Oct 28,2023 07:12

రాష్ట్ర విభజన సందర్భంగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలి. దీనివలన రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. వీటితో పాటు విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా అమలు చేయకుండా ఆంధ్రులకు అన్యాయం చేసింది. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం, 11 జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నంలో ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, విశాఖలో రైల్వేజోన్‌, ఆయిల్‌ రిఫైనరీ, పారిశ్రామిక కారిడార్‌ మొదలగు హామీలలో వేటినీ కేంద్రం అమలు చేయలేదు. గత రాష్ట్ర ప్రభుత్వంగాని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంగాని కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయి. ఈ పరిస్థితులలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రజాభిప్రాయం, ప్రజా ఒత్తిడి ద్వారా సాధించుకోవలసి ఉన్నది.

        అక్టోబర్‌ 7, 8 తేదీలలో విజయవాడలో సి.పి.యం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు' అనే అంశంపై 2 రోజుల సెమినార్‌ జరిగింది. 8 సెషన్లుగా జరిగిన రెండు రోజుల సెమినార్‌లో సి.పి.యం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, ప్రొఫెసర్‌ ఎన్‌.పురేంద్ర ప్రసాద్‌, ప్రొఫెసర్‌ ఎన్‌. వేణుగోపాలరావు, రైతు స్వరాజ్య వేదిక బాలు, 'స్వేచ్ఛ' వై.కిరణ్‌చంద్ర, వి. బాలసుబ్రమణ్యం, రమేష్‌ పట్నాయక్‌, ప్రొఫెసర్‌ సి.రామ చంద్రయ్య, ప్రొఫెసర్‌ వి.అంజిరెడ్డి, చలసాని శ్రీనివాస్‌, పార్టీ నాయకులు పి.మధు, ఎమ్‌.ఏ.గఫూర్‌, వి.శ్రీనివాసరావుతో పాటు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు కూడా రిసోర్స్‌పర్సన్లుగా పాల్గొన్నారు.
          2014 జూన్‌ 2న ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తరువాత గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో వివిధ రంగాల పరిస్థితి, రాజధాని, విభజన హామీలు, ప్రత్యేకహోదా, నీటిపారుదల ప్రాజెక్టులు, పునరావాసం మొదలగు అంశాలను సెమినార్‌లో చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, కౌలురైతులు, పారిశ్రామిక రంగం, ఉపాధి, విద్య, ఆరోగ్య రంగాలు, సామాజిక తరగతులు తదితర అంశాలను చర్చింటమే కాక ప్రత్యామ్నాయ విధానాలను వివరించారు. సెమినార్‌లో చర్చించిన అంశాలు, ప్రత్యామ్నాయ విధానాలు కింది విధంగా ఉన్నాయి.

                                                        వ్యవసాయ రంగ సంక్షోభం-రైతు రక్షణ

మొదటి సెషన్‌ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వి.కృష్ణయ్య వ్యవహరించగా వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల సమస్యలు, కౌలు రైతులపై చర్చ జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర లభించాలి. స్వామినాథన్‌-జయతీ ఘోష్‌, రాధాకృష్ణన్‌ కమిటీల సిఫార్సులు అమలు చేయాలి. ప్రతి కౌలురైతుకు గుర్తింపు కార్డు, రుణం గ్యారంటీ ఇవ్వాలి, కౌలురైతులకు భూ యజమాని సంతకం నిబంధన తొలగించాలి. కౌలు రైతులందరికి భూయజమాని తీసుకున్న రుణంతో సంబంధం లేకుండా, రుణాలు అందించాలి. ప్రతి ఎకరానికి సాగునీరు, మోటార్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి. స్మార్ట్‌ మీటర్ల విధానం ఉపసంహరించుకోవాలి. భూమి లేని వ్యవసాయ కూలీలకు, కౌలురైతులకు 2 ఎకరాల భూమి ఇవ్వాలి. పరిశ్రమలకు సేకరణ చేసిన భూముల్లో పరిశ్రమలు పెట్టకపోతే, రైతులకు వాపస్‌ ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పట్టణ ఉపాధి గ్యారంటీ చట్టం చేయాలి. అసలు పట్టాదారులకే అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించాలి. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.
 

