి. దోసెలు వేస్తున్నాను.'
'టిఫిన్‌ కోసం కాదులే. నేనే వస్తున్నాను. ఇదిగో జిల్లా వార్తలు ఉన్న పేజీలో మన ఫోటో వచ్చింది. పాయసం గిన్నెలోని గరిటెతో సహా ఫోటోలో పడ్డావు. చూసుకో.' అంటూ పేపరును భార్య కళ్ళ ముందు ఎత్తి పట్టుకున్నాడు సురేంద్ర.
'నిజంగానేనండీ. మీ చేతిలో కూడా కూర గిన్నె, గరిటె ఉన్నాయి. ఈసారి మన 50వ పెళ్లిరోజు బాగా సంతృప్తిగా జరుపుకునేటట్లు ఆ రమేష్‌ చక్కని సలహా ఇచ్చాడు. మన పిల్లలు ఫంక్షన్‌ హాల్‌లో వేడుగ్గా జరుపుతామన్నారు. కానీ మనమే ఒప్పుకోలేదు. నాకు ఇలాగే బాగున్నది. నా మనసుకు సంతోషంగానూ ఉన్నది. అనుకోకుండా నిన్నటి రోజున అంతమంది వృద్ధుల మధ్య గడిపాం. పైగా వారికో పూట భోజనం పెట్టగలిగాం. వాళ్లంతా పేద, అనాధ వృద్ధులు. దాతల చందాల మీద బతుకుతున్నారు. మన మనుమడిదో, మనుమరాలిదో పుట్టినరోజు వచ్చినప్పుడు మరలా ఇంకొకసారి వెళ్లి, వాళ్లకు ఒకపూట భోజనం పెట్టి, వద్దాం అండి. పుట్టినరోజులకని పిల్లలకు కానుకలు ఇచ్చే బదులు ఈ అనాధ వృద్ధుల కోసం ఖర్చుపెడితే బాగుంటుంది.'
'అలాగేలే సరోజా. ఆలోచిద్దాం. నేను ఈ సంగతి గుర్తుపెట్టుకుంటాను.'
'నేను నిన్న అక్కడ కొంతమంది వృద్ధులతో మాట్లాడానండీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. వాళ్ల మనసుల్లో ఎంతో వ్యధ కనపడింది. ఒక మామ్మ బాగా బతికినావిడే. ఆమెవి పదిమందికి పెట్టిన చేతులు. అయిన వాళ్లందరినీ ఆదరించింది. భర్త పోయాడు. కడుపున పుట్టిన పిల్లలు లేరు. చుట్టాలు వాళ్ళ అవసరాలు పేరు చెప్పి, ఈమె దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నారు. ఒకరి ఇంట్లో పెళ్ళికి సాయం, ఒకరికి కొడుకు చదువుకు సాయం, మరొకరి ఆరోగ్యానికి డబ్బు సాయం. ఇలా అందరికీ అందించింది. చివరకు తాను ఒట్టి చేతులతో మిగిలిపోయింది. సాయం పొందినవారు వట్టిపోయిన పాడి పశువును తోలేసినట్లుగా ఈమెకు ముఖం చూపించటం మానేశారు. ఉన్న ఇల్లు పోగొట్టుకుని, తప్పనిసరి పరిస్థితులలో ఇక్కడ చేరింది.
మరొక పెద్దాయన బాధలు ఎక్కువే. పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాడు. ఉన్నదంతా హరించుకుపోయింది. ఆరోగ్యం దెబ్బతిన్నది. భార్య లేదు. పిల్లలంతా ఎవరికి వారు తప్పించుకున్నారు. వయసైపోయింది. పూట గడవక తెలిసినవారి ద్వారా ఇక్కడ చేరాడు. వీళ్లంతా అభిమానం చంపుకుని, ఇక్కడ బతుకుతున్నారు.
అసలైన అనాధలు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ చాలీచాలని బట్టలు. ఉడికిపోయిన వయసు. తరిగిపోయిన ఆరోగ్యం. ఏదో బతకాలికనుక భారంగా బతుకుతున్నారని పించింది. వృద్ధాశ్రమము వారు ఇలాంటి కొందరిని పెద్ద మనసుతో చేరదీసి ఆదరిస్తున్నారు.
'ఇదంతా ఎప్పుడు తెలుసుకున్నావు సరోజా?'
'మీరు ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడేటప్పుడు నేను అటూ ఇటూ తిరిగి వీళ్ళతో మాట్లాడాను. వాళ్లందరినీ చూస్తూ వాళ్ల మాటలు వింటుంటే కడుపులో దేవినట్లు ఉన్నది. ఆ రమేష్‌ గారి చేతికి మనం 20,000 ఇచ్చాం. మంచి భోజనం వృద్ధులకు పెట్టించమన్నాం. అక్కడ వృద్ధులు 50 మందే ఉన్నారు. నిన్నటి రోజున వాళ్లకు ఇంకా మంచి భోజనం పెడతారని అనుకున్నాను. ఏదో సాదా సీదాగానే పెట్టి, ముగించారు. నాకు ఏం బాగాలేదు.'
'నీది మరీ జాలి గుండె సరోజా. నిన్నటి రోజున వాళ్ళందరినీ ఆ స్థితిలో చూసి నాకు చాలా బాధనిపించింది.'
'వారిలో కొంతమంది మన చేతుల వంక ఆశగా చూశారండీ. వాళ్లు ఏ పండో, ఫలమో ఇస్తామని ఆశించి ఉండవచ్చు. మనకు తోచలేదు. భోజనం పెడితే పెట్టాం. పళ్ళు కూడా కొనుక్కు వెళ్లి తలా ఒకటి ఇస్తే బాగుండేది అనిపించింది. భోజనములోకి కూడా మంచి స్వీటు ఏం పెట్టలేదు. సగ్గుబియ్యపు పాయసం, నిమ్మకాయ పులిహోర చేసి, సరిపెట్టారు. ఆ రమేష్‌ కు ఫోన్‌ చేసి అడగాలనిపిస్తున్నది. మా పెళ్లిరోజు భోజనం ఇలా పెట్టించావ్‌ ఏమిటయ్యా అని వాళ్ళందరి ముందు కాకుండా విడిగా అడగాలని ఉన్నది.'
'ఇప్పటిదాకా పేపర్లో ఫోటో చూసుకున్న ఆనందంలో ఉన్నాను. అని నీ మాటలతో, నేను ఆలోచనలో పడ్డాను సరోజా. కానీ తొందరపడి ఆ రమేష్‌కు ఫోను చెయ్యకు. వృద్ధాశ్రమం వారికి భోజన ఖర్చులతో పాటు ఇంకా ఇతర ఖర్చులు ఉంటాయి. వంట మనిషి, గుమస్తా, పనివాళ్ళు ఇలా జీతాలు ఇవ్వాలి. కరెంటు, అక్కడున్నవారికి మందు, మాకుల బిల్లులు ఉంటాయి. మనము అర్థం చేసుకోవాలి. అయినా రమేష్‌ కూడా, నిస్వార్ధంగా ఊరంతా తిరిగి దాతల్ని పోగుచేసి సాయం చేస్తున్నాడు. అతన్ని మనం తప్పు పట్టలేము. పద. మన రోజువారి పనుల్లో పడదాం.'
సరోజకు టిఫిన్‌ తింటున్నా, కూరగాయలు కోసుకుంటున్నా, సరస్వతమ్మ అనాధ వృద్ధాశ్రమము, అక్కడి వృద్ధులే మాటిమాటికి కళ్ళ ముందు కనపడుతున్నారు.
'హలో వదినా! భలే వాళ్లు మీరు. ఏంటి ఇలా చేశారు? మీ 50వ పెళ్లిరోజు వేడుకను మీ పిల్లలు ఎంతో ఆడంబరంగా జరుపుతారు. ఆ వేడుకకు పిలుపు వస్తుందని నేను ఎదురు చూస్తుంటే పిలుపు లేదు. ఏం లేదు. పైగా వెళ్లి వృద్ధాశ్రమంలో గడిపి వచ్చారు. ఈ ఆలోచన నీదా? మా అన్నయ్యదా? మీరు చేసిన పని నాకే మాత్రం నచ్చలేదు. మీ 50వ పెళ్లిరోజును ఇలా జరుపుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు' అన్నది నిష్టూరంగా మాధవి.
