Aug 14,2023 22:41

చెన్నై : బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఇక్కడ జరుగుతున్న 11వ జాతీయ సదస్సులో నూతన కార్యవర్గాన్ని సభ్యులు సోమవారం ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎస్‌ఎస్‌ అనిల్‌ (కేరళ), ప్రధాన కార్యదర్శిగా దేబాశిష్‌ బసు చౌధురి (పశ్చిమ బెంగాల్‌), సందీప్‌ పాల్‌ (పశ్చిమ బెంగాల్‌) కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఆఫీస్‌ బేరర్లుగా జైదీప్‌ దాస్‌ గుప్తా, ఆర్‌ అజయకుమార్‌, సి రాజీవ్‌ (కేరళ), సాజి ఓ వర్గీస్‌ (కేరళ), రంజన్‌ రాజ్‌, ప్రదీప్‌ శర్మ, సునీల్‌ రాజ్‌ పిఎస్‌ (వైస్‌ ప్రెసిడెంట్లు). మనోదీప్‌ ఘోష్‌, ఎస్‌ హరిరావు (కార్యదర్శులు) ఎన్నికయ్యారు.

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు బలోపేతం : బెఫీ జాతీయ సదస్సు పిలుపు

 ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని బలోపేతం చేయాలని, మతతత్వానికి వ్యతిరేకంగా రాజీలేని వైఖరి తీసుకోవాలని బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) జాతీయ సదస్సు పిలుపునిచ్చింది. సిఐటియు జాతీయ కార్యదర్శి ఆర్‌ కరుమలైయన్‌, ఆశిష్‌ సేన్‌ సోమవారం ప్రసంగించారు. నయా ఉదారవాదం పౌరులకు ఎటువంటి హక్కులను ఇవ్వదని, ప్రతిదీ మార్కెట్‌ నిర్ణయిస్తుందని విమర్శించారు. నివేదికపై మూడు రోజులపాటు జరిగిన చర్చల్లో దాదాపు వంద మంది ప్రతినిధులు మాట్లాడారు. మహిళా బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, తాత్కాలిక సిబ్బందిని స్థిరీకరించాలని, రిజర్వ్‌ బ్యాంక్‌ స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని, సహకార రంగంపై దాడులను అరికట్టాలని సదస్సు తీర్మానించింది. బ్యాంకులను కాపాడాలని, ఎన్‌పిఎస్‌ రద్దు చేయాలని, అందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, మాజీ సైనికోద్యోగుల జీతాల నిర్ణయాల్లోని క్రమరాహిత్యాలను సరిదిద్దాలని, బిజినెస్‌ కరస్పాండెంట్ల సర్వీస్‌ పే షరతులను అమలులోకి తీసుకురావాలని, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని, మతతత్వాన్ని పెంచే ధోరణులను ఒంటరి చేయాలని, లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని తదితర తీర్మానాలను సదస్సు ఆమోదించింది.