
జీవితం ఎన్నో సవాళ్లను మన ముందుంచుతుంది. వాటన్నింటినీ ఎదుర్కొని కొంతమందికైనా స్ఫూర్తిగా నిలవాలంటే ఎంతో కఠోర శ్రమ, మరెంతో దృఢసంకల్పం కావాలి. వైకల్యం బారిన పడ్డ ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఆ కోవకి చెందిన వారే. ఎన్నో సవాళ్ల మధ్య విభిన్న కళల్లో రాణిస్తూ ఎంతోమంది చూపును తమవైపు తిప్పుకుంటున్నారు. కర్నాటక ఉడిపికి చెందిన గణేశ్ కులాల్ పంజిమార్ (35), సుమా పంజిమార్ (22) పెన్సిల్, నూనె, యాక్రిలిక్ వంటి వివిధ మాధ్యమాలతో వందల కొలది ఆసక్తికరమైన కళాకృతులు తీర్చిదిద్దుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ కళాకృతులను ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గణేష్ ఇప్పటివరకు 700 కళాఖండాలు తయారుచేస్తే, సుమ తనకిష్టమైన క్విల్లింగ్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్‌లో వందలకొలది కళాకృతులు తయారుచేస్తోంది. ఆస్టియోజెనిసిస్ ఇంపెర్ఫ్‌క్టా (ఓఐ) అనే జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతున్న వీరిలో వయసుకు తగ్గట్టుగా ఎముకల అభివృద్ధి జరగలేదు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో పెళుసైన, పగుళ్లతో కూడిన ఎముకలు శరీర ఎదుగుదలకు అవరోధంగా ఉంటాయి. ఐదేళ్ల వయసు నుండి గణేష్, ఏడు నెలల వయసు నుండి సుమ ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వైకల్యంతో సుమ స్కూలుకు కూడా వెళ్లలేదు. ఆరో తరగతితోనే చదువు ఆపేసింది. 8 సర్జరీలు చేయించుకున్నా ఫలితం లేక ఇంటికే పరిమితమైంది. సర్జరీల తరువాత గణేష్ బరువు 22 కేజీలకే పరిమితమైంది.

సవాళ్లతో సహవాసం
బిడ్డల పరిస్థితికి తీవ్ర ఆవేదనకు గురైన తండ్రి ఈ అన్నాచెల్లెళ్ల బాధ్యతను భార్యకి అప్పగించి కన్నుమూశాడు. భర్త మరణం, బిడ్డల అనారోగ్యం ఆ తల్లికి ఊపిరాడనీయనంత కష్టం తెచ్చిపెట్టింది. అయినా పిల్లల ఆశలకు, కలలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. వారి వల్ల కాదని నిరుత్సాహపర్చలేదు. పిల్లలు ఎంచుకున్న మార్గం వైపు అడుగులు వేయడంలో ఎప్పుడూ ముందుండేది.
తొలిగా అమ్మ చిత్తరువు
తమ కోసం అమ్మ పడే ఆవేదన, బాధను చూస్తూ పెరుగుతున్న గణేష్ తల్లిపై తనకున్న ప్రేమను ఎలాగైనా చెప్పాలని పరితపించేవాడు. ఒకరోజు తన తల్లి ఛాయాచిత్రాన్ని పెన్సిల్‌తో అందమైన బొమ్మగా చిత్రీకరించి ఆమెకు బహుమతిగా ఇవ్వాలని ప్రయత్నించాడు. ఆ చిత్తరువు ఛాయాచిత్రాన్ని తలపించేంత అద్భుతంగా గీశాడు. అప్పుడే అతనిలో దాగున్న ప్రతిభ బయటికి తెలిసింది. బిడ్డ ఇచ్చిన ఈ చిత్తరువు అమ్మలో ఎక్కడలేని ఆనందాన్ని, ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. కళలో రాణించేలా గణేష్‌ను ప్రోత్సహిస్తూ వచ్చింది. అమ్మ ఇచ్చిన ధైర్యంతో వేల్పుల చిత్రపటాలను, జంతువులను, ఫొటో ఆల్బమ్స్‌ని తన కుంచెతో అద్భుతంగా మలిచేవాడు గణేష్. క్రమంగా అతని కళను ప్రేమించేవారు తనకు మద్దతు ఇచ్చేవారు పెరిగారు. 2021లో జిల్లా స్థాయిలో కన్నడ రాజోత్సవ అవార్డు తీసుకునేంత ఎత్తుకు గణేష్ ఎదిగారు.

అన్న స్ఫూర్తితో ...
'గణేష్ పంజిమర్ ఆర్ట్స్' పేరుతో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి తన కళారూపాలను ప్రదర్శిస్తున్నారు గణేష్. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా అన్న చేస్తున్న కళారూపాలను ఫోన్ ద్వారా రికార్డింగ్ చేయడం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యత చెల్లి సుమ తీసుకుంది. అన్నను స్ఫూర్తిగా తీసుకుని తను కూడా వందకు పైగా కళారూపాలను తయారుచేసింది. సుమ, 'రిసైన్ ఆర్ట్' ద్వారా కీచైన్స్‌ను మరింత ఆకర్షణీయంగా తయారుచేస్తున్నారు. ఆమె తయారుచేసిన సిల్క్ థ్రెడ్ ఆర్ట్, క్లే ఆర్ట్, క్విల్లింగ్‌లు చూపరులను కన్నుతిప్పుకోనియ్యవు. తన కళకు గుర్తింపుగా ఆమె కూడా 20 సార్లు ఘనంగా సత్కరింపబడ్డారు.
'గణేష్, సుమ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నో అడ్డుగోడలను దాటుకుని ఈ స్థాయికి ఎదిగారు. చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎన్ని సవాళ్లున్నా ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదగాలో ఈ అన్నాచెల్లెళ్లు నిరూపించారు. వీరి ఆత్మవిశ్వాసం ముందు వారి సమస్య చిన్నదైపోయింది. వీరు సాధించిన ఈ ప్రగతి ఎంతోమంది వైకల్యబాధిత పిల్లలున్న తల్లిదండ్రులకు గొప్ప స్ఫూర్తి. వీరిని చూసిన తరువాత తమ పిల్లల్లో దాగున్న కళను వెలికితీయడంలో ఆ తల్లిదండ్రులు కృషి చేస్తారని నేను కచ్చితంగా చెబుతాను' అంటున్నారు గణేష్, సుమల ఫ్యామిలీ డాక్టరు డాక్టర్ అన్నయ్య కులాల్ ఉల్తూర్.
గణేష్, సుమ ఇప్పటికి ఎన్నో ఎగ్జిబిషన్‌ల్లో తమ కళారూపాలను ప్రదర్శించారు. 'ఏ వేదిక అయినా, సత్కార సభ అయినా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్లేటప్పుడు నిర్వాహకులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లడం పెద్ద సమస్య. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మా ఎముకలు విరిగిపోతాయి. మేము మరింత అనారోగ్యానికి గురవుతాం. అందుకే ఇటువంటి కార్యక్రమాలను చాలా తక్కువగా హాజరవుతాం' అని చెబుతున్న ఈ అన్నాచెల్లెళ్లు ఎంతోమందికి మార్గదర్శకం.