'మరేం లేదు మాధవీ! అనవసరంగా ఎందుకు లేనిపోయిన ఆడంబరం అనిపించింది. ఖర్చుకు వెనకాడి కాదనుకో. నిన్నటి రోజున మీరు, పిల్లలువస్తే, హంగామా చేస్తారనిపించి మీకు ఎవరికీ చెప్పలేదు. కనీసం ఇంట్లోనైనా కేక్‌ కట్‌ చేయండి. మేము వస్తామని పిల్లలిద్దరూ గొడవపెట్టారు. నాకెందుకో ఇష్టం లేకపోయింది. రమేష్‌ అనే అతను ఇలా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం సంగతి చెప్పాడు. ఇదే బాగుంటుందనిపించింది. మీ అన్నయ్యా, నేను వెళ్లి వచ్చాం. ఒక చిన్న మంచి పని చేశామనిపించింది. కేవలం లేనిపోయిన ఆడంబరం ఎందుకులే అనిపించింది. అంతేకాని, మిమ్మల్ని ఎవరిని తేలిక చేయాలని కాదు. అయినా నీకు ఈ సంగతి ఎలా తెలిసింది?'
'ఎవరో చెప్పేదేంటి వదినా? పేపర్లో వేయించుకున్నావుగా? మామూలు వేడుకైతే పేపర్లో రాదుగా.' అని నవ్వేసి 'నేనొకసారి వస్తానులే వదినా. ఉంటాను.' అన్నది మాధవి.
'ఈ రమేష్‌ భలే పబ్లిసిటీ కూడా ఇచ్చాడే' అనుకున్నది సరోజ.
వృద్ధాశ్రమం గోడలు ఇప్పుడే అంతా చమ్మచమ్మగా ఉన్నాయి. వచ్చేది చలికాలం. మరింత తేమ పీల్చుకుని, చల్లగా అయిపోవచ్చు. అక్కడి వాళ్ళందరికీ కప్పుకోవడానికి తలో మంచి దుప్పటి కొనిస్తే బాగుండును అనుకున్నది. పిల్లలతోనూ, భర్తతోనూ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నది.
రవీంద్రకెందుకో వృద్ధాశ్రమం వారి నుంచి రశీదు తీసుకుని దాచుకోవాలని అనిపించింది. రమేష్‌కు ఫోన్‌ చేశాడు.
'రమేష్‌ గారు! రశీదు ఏమైనా తీసుకున్నారా? నేను ఫైలులో పెట్టుకుందామని అనుకుంటున్నాను.'
'అయ్యో! లేదు, సురేంద్ర గారూ! అటువైపుకు వెళ్లడానికి కుదరలేదు. మీ కోసమైనా పనిగట్టుకుని వెళ్లి, తెచ్చిస్తాను. దాతల కోసమే తిరుగుతున్నాను. ఏదో పరోపకారం. ఉడతా భక్తిగా వృద్ధులకు ఏదైనా చేయాలన్న తాపత్రయం. నాకు ఆర్థికపరంగా అంత ఇబ్బంది లేదు. అందుకని నాకు తోచింది చేస్తున్నాను.' అన్నాడు వినయంగా.
'మీలాంటి మంచి బుద్ధి అందరికీ ఉండదులెండి. ఏదో రశీదు ఉంటే గుర్తుగా ఉంటుంది. వాకింగ్‌కి వెళ్లినప్పుడు నలుగురు మిత్రులకూ చూపించి, విషయం ఇది అని, చెబుదామనిపించి మీకు ఫోన్‌ చేశాను.'
'పర్వాలేదు. అయినా మీలాంటివారు దానధర్మాలు చేస్తారు గానీ, దానికి లెక్కలు, రశీదులు అని చూసుకోరు. మీరు అంతే అనుకోండి. కాకపోతే గుర్తు కోసం అంటున్నారుగా. ఈరోజు ఇద్దరు ముగ్గురు, మాట్లాడదాం రమ్మని ఫోన్‌ చేశారు. వాళ్ల దగ్గరకు వెళ్లాలి. అయినా వీలు చూసుకుని రశీదు తెచ్చి, మీ ఇంట్లో ఇస్తాను. సరేనా? మరి ఉండనా?' అంటూ రమేష్‌ ఫోన్‌ పెట్టేశాడు.
ఆ వెంటనే రమేష్‌ రామారావు దంపతుల్ని కలవడానికి వెళ్ళాడు.
'నమస్కారం రామారావు గారు! వీళ్లందరి లిస్టు, ఈ పేపర్లలో ఫోటోలు చూడండి. వీళ్లంతా కూడా మీలాంటి దాతలే. ఇప్పుడు మీరు కూడా మీ మనవడి పుట్టినరోజు సందర్భంగా ఓ 50 మంది అనాధవృద్ధులకు అన్నదానం చేయండి. స్వయంగా మీ దంపతులే వచ్చి మీ చేతులతో వాళ్లకు పెట్టండి. ఆ అనాధవృద్ధులందరి ఆశీస్సులు మీ మనుమడికుంటాయి. ఒక పూట వాళ్లు, తృప్తిగా విందు భోజనం చేస్తారు. ఎప్పుడూ మనుమళ్లకు, మనుమరాళ్లకు కానుకలు ఇస్తూ ఉంటారు. ఈసారి ఇలా వాళ్ల పేరుతో అన్నదానం చేయండి. చాలా మంచి పని చేసిన పుణ్యం మీకు వస్తుంది.' అన్నాడు రమేష్‌. రామారావు దంపతులు ఒప్పుకున్నారు.
