Jul 16,2023 08:56

పుల్లని రుచితో.. పలు పోషకాలతో తులతూగే ఆకుకూర గోంగూర. ఇది ఆంధ్ర్రమాతగా వెలుగొందుతోంది. దీని శాస్త్రీయ నామం హైబిస్కస్‌ కన్నాబినస్‌. దీనిలో ఐరన్‌, విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వంటకాలలో గోంగూర పులిహోర, పప్పు, రోటి పచ్చడి, నిలువ పచ్చడి, తాలింపు కూర.. మనకెంతో ఇష్టమైన రకాలుగా ఉండేవి. ప్రస్తుతం మటన్‌, రొయ్యలు, చికెన్‌లతో నాన్‌వెజ్‌ కాంబినేషన్‌లోనే కాక పనీర్‌, పాస్తాలతో కలిపిన వంటల్లో వ్యాపారపరంగానూ, ఇళ్ళలో స్వయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ వెరైటీ గోంగూర రుచులను ఎలా చేయాలో తెలుసుకుందాం..

బోటీతో..

boti

కావలసినవి : గోంగూర - 150 గ్రా, బోటీ - 1/2 కేజీ, నూనె - 1/4 కప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు - 4, ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ -స్పూను, ఉప్పు-తగినంత, కారం-2 స్పూన్లు, ధనియాలపొడి-2 స్పూన్లు, చింతపండు గుజ్జు- 4 స్పూన్లు, గరంమసాల - 2 స్పూన్లు, కొత్తిమీర-కొద్దిగా.
తయారీ : బోటీ మాంసాన్ని ముందుగా ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. బాండీలో నూనె వేడిచేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి. తర్వాత శుభ్రం చేసిన గోంగూర, ఉప్పు వేసి, ఆకు మెత్తబడేంత వరకూ వేయించాలి. దానిలో చింతపండు రసం, ఉడికించిన బోటీ వేసి ఐదు నిమిషాలు తిప్పుతూ వేయించాలి. తర్వాత పెద్ద గ్లాసు నీళ్ళుపోయాలి. ఈ నీరు ఇగిరి పోయేంత వరకూ మీడియం ఫ్లేంమీద ఉడికించాలి. కూర పొడిగా అయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కూరను దింపేయాలి. అంతే గోంగూర బోటీ మసాల ఘుమఘుమల కూర రెడీ.

పచ్చడి ..

gongora

కావలసినవి : గోంగూర - 1/4 కేజీ, నువ్వులు - 50 గ్రా, మెంతులు-స్పూను, ఆవాలు - స్పూను, ఎండుమిర్చి -20, చింతపండు - 4 రెబ్బలు, నూనె - 3/4 కప్పు, పచ్చిమిర్చి - 4, ఉప్పు - తగినంత, పసుపు - 1/4 స్పూను
తయారీ : నువ్వులు దోరగా వేయించి, చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి. అదే బాండీలో స్పూను నూనె వేడిచేసి మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత చింతపండుతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి రెండింటినీ పక్కనుంచుకోవాలి.
బాండీలో నూనె వేడిచేసి శుభ్రం చేసిన ముదురు ఎర్ర గోంగూర, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. నూనె కూర నుంచి విడివడే వరకూ దీన్ని వేయించి, స్టౌ ఆఫ్‌ చేయాలి. దీనికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి కారం, నువ్వులపొడి వేసి, బాగా కలపాలి. అంతే నోరూరించే నువ్వుల గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇరవై రోజులపాటు తాజాగా ఉంటుంది.

పులిహోర..

pulihara

కావలసినవి : బియ్యం-11/2 కప్పులు, గోంగూర-100 గ్రా., నీళ్ళు -21/4 కప్పులు, చింతపండు గుజ్జు -4 స్పూన్లు, పసుపు-1/2 స్పూను, ఉప్పు - తగినంత, ఆవాలు, మెంతులు-స్పూను, ఎండుమిర్చి-15, నూనె-తగినంత
తాలింపుకు : నూనె-1/4 కప్పు, వేరుశనగ పప్పు-స్పూను, ఆవాలు-స్పూను, పచ్చి శనగపప్పు-2 స్పూన్లు, మినప్పప్పు-స్పూను వేసి ఎర్రగా వేపాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి - తగినన్ని.
తయారీ : కుక్కర్‌లో కడిగిన బియ్యం, నీళ్ళు, పసుపు, కొంచెం నూనె వేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకూ హై ఫ్లేం మీద ఉంచి, తర్వాత సిమ్‌లో పెట్టి ఒక విజిల్‌ రాగానే స్టౌ ఆఫ్‌ చేయాలి. ప్రెజర్‌ అయ్యాక అన్నాన్ని బయటకు తీసి ఆరనివ్వాలి.
బాండీలో స్పూను నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించాలి. చల్లారిన ఈ మూడింటినీ మెత్తగా మిక్సీ పట్టాలి.
అదే బాండీలో రెండు గరిటెల నూనె వేడిచేసి, శుభ్రం చేసిన ముదురు ఎర్ర గోంగూర, ఉప్పు, పసుపు వేసి, నూనె కూర నుంచి విడివడే వరకూ వేయించాలి. దానిలో చింతపండు గుజ్జు వేసి నూనె పైకి తేలుతుందనగా స్టౌ ఆఫ్‌ చేసి ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసి బాగా కలపాలి. వేడి తగ్గిన తర్వాత అన్నంతో బాగా కలపాలి.
మరో బాండీలో తాలింపు కోసం రెండు గరిటెల నూనె వేడిచేసి, వేరుశనగ పప్పులు, ఆవాలు, పచ్చిశనగ పప్పు, మినప్పప్పు వేసి ఎర్రగా వేపాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి అర నిమిషం పాటు వేయించాలి. దీన్ని పులిహోరకు కలపాలి. అంతే.. ఘుమఘుమలాడే గోంగూర పులిహోర రెడీ. రెండు రోజులవరకు ఇది తాజాగా ఉంటుంది.