                                                  నీటిపారుదల రంగం-భూసేకరణ-పునరావాసం

ఈ సెషన్‌కు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర రెడ్డి అధ్యక్షత వహించగా, వి.రాంభూపాల్‌, మంతెన సీతారాం, రిటైర్డ్‌ ఇంజనీరు శివరామకృష్ణ రిసోర్స్‌ పర్సన్లుగా పాల్గొన్నారు. నిర్ణీత కాలపరిమితులో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, వెలిగొండ ప్రాజెక్టు, హంద్రీ-నీవా, గాలేరు-నగరిలతో పాటు భారీ, మధ్య, చిన్న తరహా నీటిప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయటానికి నిధులు కేటాయించాలి. గత నాలుగేళ్లలో ఇరిగేషన్‌కు బడ్జెట్‌లో 61,573 కోట్లు కేటాయించి, 32,059 కోట్లు మాత్రమే ఖర్చు చేయటం దారుణమైన విషయం. ప్రాజెక్టులకు భూసేకరణలో 2013 భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు జరపాలి. నిర్వాసితుల పునరావాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్వాసితులకు పూర్తి పరిహారం, పునరావాసం కల్పించాలి. పోలవరం ప్రాజెక్ట్‌ను విభజన చట్టంలో చెప్పిన విధంగా పూర్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కృష్ణానదిలో మన నీటి హక్కులను కాపాడుకోవాలి.
 

                                                    పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి, సేవారంగం

ఈ సెషన్‌కు వి.ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా, సిహెచ్‌ నర్సింగరావు, వై.కిరణ్‌ చంద్ర రిసోర్స్‌పర్సన్లుగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఐ.టి, ఫార్మా, జూట్‌, టెక్స్‌టైల్స్‌, అగ్రి, సినీ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంతో పాటు తిరుపతి, విజయవాడ, అనంతపురం, ఒంగోలు మొదలగు ప్రాంతాలలో ఐ.టి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి. చిన్న పరిశ్రమలకు రక్షణ కల్పించి వాటి అభివృద్ధికి కృషి జరపాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలి. విభజన చట్టంలో చెప్పిన విధంగా కడపలో భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి.
            అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలి. కాంట్రాక్టు కార్మికులను, ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేయాలి. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఒ.పి.యస్‌ పునరుద్ధరించాలి. ప్రైవేటు ఉద్యోగులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పి.ఎఫ్‌ వంటి భద్రతలు కల్పించాలి. ఖాళీగా ఉన్న 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగభృతి రూ.5,000 ఇవ్వాలి.
 

                                                                    విద్య ఆరోగ్య రంగాలు

నాల్గవ సెషన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ అధ్యక్షత వహించగా వి.బాలసుబ్రమణ్యం, రమేష్‌ పట్నాయక్‌, డాక్టర్‌ ఎం.వి.రమణయ్య రిసోర్స్‌పర్సన్లుగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం -2020ని వ్యతిరేకించాలి. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఉన్నత విద్యారంగంలో విశ్వవిద్యాలయాలలో అధ్యాపక ఖాళీలన్నింటినీ భర్తీ చేసి, యూనివర్శిటీలను పటిష్ట పరచాలి. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌, ఇతర ప్రైవేట్‌ విద్యా సంస్థలపై నాణ్యత, ప్రమాణాలతో సహా నియంత్రణ ఉండాలి. 40 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మోగా డిఎస్సీ ప్రకటించాలి. విద్యార్థులందరికి పూర్తి ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ అమలు పరచాలి.
             వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించి సుజాతారావు కమిటీ సిఫార్సులు అమలు పరచాలి. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య కేంద్రాల స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. టీచింగ్‌ ఆసుపత్రులన్నింటిలో సూపర్‌ స్పెషాలిటీ పోస్టులను భర్తీ చేయాలి.
 

                                                                  సామాజిక తరగతులు

ఈ సెషన్‌కు కె.లోకనాధం అధ్యక్షత వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకట్‌, డి.రమాదేవి, ఎ.మాల్యాద్రి, కిల్లో సురేంద్ర తదితరులు రిసోర్స్‌పర్సన్లుగా పాల్గొన్నారు. 2024 నుంచే చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు అమలు జరగాలి. మహిళల రక్షణ, అభివృద్ధికి కమిషన్‌ నియమించాలి. మద్యపానంపై నియంత్రణ, డ్రగ్స్‌ నిర్మూలన జరగాలి. సామాజిక న్యాయం, ప్రైవేట్‌ రంగాలలో రిజర్వేషన్లు, కులగణన, వివక్షతపై కఠిన చర్యలు, సబ్‌ప్లాన్‌ అమలు, దళితులకు రక్షణ, జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సుల అమలు, డప్పు, చర్మ కళాకారులందరికీ పెన్షన్లు అమలు జరగాలి. వృత్తులకు రక్షణ, ఆధునిక పరికరాల సరఫరా, బి.సిలకు సబ్‌ప్లాన్‌ ప్రత్యేక నిధులు, ఎస్సీ, ఎస్టీ, బి.సి కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి రుణాలు, సబ్సిడీలు ఇవ్వాలి. గిరిజనులకు ప్రత్యేక విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. అటవీ సంరక్షణ చట్ట సవరణ రద్దు, పోడు భూములకు పట్టాలు, ప్రత్యేక డీఎస్సీ, ఏజన్సీలో జీవో నెం.3 అమలు జరపాలి. మైనారిటీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు, మత సామరస్యం, సచార్‌ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్‌ సిఫార్సులు అమలు జరపాలి. మైనారిటీల కోసం ఉర్దూ పాఠశాలలు నెలకొల్పాలి. వికలాంగుల చట్టానికి రూల్స్‌ నోటిఫై చేయాలి. ఇతర పెన్షన్లతో సంబంధం లేకుండా వికలాంగులకు నెలవారీ భృతి రూ. 6 వేలు ఇవ్వాలి. పేదలందరికీ 2 సెంట్ల స్థలంతో ఇల్లు, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. పేద మహిళలకు ప్రత్యేక సహాయం అందించాలి. అన్ని రకాల పెన్షన్లు రూ. 5 వేలకు పెంచాలి. ఉద్యోగాలలో బ్యాక్‌లాగ్‌ పోస్టులన్నింటిని భర్తీ చేయాలి. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వటానికి స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేయాలి.
 

                                                  ప్రాంతీయ అభివృద్ధి, వెనుకబాటుతనం, రాజధాని

ఈ సెషన్‌కు చైర్‌పర్సన్‌గా ఎం.ఏ.గఫూర్‌ వ్యవహరించగా ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్య, కె.లోకనాథం రిసోర్స్‌పర్సన్లుగా ఉన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ. లక్ష కోట్లతో ప్యాకేజీ ప్రకటించాలి. విభజన చట్టంలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ అమలు జరపాలి. సమాఖ్య విధానాన్ని పరిరక్షించుకుంటూ రాష్ట్రాల హక్కులు కాపాడాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రాజధాని, పాలనా రాజధాని అమరావతిలో కొనసాగాలి. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి. కర్నూలులో హైకోర్ట్‌, విశాఖపట్నం-విజయవాడలలో హైకోర్టు బెంచీలు ఉండాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమలలో నీటిపారుదల, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయరంగం...అభివృద్ధికి ప్రత్యేక కృషి జరగాలి. ప్రభుత్వాలు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలి.
 

                                                  స్థానిక సంస్థలు-వికేంద్రీకరణ-సచివాలయాలు

ఈ సెషన్‌కు బి.గంగారావు అధ్యక్షత వహించగా సిహెచ్‌.బాబూరావు, ప్రొఫెసర్‌ వి.అంజిరెడ్డి రిసోర్స్‌పర్సన్లుగా వ్యవహరించారు. 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా స్థానిక సంస్థలకు నిధులు-విధులు కేటాయించాలి. గ్రామ, వార్డు సచివాలయాలను స్థానిక సంస్థల పరిధిలోకి తేవాలి. గ్రామీణాభివృద్ధి, పట్టణాల అభివృద్ధికి ఆర్థిక సంఘాల నివేదిక ఆధారంగా నిధులు కేటాయించాలి. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులు స్థానిక సంస్థలే ఖర్చు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. స్థానిక సంస్థలను ప్రజాస్వామ్య వికేంద్రీకరణ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయించాలి. పట్టణ, నగర ప్రాంతాలలో విస్తారమైన ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధిపరచాలి. ప్రజలపై చెత్తపన్ను వంటి అదనపు భారాలు లేకుండా చూడాలి.
 

                                                                విభజన చట్టం-హామీలు

ఈ సెషన్‌ చైర్‌పర్సన్‌గా పి.మధు, రిసోర్స్‌పర్స్‌న్లుగా కె.యస్‌.లక్ష్మణరావు, చలసాని శ్రీనివాస్‌ వ్యవహరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలి. దీనివలన రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. వీటితో పాటు విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా అమలు చేయకుండా ఆంధ్రులకు అన్యాయం చేసింది. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం, 11 జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నంలో ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, విశాఖలో రైల్వేజోన్‌, ఆయిల్‌ రిఫైనరీ, పారిశ్రామిక కారిడార్‌ మొదలగు హామీలలో వేటినీ కేంద్రం అమలు చేయలేదు. గత రాష్ట్ర ప్రభుత్వంగాని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంగాని కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయి. ఈ పరిస్థితులలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రజాభిప్రాయం, ప్రజా ఒత్తిడి ద్వారా సాధించుకోవలసి ఉన్నది.
         సి.పి.యం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానాల కోసం ఈ సెమినార్‌ నిర్వహించింది. దీనితోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రంగాలపై సదస్సులు నిర్వహించింది. వీటి ఆధారంగా 'ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి కోసం' 3 ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు నిర్వహిస్తున్నది. నవంబర్‌ 15వ తేదీన విజయవాడలో జరిగే 'ప్రజా రక్షణ భేరి' ద్వారా ప్రత్యామ్నాయ ప్రజా ప్రణాళికను ప్రజల దగ్గరకు తీసుకువెళ్తున్నది. స్వాగతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి విజ్ఞప్తి .

11