'రమేష్‌ గారు! మీరు అడిగిన 20,000 ఇవ్వలేం. 15000 మాత్రం ఇవ్వగలం. మాకు ఈ వయసులో, మందు, మాకు అంటూ చాలా ఖర్చులు ఉంటాయి. మీ మాట మీద ఈ అన్నదానాన్ని ఒప్పుకున్నాం.'
'అలాగే రామారావు గారు! బలవంతం ఏమీ లేదు. దాంట్లోనే సర్దుకుందాం. డబ్బు ఇప్పుడు ఇస్తారా? వృద్ధాశ్రమం వారికి అందజేస్తే పాపం వాళ్లు కావలసిన, సరుకులు తెప్పించుకుంటారు. రశీదు మాత్రం మీకు వృద్ధాశ్రమము వారిచేతే ఇప్పిస్తాను.'
రామారావు ఇచ్చిన డబ్బు బ్యాగులో పెట్టుకుంటూ 'చాలా థాంక్స్‌ రామారావు గారు! చెప్పగానే అర్థం చేసుకున్నారు. మీలాంటి వాళ్ళను చూచి మరో నలుగురు ముందుకు వస్తారు. వృద్ధాశ్రమం వారికి కొంత చేయూత. వృద్ధులకు కడుపునిండా తిండి దొరుకుతుందన్న ఆశ. అంతకన్నా ఇంకేం లేదు. రేపు 11 గంటలకల్లా సరస్వతమ్మ అనాధ వృద్ధాశ్రమం దగ్గరకు వచ్చేసేయండి. నేనక్కడే ఉంటాను. వాళ్లందర్నీ పరిచయం చేస్తాను.' అంటూ రమేష్‌ సెలవు తీసుకున్నాడు.
సరాసరి తన ఇంటికి వెళ్లి రమేష్‌ వాలు కుర్చీలో తీరుబాటుగా పడుకున్నాడు. కాఫీ తెమ్మని భార్యను కేకేశాడు. ఐదు నిమిషాల్లో ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది.
కాఫీ తాగుతూ రమేష్‌ మనసులో లెక్కలు వేయసాగాడు. 'మొన్న రవీంద్రగారు ఇచ్చిన 20 వేలలో 2000 సరస్వతమ్మ అనాధ వృద్ధాశ్రమపు గుమాస్తాకిచ్చి ఆ రోజు వాళ్లకు డబ్బు తాలూకు రశీదు ఇవ్వకుండా ఆపాను. మరో రెండు వేలు ఖర్చు పెట్టి నా పనుల్లో నాకు తోడ్పడేవారికి పార్టీ ఇచ్చాను. 6000నా జేబులో వేసుకున్నాను. మిగతా పదివేలు వృద్ధాశ్రమం వారికి ఇచ్చాను. పదివేలకే రశీదు తీసుకుని, వాళ్ళు ఇలాగే ఇస్తారని రవీంద్ర గారికి చెప్తాను. దేనికైనా బ్లాక్‌, వైట్‌ అంటూ ఉంటాయి కదా అని బుకాయించాలి. ఇప్పుడు రామారావు దంపతులు ఇచ్చిన దాంట్లో ఎంత మిగిల్చవచ్చో చూడాలి. ఎవరైనా నిలదీస్తే నా కమీషన్‌ తీసుకున్నానని చెప్తాను. లాభం లేనిదే ఎవడు మాత్రం ఈ లోకంలో పనిచేస్తాడు? ఆ మాత్రం జనాలకు తెలియదా? ఇవాల్టికి ఇలా చెప్తాను. తర్వాతి సంగతి తర్వాత చూడాలి. దరిద్రం ఉన్నచోట దాతలు ఉంటారు. ఆ దాతల్ని వెతికి పట్టుకునే నాలాంటి తెలివైనవాళ్ళూ ఉంటారు.' అనుకుంటూ రమేష్‌ ఖాళీ కాఫీ కప్పు పక్కన పెట్టాడు.

దాసరి శివకుమారి
9866067664