Sep 26,2023 20:36
  •  తెలంగాణలో రాజకీయ రాద్దాంతం చేస్తానంటే ఎలా..?
  •  చంద్రబాబు అరెస్టు విషయంలో మాది తటస్థ వైఖరి : మంత్రి కెటిఆర్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం.. ఆ పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు అన్నారు. ఎపిలో పంచాయితీలకు తెలంగాణలో రాజకీయ రాద్దాంతం చేస్తామంటే ఎలా..? అని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్‌ మాట్లాడారు. ర్యాలీలు, ఆందోళనలతో టిడిపి, వైసిపిలు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై బిఆర్‌ఎస్‌ నాయకులూ స్పందించారని, అయితే అది వారి వ్యక్తిగత వ్యవహారమన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ పార్టీది తటస్థ వైఖరని స్పష్టం చేశారు. ఎపిలో రాజకీయ పరినామాలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావమూ చూపవని, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదనిచెప్పారు. ర్యాలీలు, ఆందోళనలతో శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, వాటికి అనుమతివ్వబోమని తెలిపారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉంటున్నారన్నారని, టిడిపి, వైసిపిలకు ఇక్కడ ఉనికి లేదని చెప్పారు.
టిడిపి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఓ మిత్రుడి ద్వారా లోకేశ్‌ ఫోన్‌ చేయింరని తెలిపారు. ఒకరికి అనుమతిస్తే.. ఇంకొకరు ర్యాలీ చేస్తారని, అందుకే అనుమతించడం లేదని చెప్పానని వివరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటి కారిడార్‌లో ఉద్యమాలు జరగలేదని కెటిఆర్‌ గుర్తుచేశారు. అరెస్టు వ్యవహారంలో చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు.